తాడేపల్లి: ఎవరైనా ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాకు అవమానం జరిగింది. దుఃఖం కలిగింది. మాకు కుర్చీ వేయలేదు. స్థానిక ఎమ్మెల్యేతో బాగుండాలి. మా జోలికి స్థానిక ఎమ్మెల్యే రాకూడదు. తమను పార్టీ అవమానించిందని చెప్పి ఇతర పార్టీల్లోకి వెళ్లడం చూశాం. కానీ ఏకంగా రాజీనామాలు చేయడం, వాటిని ఆమోదించాలని పట్టుబట్టడం ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రలోభాలు పెట్టడం, డబ్బులకు మనుషుల్ని కొనుక్కోవడం, వారి పదవులకు రాజీనామాలు చేయించి తద్వారా కొనుగోలుదారుల్ని కూడా చంద్రబాబు సిద్ధం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే..: వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు అనైతిక క్రీడ: ఏ పార్టీ నుంచి అయినా ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలకు వెళ్లిపోతే వారిని అనర్హుల్ని చేయమని స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ ఛైర్మన్ చుట్టూ తిరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. అలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తప్పుడు ఆచారాలకు సీఎం చంద్రబాబు తెర తీశారు. అంటే ఓ పెట్టుబడిదారుడిని వెతుక్కుని వచ్చి, వారితో బయానాలు ఇప్పించి, ఆ వెంటనే వారితో ఆ పదవులు కొనిపిస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపడం నుంచి ఇప్పటివరకూ కూడా రాజకీయ నాయకులకు డబ్బు ఎర వేసి వారిని కొనడం చంద్రబాబు నైజం. చంద్రబాబు అనైతిక క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు వంటి తప్పుడు ఆలోచనలు ఉన్న వారు, రాజకీయాల్లో నైతిక విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలు అంటే గౌరవం లేని వాళ్లు కూడా వస్తారని నాడు రాజ్యాంగం రాసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరు. యథేచ్ఛగా అ«ధికార దుర్వినియోగం నిస్సిగ్గుగా తనపై కేసుల మాఫీ: ఏ శాఖ అయితే నాడు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన తప్పుల్ని వెలికి తీసి, అతను చేసిన అక్రమాలు, అవినీతిపై తగిన సాక్ష్యాలతో కేసులు పెట్టిందో.. ఇప్పుడు అవే శాఖల అధికారులను తాను తిరిగి అధికారంలోకి రాగానే బెదిరించి, నిస్సిగ్గుగా తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా మాఫీ చేయించుకుంటున్నాడు. ఈ స్థాయిలో దేశంలో ఎవరూ, ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండరు. అసలు తనపై కేసుల నమోదు చట్ట విరుద్ధమని దేశంలోనే ఖరీదైన న్యాయవాదులతో కోర్టులో పోరాడిన చంద్రబాబు, దాని వల్ల పని కాకపోవడంతో, చివరకు మెరిట్ మీద కాకుండా అనారోగ్య కారణాలు చూపి, ఒక ప్రైవేటు ఆస్పత్రి సర్టిఫికెట్‌తో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత భారీ ఊరేగింపుతో గంటలకొద్దీ ప్రయాణించి రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకున్నారు. హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఒక్కసారి కూడా ఆస్పత్రికి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. అసలు పవన్‌కళ్యాణ్ సాయంతో, బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే.. తన మీద, తన వాళ్ల మీద ఉన్న కేసులు తీయించుకోవడం, రాజకీయ శత్రువులుగా ఉన్న వారిని కేసులు పెట్టి జైళ్లలో పెట్టించడం, దోచుకోవడం, దాచుకోవడం కోసమే. చంద్రబాబు అధికారుల్ని బెదిరించి ప్రతి కేసులోనూ తప్పుడు కాగితాలపై సంతకాలు పెట్టించి కోర్టులకు ఇచ్చి, క్లీన్ చిట్ తెచ్చుకోవడాన్ని బట్టి ఆయన పునీతుడని అనుకోవద్దు. చంద్రబాబు చేస్తున్న తప్పులకు ఎప్పటికైనా ఆయన మళ్లీ కోర్టు బోనులో నిలబడక తప్పదు. పవన్ ఉప ముఖ్యమంత్రా? లేక మాంత్రికుడా?: కోనసీమలో తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కొబ్బరిచెట్లు చనిపోతున్నాయని ఆయన డిప్యూటీ సీఎంగా చెప్పాడా? లేక ఒక మాంత్రికుడిగా చెప్పారా? ఈ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే వెంటనే కేరళ నుంచి శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చిన వ్యాధి తెలుసుకుని వాటికి చికిత్స చేసి బతికించాలి. తద్వారా చెట్టుకూ, కోనసీమ రైతుకూ జీవం పోయాలి. చేతబడి చేసే వాడిలా దిష్టి తగిలిందని చెప్పడమేంటి?. లోకేష్ విమానాల ఖర్చు ఎవరిది?: మంత్రి నారా లోకేష్, ప్రజల సొమ్ము నయా పైసా కూడా ఖర్చు చేయకుండా విమానాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మరి ఆయన తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, స్పెషల్ హెలికాప్టర్ల ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఇది ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఆయన తన బినామీలతో ఖర్చు పెట్టించి విమానాల్లో తిరుగుతున్నారా? లేక 99 పైసలకే వైజాగ్‌లో భూములు తీసుకున్న వారు ఆ ఖర్చు పెడుతున్నారా?. లేదా ఉర్సా, బిర్సా వంటి కంపెనీలు లోకేష్ ప్రయాణ ఖర్చు భరిస్తున్నాయా?. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుంది. మరి ప్రతి వారం వచ్చి పోతున్నందుకు రూ.20 లక్షలు ఖర్చవుతోంది. అది ఎవరు భరిస్తున్నారు? చంద్రబాబుకు సీఎంగా అధికారం ఉంది. మరి మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక అధికారం ఏముంది?. గత ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్షనేత చంద్రబాబు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నారా? లేదా? అని నేను సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నిస్తే ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విషయంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను నిందిస్తున్న చంద్రబాబు, అప్పుడు జీతం తీసుకోలేదా?. ఆడని సినిమాల్ని అడ్డుకోవడమెందుకు?: పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్‌పై స్పందిస్తూ.. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. కానీ, నిజానికి పవన్‌కళ్యాణ్ సినిమాలేవీ ఆడడం లేదు. కాబట్టి మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటి వరకు పవన్ సినిమాలు కొనుక్కున్న వారు బికారులైపోయారు. ప్రభుత్వానికి ఆ నిర్మాతలు ఇప్పటివరకూ జీఎస్టీ కూడా చెల్లించలేదు. అయినా ఏ అధికారి అడగడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. అమరావతిని చంపేస్తున్న చంద్రబాబు: గత ప్రభుత్వ హయాంలో అమరావతిని చంపేస్తున్నారని పదే పదే ఆరోపించిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ సీఎం కాగానే, ఆయనే స్వయంగా ఆ పని చేస్తున్నారు. రాష్ట్రానికి వస్తున్న ప్రతి కంపెనీని అమరావతిలో కాకుండా, విశాఖలో పెట్టడమే అందుకు నిదర్శనం. అలా అన్నీ విశాఖ వెళ్లిపోతే అమరావతి ఎందుకు? ఇక్కడ కేవలం అసెంబ్లీ, ఆఫీసులు, కోర్టు, చంద్రబాబు ఇల్లు మాత్రమే ఉంటుందట? మరి ఇంకా ఊరు ఏం ఉంటుందని ఇక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తమకు కేటాయించే ప్లాట్లు ఎవరికి అమ్ముకోవాలని రైతులు నిలదీస్తున్నారు. దాదాపు 1000 నుంచి 1500 మంది వరకు పని చేసే కంపెనీలు, సంస్థలన్నీ వైజాగ్ వెళ్లిపోతే.. ఇక్కడ ఎవరుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. బయటి నుంచి ఎవరొస్తారు? ఇక్కడ ఎందుకు ఉంటారు? ఈ పరిస్థితి ఉంటే, అసలు తాము భూములు ఎందుకిచ్చామని ఏడ్చే పరిస్ధితి వచ్చిందని రైతులు బాధపడుతున్నారు. అందుకే మరోసారి చెబుతున్నాం. అమరావతిని చంద్రబాబే చంపేస్తున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.