చంద్రబాబు చరిత్రహీనుడు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకోవడం దుర్మార్గం

ఇన్నాళ్లూ బీసీల ఓట్లతో అధికారం అనుభవించి వెన్నుపోటు పొడిచాడు

బలహీనవర్గాలకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఇన్నేళ్లూ బలహీనవర్గాల ఓట్లతో అధికారం అనుభవించి.. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే దాన్ని కుట్రపూరితంగా టీడీపీ అడ్డుకుందని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్‌ను అడ్డుకున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో అనేక సార్లు నిరూపణ అయ్యిందని, ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని కోరుకుంటారా అని బహిరంగంగా మాట్లాడాడని, బీసీలు జడ్జి పదవులకు పనికిరారని చంద్రబాబు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. 

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌ బోన్‌లుగా మారుస్తానని సీఎం వైయస్‌ జగన్‌ ఏలూరులో జరిగిన బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించారని, ఆ ప్రకారమే బీసీల అభివృద్ధికి ముందుకు సాగుతున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు 59 శాతం రిజర్వేషన్‌ కల్పించి ఎన్నికలకు సిద్ధమైతే .. టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డితో పిటీషన్‌ వేయించి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్‌కు చంద్రబాబు అడ్డుకట్ట వేశాడని మండిపడ్డారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి చేయకపోగా.. వారిని అవమానించే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన నాయీ బ్రహ్మణులను తోక కత్తిరిస్తానని మాట్లాడిన చంద్రబాబుకు బీసీలంతా గుణపాఠం చెప్పారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. 
 

Back to Top