వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన గుత్తా ల‌క్ష్మీ నారాయ‌ణ‌

ప‌ల్నాడు డీఎస్పీ కులం పేరుతో దూషించ‌డంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ల‌క్ష్మీనారాయ‌ణ‌

అండ‌గా ఉంటాన‌ని ధైర్యం చెప్పిన పార్టీ అధినేత‌

తాడేప‌ల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని గుత్తా లక్ష్మీనారాయణ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.  గ్రామంలో తొలి నుంచి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానిగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేక పోతున్న పెదనెమలిపురి టీడీపీ నాయకులు, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తనను తీవ్రంగా వేధించడంతో పాటు, ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారని లక్ష్మీనారాయణ వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు స్థానిక డీఎస్పీ ఒకరు, ఏకంగా కులాన్ని ప్రస్తావించి, కమ్మ కులంలో పుట్టి, రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నావని దూషించారని, దీంతో తీవ్ర మనస్థాపం చెందిన తాను, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు.
    దీర్ఘకాల చికిత్స అనంతరం కాస్త కోలుకున్న ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో   వైయస్‌ జగన్‌ను కలిశారు. లక్ష్మీనారాయణ యోగక్షేమాలు విచారించిన  వైయస్‌ జగన్, ఆయనకు ధైర్యం చెప్పారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం కార్యదర్శి పి.శివారెడ్డి తదితరులు ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ను కలిశారు.

Back to Top