పీఆర్సీ నియామక జీఓను సవరించాలి

నలమారు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్

కమిషన్ నివేదిక సమర్పణకు ఏడాది సమయం అనవసరం

మూడు, నాలుగు నెలల సమయం సరిపోతుంది

చంద్రశేఖర్ రెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన పార్టీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్  వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి

కమిషన్ చార్జ్ తీసకున్నాక నివేదికకు ఏడాది గడువు ఇవ్వడం కాలయాపన చేయడానికే

పీఆర్సీ వేస్తామని ప్రకటించి, ఈ మేరకు జీఓ ఇవ్వడానికే నెల రోజులా..?

ప్రభుత్వ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో అనుమానాలు

నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన

ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి అమలు చేయాలి

అక్టోబర్ లోనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలి

చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలి

జాప్యం చేస్తూ మోసపూరిత వైఖరిని అవలంబిస్తే చూస్తూ ఊరుకోం

చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక

తాడేపల్లి:  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ  మరోసారి మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.  తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  ఇటీవల ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ని నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అయితే పీఆర్సీని  నియమిస్తామని ప్రకటించిన తర్వాత కూడా జీవో విడుదలకు నెల రోజుల సమయం తీసుకోవడం కాలయాపన చేస్తూ ఉద్యోగ వర్గాన్ని దగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తమకు అనుమానాలు కలుగుతున్నాయని వివరించారు. పే రివిజన్  కమిషన్‌ను నియమిస్తున్నామని చెప్పడానికి ఒక పేజీ జీవో ఇవ్వడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందో, ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఇంత నెమ్మదిగా ఎందుకు వ్యవహరిస్తోందో అని ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు.   పీఆర్సీ  చార్జ్ తీసుకున్న తర్వాత నివేదిక సమర్పించేందుకు ఏడాది గడువు ఇవ్వడాన్ని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నలమారు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేసారు. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియలో గణనీయమైన జాప్యం జరిగిందని, ఇప్పుడు మరో ఏడాది సమయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించడం, వివిధ వర్గాలతో చర్చించడం వంటి ప్రక్రియను మూడు, నాలుగు నెలల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపారు. కంప్యూటర్ యుగంలో పీఆర్సీ నివేదిక కోసం ఏడాది సమయం అవసరం లేదని స్పష్టం చేసారు. ఏడాది సమయం  తీసుకోకుండా మూడు, నాలుగు నెలల్లోనే నివేదిక సమర్పించేలా సవరించిన జీఓ జారీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

మ్యానిఫెస్టోను అమలు చేసి తీరాల్సిందే..

ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని హామీ  కూటమి మ్యానిఫెస్టోలో ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సరే ఇంకా  ఆ హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతనాలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది.  దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేంద్ర పీఆర్సీ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యేకంగా పీఆర్సీలను ఏర్పాటు చేసి ఉద్యోగుల వేతన సవరణను అమలు చేస్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వ హయాంలోనే పీఆర్సీ  ఏర్పాటు చేసి కమిషన్ చైర్మన్‌ను నియమించారు.   కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిషన్ చైర్మన్‌తో రాజీనామా చేయించి, కొత్త కమిషన్‌ను వెంటనే నియమించకుండా సుదీర్ఘకాలం ఖాళీగా ఉంచింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ  పునరుద్ధరిస్తుందని ఉద్యోగులు భావించారు.  కానీ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. 

అక్టోబర్‌లోనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలి

ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇకపై వాయిదా వేయకండి. అక్టోబర్ నెలలోనే 30 శాతం ఐఆర్ ప్రకటించండి. పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయండి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు న్యాయం చేయండి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కేవలం ప్రకటనలు, జీవోలతో కాలయాపన చేస్తే భవిష్యత్‌లో ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది.   పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియలో మూడేళ్లకు పైగా జాప్యం జరిగింది. మరో ఏడాది నివేదిక కోసం వేచి చూడాల్సి వస్తే ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుంది. అందుకే పీఆర్సీ చార్జ్ తీసుకున్న వెంటనే ఉద్యోగులకు 30 శాతం ఐఆర్ ప్రకటించాలి. గతంలో పీఆర్సీ  ఏర్పాటు చేసిన తేదీని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు న్యాయం చేయాలి. పీఆర్సీ అమలు తేదీని భవిష్యత్తులోకి నెట్టడం ద్వారా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తగ్గించే ప్రయత్నం చేయకూడదు. పీఅర్సీ అమలు ఆలస్యమైనా ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నష్టపోకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.

 బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలు, పీఆర్సీ, ఐఆర్ తదితర అంశాల్లో ఉద్యోగ వర్గాలకు రావాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం సమగ్రంగా స్పష్టత ఇవ్వాలి.  ఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? అనే విషయాలను ఉద్యోగులకు తెలియజేయాలి.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము కోరుతున్నాం. మేము కొత్తగా ఏమీ అడగడం లేదు. ఎన్నికల సమయంలో మీరే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నాం. మెరుగైన పీఆర్సీ ఇస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఉద్యోగులు చూస్తూ ఊరుకోరు

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మరింత కాలయాపన చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు.  పీఆర్సీ నివేదిక కోసం ఏడాది గడువును తగ్గించి మూడు లేదా నాలుగు నెలల్లో నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోనేలా జీఓను సవరించాలి. అదే సమయంలో కమిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా తక్షణమే 30 శాతం ఐఆర్ మంజూరు చేయాలి. లేకుంటే మ్యానిఫెస్టో తరహాలోనే కాలయాపన చేస్తూ  ఉద్యోగ, పెన్షనర్స్ వర్గాన్ని మరోసారి మోసం చేయూలని చూస్తే వారిలో వ్యతిరేకత తీవ్రతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.

Back to Top