ఇంటింటికీ రేష‌న్ స‌ర‌ఫ‌రా కొన‌సాగించాలి 

ఎండీయూ వాహ‌నాల‌పై ప్రభుత్వం అబ‌ద్ధాలు

వైయస్ జ‌గ‌న్ కి మంచి పేరొస్తుంటే ఓర్వలేక‌పోతున్నారు

దేశంలోనే ఆదర్శవంతమైన వ్యవస్థను వైయస్ జగన్ తీసుకువచ్చారు

ఎండియూ వాహనాల రద్దుతో 20వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి

వైయ‌స్ఆర్‌సీపీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు ఫైర్

తాడేపల్లి: పేదలకు వైయస్ జగన్ చేసిన ప్రతి మంచినీ తుడిచేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలొనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దే రేషన్‌ను అందించేందుకు గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పేదలకు రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాలను తొలగించాలనే నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని ధ్వజమెత్తారు. 
ఇంకా ఆయనేమన్నారంటే...  

ఎన్నికల‌కు ముందు ఇచ్చిన వాగ్ధానాల‌కు భిన్నంగా కూట‌మి పాల‌న సాగుతోంది. సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయ‌క‌పోగా గ‌తంలో మా ప్ర‌భుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్ర‌మాల‌ను అట‌కెక్కిస్తున్నారు. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ చేయాల‌నే సంక‌ల్పంతో నాడు సీఎంగా వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన ఎండీయూ(రేష‌న్ బండి) వాహ‌నాల‌ను ఆపేస్తామ‌ని తాజాగా చంద్రబాబు ప్ర‌క‌టించారు. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే కార‌ణంతో ఆయ‌న‌కు మంచి పేరొస్తుంటే ఓర్వ‌లేక, దేశం మెచ్చిన ఈ వ్య‌వ‌స్థ‌కు కూట‌మి ప్ర‌భుత్వం మంగ‌ళం పాడేసింది. ఎన్నో రాష్ట్రాల నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు వ‌చ్చి మ‌న రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ఇంటింటికీ రేష‌న్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ను చూసి స్ఫూర్తి పొందడ‌మే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అమ‌లు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్, నాటి ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్‌తో క‌లిసి భారీ స్థాయిలో రేష‌న్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. అచ్చం మ‌న రాష్ట్రంలో మాదిరిగానే ఎండీయూ వాహ‌నాలు రూపొందించారు. 

మ‌హిళ‌ల‌కు మ‌ళ్లీ రేష‌న్ క‌ష్టాలు 

గ‌త ఐదేళ్లు రేష‌న్ కోసం మ‌హిళ‌లు ప్ర‌యాస‌ప‌డ‌కుండా ఇంటి వద్ద‌కే పంపిణీ చేసిన చ‌రిత్ర వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వానిది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మాదిరిగా వేలి ముద్ర‌లు ప‌డ‌లేద‌నే బాధ‌, స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌లు, ప‌నులు మానుకుని రేష‌న్ కోసం నిరీక్షించాల్సి రావ‌డం, రేష‌న్ కోసం వెళ్లినప్పుడు డీల‌ర్ లేర‌ని వెనక్కి రావ‌డం వంటి అనేక స‌మ‌స్య‌లకు పరిష్కారంగా ఇంటింటికీ నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తే ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తే కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా మంగ‌ళం పాడేసింది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. 

రోడ్డున‌ప‌డిన 20 వేల కుటుంబాలు  
 
ప్ర‌భుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణ‌యం కార‌ణంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ 20 వేల కుటుంబాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం రోడ్డున పడేసింది. ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను ఉద్యోగాల నుంచి పీకేసి దాదాపు 2.60 ల‌క్ష‌ల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశారు. ప్ర‌భుత్వం న‌డిపే మ‌ద్యం షాపుల‌ను ప్రైవేటు వారికి అప్ప‌గించి మ‌రో 20 వేల కుటుంబాలకు ఉపాధి దూరం చేశారు. అధికారంలోకి వ‌స్తే రాష్ట్ర యువ‌త‌కు ఏటా 4 ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని హామీ ఇచ్చి   ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా, జ‌గ‌న్ ఇచ్చిన ఉద్యోగాలను వ‌రుస‌పెట్టి పీకేస్తున్నారు. దారుణాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిసి కూడా 24 గంట‌లపాటు మ‌ద్యం దుకాణాల‌ను నిర్విరామంగా నిర్వ‌హించ‌డానికి లేని ఇబ్బంది, రేష‌న్ వాహ‌నాల‌ను కొన‌సాగించ‌డానికి ఎందుకొచ్చిందో ప్ర‌భుత్వం చెప్పాలి.  వృద్ధులు, అంగ‌వైక‌ల్యంతో బాధ‌ప‌డేవారు ఇప్పుడు ఏమైపోవాలి. అవినీతి అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌నే పేరు చెప్పి ఎండీయూ వాహ‌నాల‌ను ఆపేస్తున్నామ‌ని మంత్రి నాదెండ్ల చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. రేష‌న్ షాపుల్లో అక్ర‌మాల‌పై 6 ఏ కేసులు పెడుతున్నారు క‌దా.. వాటిని కూడా మూసేస్తారా? భ‌విష్యత్తులో రేష‌న్ దుకాణాల‌ను కూడా ఎత్తేయాల‌ని చూస్తున్నారా?  వైయస్ జ‌గ‌న్ మీద ఉన్న కోపాన్ని, క‌క్షసాధింపుల‌ను పేద ప్ర‌జ‌ల మీద చూపిస్తే స‌హించం. ఇంటింటికీ నిత్య‌వ‌స‌ర‌ స‌రుకులు పంపిణీ చేసే ఎండీయూ వాహ‌నాల‌ను కొన‌సాగించాలి. 

ఉచితంగా భూములిస్తే భారం కాదా? 

నెల‌లో 15 రోజులు ఎండీయూ వాహ‌నాలు ఇంటింటికీ వెళ్లి ఉద‌యాన్నే రేష‌న్ స‌ర‌ఫరా చేసేవి. మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో స‌చివాలయం వ‌ద్ద‌నే ఉంచేవాళ్లం. ఇంటికొచ్చినప్పుడు రేష‌న్ తీసుకోలేనివారు స‌చివాల‌యం వ‌ద్ద‌నైనా వెళ్లి తీసుకునే విధానానికి రూప‌క‌ల్ప‌న చేస్తే.. కూట‌మి ప్ర‌భుత్వం దాన్ని ప‌క్క‌న పడేసి రేష‌న్ షాపుకే వెళ్లి తీసుకొనే పాత విధానం తీసుకొచ్చారు. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. కానీ త‌మ వారికి మాత్రం కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూముల‌ను 99పైస‌ల‌కే అప్ప‌నంగా ముట్ట‌జెబుతున్నారు. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులుంటే వారిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. గ‌తేడాది కృష్ణా జిల్లాలో వ‌ర‌ద‌లొస్తే ఈ ఎండీయూ వాహ‌నాల ద్వారా ప్ర‌జ‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

Back to Top