రామోజీ సమాజ సేవ చేయండి.. సామాజిక సేవ కాదు

తప్పుడు రాతలతో ఈనాడు పత్రిక ప్రజలను మభ్యపెడుతోంది

ఎన్నికల ముందు అమరావతికి డబ్బులు కావాలని.. ఇప్పుడు అవసరం లేదని

ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్నా పచ్చపత్రికలు దుష్ప్రచారం

శివరామకృష్ణన్‌ కమిటీ సారాంశాన్ని ఈనాడులో వేయగలరా..?

ఇంత వయస్సు పెరిగినా రామోజీరావు బుర్ర పెరగలేదు

ప్రజలకు ఏం చేయాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు తెలుసు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్లు మాత్రం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీ, ఏబీఎన్‌ చానళ్లు ఇష్టారీతిగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఈ రెండు పత్రికలు, చానళ్లు సమాజం కోసం ఆలోచన చేస్తున్నట్లుగా లేదని, వారి సామాజికవర్గం కోసం చేస్తున్నట్లుగా ఉందన్నారు. తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు అమరావతికి డబ్బులు కావాలని రాసిన ఇదే ఈనాడు పత్రిక.. ఇవాళ డబ్బులు అవసరం లేదని రాసిందని మండిపడ్డారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో వేయగలరా.. అని ప్రశ్నించారు. ఇంత వయస్సు పెరిగినా ఈనాడు రామోజీరావుకు బుర్రపెరగలేదన్నారు. విజయవాడ నుంచి విశాఖకు 400 కిలోమీటర్లు అని రాశారని, మరి విశాఖ నుంచి విజయవాడకు 40 కిలోమీటర్లు అవుతుందా.. చెప్పాలన్నారు. ప్రజలకు ఏం చేయాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బాగా తెలుసున్నారు. ఇలాంటి పిచ్చిరాతలు, టీడీపీ పిచ్చికూతలకు భయపడేది లేదని, ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందన్నారు.
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేశారు. ఆంధ్రరాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడి ఉండడంతో దాన్ని పెంపొందించడానికి చేస్తున్న కృషిలో భాగమే అమ్మ ఒడి. సుమారు 42 లక్షలకు పైచిలుకు తల్లుకు రూ.6318 కోట్లను ఒక్కరోజే ఈ రాష్ట్రంలోని తల్లులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇదొక చరిత్ర. ఇటువంటి కార్యక్రమాలనే కాకుండా ఏడు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ చేస్తున్నారు.

ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే.. కొన్ని పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ప్రజలకు చేరువ చేయాల్సింది పోయి ఒక దుష్ప్రచారంతో ఆ పత్రికలు, చానళ్లు చేస్తున్న వ్యవహారం చాలా బాధాకరం. మీరు సమాజ సేవ చేయాలని తపనతో వ్యవస్థలకు, ప్రభుత్వాలకు అనుసంధానకర్తలమని పెద్ద పెద్ద మాటలు చెబుతారు. అమ్మ ఒడి కంటే ముందు ఎన్నో సంక్షేమ పథకాలను చేసినప్పటికీ అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నా.. ఒక్కటైనా ఈ ఏడు నెలల కాలంలో ఈనాడు పత్రిక, ఈనాడు చానల్, ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి చానల్‌ చేసిందా..? ఎందుకు పేరు పెట్టి అడుగుతున్నానంటే.. సమాజం కోసం ఆలోచన చేయట్లేదు.. మీ సామాజికవర్గం కోసం చేస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు ఒక్కడే కాదు..  ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఉన్నారు. వారి తాలూకా శ్రేయస్సు కూడా చూడాలి. ఏదో కోపంతో, స్వార్థంతో, రాజకీయ పార్టీతో కక్షతో మాట్లాడుతున్న మాట కాదు.

అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి కోట్లాది రూపాయలతో ప్రభుత్వం ఈనాడుకు కూడా ప్రకటన ఇచ్చింది. ఇదే పత్రిక బ్యాక్‌ పేజీ చూస్తే రామోజీరావు తాలూకా స్వార్థం కనిపిస్తుంది.. రామోజీ రావుకు సమాజ స్ఫూర్తి కాదు.. సామాజిక స్ఫూర్తి ఉందని తెలుస్తుంది. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి తెలుసా అని పెట్టి సచివాలయంలో 2016 అక్టోబర్‌ నుంచి పాలన సాగుతుంది.. కాదని ఎవరూ అనలేదు.. దేంట్లో తాత్కాలికంలో సాగుతుంది ఆ మాట దాచారు. శాసనసభ, శాసనమండలిలో 2017 మార్చి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. తాత్కాలిక భవనాల్లో సాగుతున్నాయి. ఇది వాస్తవం కాదని రామోజీరావు చెప్పినా తప్పులేదు. హైకోర్టు 2019 ఫిబ్రవరి నుంచి పనిచేస్తుంది తాత్కాలిక భవనం లోనే.. ఇది వాస్తవం కాదా..? రాజ్‌భవన్‌ 2019 జూలై నుంచి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఇక్కడి నుంచే పనిచేస్తున్నారు. 2019లో వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ ముఖ్యమంత్రి ఉన్న నివాస స్థావరాన్ని గవర్నర్‌కు కేటాయించారు. ఇది తాత్కాలిక భవనం. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో కొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయనేది వాస్తవం. ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్‌ 24న రాజధాని నిర్మాణానికి సాయం కావాలి. తాత్కాలిక అంచనాల వ్యయం రూ.లక్షా 9 వేల 23 వేల కోట్లు కావాలని ఈనాడు రాసింది. 2020 జనవరి 9న అంటే ఈ రోజు అమరావతికి అదనంగా ఖర్చు అవసరం లేదని ఈనాడు రాసింది. ఎన్నికలకు ముందు ఈ గొంతుక.. ఎన్నికల అయిపోయిన తరువాత మరో గొంతుక ఈనాడు పత్రిక ప్రజలను తప్పుదోవపట్టిస్తుంది. రామోజీరావుకు సమాస స్ఫూర్తి కంటే సామాజిక స్ఫూర్తి ఎక్కవగా ఉంది. ఎందుకు ఇలాంటి రాతలు రాసి ఏం సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

రూ.3 వేల కోట్లు పెడితే అంతా అయిపోతుందని మాట్లాడుతున్నాడు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని మీరే రాశారు కాదా.. మీది నోరా.. తాటి మట్టా.. లేక మీ చేతుల్లో ఉంది కలమా.. ఇంకేమైనానా..? మీరు చంద్రబాబు కలిసి ఈ రాష్ట్రంలో కుట్రపన్నుతూ పబ్బం గడుపుకొవాలని చూస్తుంది వాస్తవం కాదా..? హైదరాబాద్‌లో హెడ్‌ ఆఫీస్, జిల్లాకు ఆఫీస్, ప్రింటింగ్‌ కేంద్రం పెట్టారు.. ఉదయానికి పేపర్‌ అందుబాటులోకి రావాలని.. మరి పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రాకూడదా..? రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? ఏం కావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.
శ్రీకృష్ణ కమిటీ ప్రాంతీయ అసమానతలు రాకూడదు. ప్రతి ప్రాంతాన్ని సమన్యాయంతో చూడాలని చెప్పింది. శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో రేపు పేపర్లో ప్రింట్‌ వేయండి. రామోజీరావు సమాజం కోసం ఆలోచన చేస్తే.. శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో వేయండి. బ్రోకర్ల కోసం, దళారుల కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన నిజమైన రైతులు ఉంటే వారిని ఇబ్బంది పెట్టి లేనిపోనివి సృష్టించడం కోసం కొంతమంది స్వార్థ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాదా..? ఇంకా ఎంత కాలం రైతులను మోసం చేస్తారు. మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రకంగా వ్యవహరిస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు అందరూ మీకు తొత్తులుగా ఉండాలా..? మీ అడుగులకు మడుగులు వత్తాలా..? ఇంత వయస్సు పెరిగినా రామోజీరావు బుర్ర పెరగలేదు. విభజన సమయంలో చేసినట్లుగానే ఇప్పుడు చేస్తున్నారు.

రూ.3 వేల కోట్ల ఖర్చు చేస్తే సరిపోతుందని చంద్రబాబు అంటున్నాడు. అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దినట్లుగా 30 సంవత్సరాల తరువాత ఎకరం రూ.20 కోట్లకు అమ్మితే.. రూ.2 లక్షల కోట్లు డబ్బు వస్తాయని చెబుతున్నాడు. అంతవరకు పెట్టిన పెట్టుబడి.. ఆ డబ్బు, రాష్ట్రంలోని అవసరాలు, పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, అనంతపురం జిల్లాలో మూడు పండాల్సిన అవసరం లేదా..? ఏమనుకుంటున్నావు చంద్రబాబూ..? విజయవాడ నుంచి విశాఖకు దూరం అని వార్త రాశారు. విజయవాడ నుంచి విశాఖకు 400 కిలోమీటర్ల దూరం అయితే విశాఖ నుంచి విజయవాడ 40 కిలోమీటర్లు అవుతుందా..? చెప్పండి. అక్కడున్న వారు మనుషులు కాదా..? వారికి అభివృద్ధి అవసరం లేదా..? ఉత్తరాంధ్ర ఇంకా ఎడారిగా మారాలా..? చంద్రబాబు చేసిన లక్షల కోట్ల అప్పు గురించి ఈనాడులో ఎందుకు రాయలేదు.

ప్రజలకు ఏం చేయాలో సీఎం వైయస్‌ జగన్‌కు బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఏం చేస్తే అవసరాలు తీరుతాయో.. వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో మాకు తెలుసు. మహానేత స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వచ్చిన ప్రభుత్వమిది. రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వైయస్‌ఆర్‌ రైతులకు ఎలాగ బ్రాండ్‌ అంబాసిడ్‌ అయ్యారో.. సీఎం వైయస్‌ జగన్‌ కూడా అంతే. తెలుగుదేశం రైతుల కోసం చేసిన  ఒక్క మంచి కార్యక్రమం ఉందా..? వైయస్‌ఆర్‌ చేసిన ఉచిత విద్యుత్‌.. దేశానికి ఆదర్శమైంది. ఇది వైయస్‌ఆర్‌ స్ఫూర్తి కాదా..? ఇలాంటివి కట్టిపెట్టి వాస్తవాలకు రావాలి. ప్రభుత్వాన్ని ఏమో చేద్దామని అనుకంటే ప్రజలు క్షమించరు. ఆఖరికి ఇలాంటి పత్రికలు ఎందుకు చదవాలనే స్థితికి వస్తారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ, వ్యక్తిగత ఆరోపణలతో, స్వలాభాలతో వెళ్లొద్దు.

వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసేముందు ఆయన తాలూకా కార్యక్రమాలన్నింటినీ పిన్‌ టు పిన్‌ ఐదుగురు పెద్దలందరం కలిసి డీజీపీ దగ్గరకు వెళ్లి అన్ని ఇచ్చాం. మా తరుఫున ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తాం. ప్రజాస్వామ్యం ప్రకారం అనుమతి ఇవ్వండి అని కోరాం. అలాగే శాంతియుతంగా పాదయాత్ర చేశాం. ఈ రోజు చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని దురుద్దేశంతో తెలుగుదేశం గూండాలను తీసుకువచ్చి రాత్రి అల్లకల్లోలం చేశారు. ఐదేళ్లు చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు. ఎక్కడ చూసినా అవినీతి కంపు. తాత్కాలిక అసెంబ్లీ కాకపోతే కొత్త అసెంబ్లీకి ఎందుకు ఫౌండేషన్‌ వేశారు. తాత్కాలిక హైకోర్టు కాకపోతే దానికి ఎందుకు ఫౌండేషన్‌ వేశారు.

లోకేష్‌ ఆంబోతు ప్రభుత్వం అంటున్నాడు. నీకంటే ఆంబోతులు ఎవరున్నారయ్య బాబూ.. ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. నీకంటే ఆంబోతు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా..? ఎందుకు అలాంటి భాష వాడడం, అందరం ప్రజా ప్రతినిధులం.. నీలా మీ నాన్నతో ముద్ర వేయించుకొని రాలేదు. ప్రజలు ఎంచుకున్నారు కాబట్టే ఇక్కడున్నాం. రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం. ఈ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖ ఒకటి. అక్కడ అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే..

వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు విశాఖలో భూములు కొన్నారని అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ పేరుతో టీడీపీ దోచుకుతిన్నది. దోపిడీ కోసం మంత్రులు కొట్టుకున్నారు. అలాంటి నీచ చేష్టలు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు. భూముల రికార్డులు మార్చేశారు. ఇలాంటి వెధవ పనులు చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన విధానం, బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తారు. ఒకరి ఆందోళన, ఒక పత్రిక పిచ్చిరాతలకు, బ్లాక్‌ మెయిలింగ్‌లకు ప్రభుత్వం భయపడదు. చిత్తశుద్ధితో ముందుకుసాగుతాం. దయచేసి సమాజ సేవకు రండి.. సామాజిక సేవకు రావొద్ద’ని హితవుపలికారు.

Back to Top