విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని అరకు ఎంపీ డాక్టర్ జి. తనూజ రాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన ఆరుగురికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ ప్రమాదానికి భద్రతా ప్రమాణాల అమలులో జరిగిన వైఫల్యాలే కారణమా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలవాలని ఎంపీ కోరారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాల పునరావాసం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, వైయస్ఆర్‌సీపీ నాయకులు బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ తనూజ రాణి ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.