కర్నూలు : రైతు పక్షపాతినని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల ద్రోహిగా ఆయన నిలిచారని ఆలూరు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నాయకుడు వీరుపాక్షి మండిపడ్డారు. గత ఏడాది పంట నష్టం జరిగినా రైతులకు ఒక్క రూపాయి పరిహారం కూడా అందించలేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి అయినా, అనావృష్టి అయినా నష్టపోయేది రైతేనని ఆయన అన్నారు. రైతుల సంక్షేమంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా పొందే అవకాశం కల్పించడమే కాకుండా, పంట నష్టం జరిగిన వెంటనే బీమా పరిహారం అందించారని వీరుపాక్షి గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు వేల రూపాయలు బీమా ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ, పంట నష్టపోయినా పరిహారం అందడం లేదని విమర్శించారు. పంట బీమా నిధులు కూడా రైతులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నాయకులే రైతులకు "పంట బీమా కట్టుకోండి" అని చెప్పాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతులకు అండగా నిలిచి, సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలకు తెలుసని వీరుపాక్షి స్పష్టం చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.