చంద్రబాబు ఆరు నెలల పాలన వైఫల్యాల పుట్ట

డైవర్షన్‌ రాజకీయాలకు కేరాఫ్‌ చంద్రబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

పవన్‌కళ్యాణ్‌ను వాడుకుని సీపోర్ట్‌ వివాదం సృష్టించాడు

ప్రైవేటు కంపెనీల మధ్య వ్యవహారాలపైన కూడా తప్పుడు కేసులు 

వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, వారికి అనుకూల సంస్థలే చంద్రబాబు లక్ష్యం

సొమ్ము వెనుకేసుకోవడంలో లోకేష్‌ బిజీబిజీగా ఉన్నాడు

పవన్‌కళ్యాణ్‌ ద్వారా చంద్రబాబు అనుకున్న విధంగా తన కుతంత్రాలు అమలు చేస్తున్నాడు

నిన్న కల్తీ నెయ్యి అన్నాడు.. ఈరోజు పోర్ట్‌లో వాటాలు అంటున్నాడు

గుర్తు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు 

పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు తప్పుడు రాతలు 

తరువాత అదే రాతలపై మాట్లాడుతూ అక్రమ కేసుల బనాయింపు

బ్యాంక్‌ ఖాతాలకు నామినీలు ఉంటారే కానీ.. ఆడిటింగ్‌ సంస్థలకు కాదు

కేపీరావు సంస్థ నుంచి చట్టబద్దంగా కొనుగోలు చేసిన వాటాలను కూడా తప్పు అంటారా?

ఆడిట్‌లో లోపాలు ఉంటే సవరించుకోవాలని చెప్పడం సాధారణం

దాన్ని అడ్డు పెట్టుకుని వాటాలను దక్కించుకోవడం ఎక్కడైనా జరుగుతుందా?

సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

మోసపూరితంగా పుట్టిన సంస్థ ఈనాడు పత్రిక

మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై నేటికీ కోర్టులో కేసు నడుస్తోంది

మార్గదర్శి చిట్స్‌లో తలకు తుపాకి గురి పెట్టి రామోజీ వాటాలు రాయించుకున్నారు

దీనిపై జెజె రెడ్డి వారసులు వేసిన కేసు కోర్టు విచారణలో ఉంది

ఇటువంటి అక్రమాలతో కూడిన ఈనాడు పత్రిక చంద్రబాబు గొంతుగా మారింది

మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

చంద్రబాబుకు ధనదాహం తీరడం లేదు

జగన్‌ గారు, ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యాపారులను టార్గెట్‌ చేస్తున్నారు

భవిష్యత్తులో వీరంతా జగన్‌ గారికి అండగా నిలుస్తారని భయపడుతున్నాడు

అందుకే తప్పుడు కేసులు పెట్టి ఆయా సంస్థల్లోని సొమ్మును కాజేద్దామని అనుకుంటున్నారు

2019లో కాకినాడ సీపోర్ట్‌ గురించి పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడారో గుర్తు లేదా?

కేవీ రావు చంద్రబాబు బినామీ అంటూ ఆరోపించలేదా?

ఈరోజు పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ పోర్ట్‌ కు వెళ్లింది ప్రజాసేవ కోసమా?

చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పోర్టులో పవన్‌కళ్యాణ్‌ హంగామా

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఆక్షేపణ

తాడేపల్లి: పవన్‌కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కాకినాడ సీ పోర్ట్‌ లో చంద్రబాబు çసృష్టి్టంచిన హాంగామా వెనుక పోర్ట్‌ వాటాలను దక్కించుకోవాలనే కుట్ర ఉందని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సంస్థలపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం, అక్రమ కేసులను బనాయించడం వెనుక చంద్రబాబు ధనదాహం ఉందని ఆయన దుయ్యబట్టారు.
    కాకినాడ సీపోర్ట్‌లో వాటాలపై వివాదాన్ని సృష్టించి, తన బినామీ కేవీ రావు ద్వారా తిరిగి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. దానిలో భాగంగానే తనకు వంత పాడే ఈనాడు పత్రికలో అబద్ధాల కథనాలు రాయిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలపై కేసులు బనాయిస్తున్నారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. 

పాలనా వైఫల్యం. డైవర్షన్‌ పాలిటిక్స్‌: 
    లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పి, ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు తన పరిపాలనలో తీవ్రంగా వైఫల్యం చెందుతున్నాడు. చంద్రబాబు తీరును చూసి ప్రజలే కాదు, సొంత పార్టీ వాళ్లు కూడా వ్యతిరేకించిన పరిస్థితులు కేవలం ఆరు నెలల కాలంలో చూస్తున్నాం. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అనేక రకాలుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు, తన రాజకీయ జీవితంలో చివరి నాలుగు సంవత్సరాల్లో ఎంత పోగేసుకోవాలో అంత పోగేసుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. దీని కోసం ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఒప్పందాల్లోకి చొరబడి, వాటిని తన మనుషులకు కట్టబెట్టడమో, లేక లాక్కోవడమో చేయాలని చూస్తున్నాడు. 
 
వివాదాల సృష్టితో లబ్ధి:
    పరస్పర అంగీకారంతో జరిగిన ఒప్పందాలపైనా వివాదం
పరస్పర అంగీకారంతో చేసుకున్న ఒప్పందాలపై  లేని వివాదాన్ని సృష్టించి, అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టి, ఆ ఆస్తులను తన మనుషులకు కట్టెబట్టే ప్రయత్నంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీకి చెందిన నాయకులను తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కోసం తన చేతిలో ఉన్న మీడియా సంస్థలను చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది. 

సీపోర్టు వివాదంలో బాబు లక్ష్యం ఏమిటి?:
    కాకినాడ సెజ్‌ వ్యవహారం చూసినా, కాకినాడ సీ పోర్టు వ్యవహారం చూసినా చంద్రబాబు మోడస్‌ ఆపరండీ ఏంటో చాలా స్పష్టం కనిపిస్తోంది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూటమిలోని మరో పార్టీ జనసేనను, తనకు అత్యంత సన్నిహితుడు బినామీగా పేరు పడ్డ కేవీరావును వాడుకుంటున్నాడు.
    ఒక వైపు తెర వెనకుండి చంద్రబాబు కథను నడిపిస్తుంటే, మరోవైపు ఆయన చేతిలో ఉన్న ఎల్లోమీడియా బురద జల్లి, చంద్రబాబు  చేసేవి తప్పులు కావు, అని ఒక ఒక కలరింగ్‌ ఇవ్వడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. హేతుబద్ధత లేని ఆరోపణలు, దగాకోరు విమర్శలు, లాజిక్‌ లేని సందేహాలు.. ఇలా ఇష్టానుసారంగా కథనాలు రాస్తూ, వాస్తవాలు ప్రజలకు చేరనీయకుండా, వారిని తప్పుదోవ పట్టించేలా, ప్రయత్నిస్తూ చంద్రబాబు దోపిడీకి రాచబాట పరిచే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది. 
    కాకినాడ సీ పోర్టును లెక్కలేసి కొట్టేశారని, సాయిరెడ్డిగారి కంపెనీ నామినీ సంస్థే ఆడిట్‌ చేసిందని, ఆడిట్‌ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కుట్రలో భాగంగానే స్పెషల్‌ ఆడిట్‌ బాధ్యతలు ఇచ్చారని ఇష్టానుసారం రాశారు. నిజాలతో సంబంధం లేకుండా, తమ ఆరోపణలు న్యాయ పరిధిలో నిలుస్తాయా? లేదా? సహేతుకత ఉందా? లేదా? అని కూడా చూసుకోకుండా.. తాము వేయాలనుకుంటున్న బురదకు కాస్త మసాలా కలిపి, ఏదో వంటకాన్ని తయారు చేసి, దాన్ని అచ్చేశారన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 

ఛార్టెడ్‌ అక్కౌంటింగ్‌ సంస్థలకు నామినీలు ఉండరు:
    నిన్ననే సాయిరెడ్డిగారు చాలా స్పష్టంగా చెప్పారు. బ్యాంకు ఖాతాలకు నామినీలు ఉన్నట్టుగా ఛార్టెడ్‌ అక్కౌంటింగ్‌ సంస్థలకు నామినీలు ఉండరని కుండబద్దులు కొట్టినట్లు నిజాలు చెప్పారు. అయినా సరే, నిజాలతో చంద్రబాబునాయుడుకు, ఆయన ఎల్లోమీడియాకు సంబంధం లేదు.
    కేవలం కాకినాడ సీ పోర్టులో వాటాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఆడిట్‌ కోసం పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్పీ కంపెనీని పెట్టారని కూడా మరొక అసత్య ఆరోపణ చేశారు. వ్యాపార సంస్థల నిర్వహణ, వాటిలో ఆడిటింగ్‌ పట్ల సాధారణ ప్రజలెవ్వరికీ కూడా పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఏదో ఒకటి రాయాలని రాస్తున్నారు. 2019లో ఏడాది చివర్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమో కేవలం ఒకే ఒక్క పోర్టుపై ఆడిట్‌ అన్నట్టుగా రాశారు. ఇది చాలా తప్పు.

ఆడిటింగ్‌ అన్నిచోట్లా రెగ్యులర్‌ ప్రాసెస్‌:
    ఆడిటింగ్‌ అన్నది ప్రతి ఏడాది, ప్రతి సంస్థలోనూ, ప్రతి కంపెనీలోనూ కూడా క్రమం తప్పకుండా చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ రంగ వ్యవస్థలు, శాఖలు, ఇతరత్రా సంస్థలపై కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటింగ్‌ జనరల్‌ (కాగ్‌) ప్రతి ఏటా కూడా ఆడిట్‌ చేస్తూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు, ఆదాయాలు, అక్కౌంటింగ్‌ పుస్తకాలపైన ప్రిన్సిపల్‌ అక్కౌంటెంట్‌ జనరల్‌ ఆడిటింగ్‌ చేస్తారు. తాము ఆడిట్‌ చేసినప్పుడు గుర్తించిన అంశాలను వెల్లడిస్తూ ప్రతి ఏటా రిపోర్టులు కూడా రిలీజ్‌ చేస్తారు.
    ప్రైవేట్‌ కంపెనీలు, కార్పొరేట్‌ కంపెనీలు కూడా సర్టిఫై అయిన ఛార్టెడ్‌ అక్కౌంటింగ్‌ ఏజెన్సీలకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. వీళ్లు కూడా రిపోర్టులు ఇస్తారు. ఏదో ఈ ప్రక్రియ కొత్తగా జరిగినట్టుగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది. చివరకు ఈనాడు సంస్థల్లో కూడా ఆడిటింగ్‌ జరుగుతుంది కదా? ఈ పద్ధతిలోనూ కాకినాడ సీ పోర్టుపై పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్పీ ఆడిట్‌ చేసింది. కాకినాడ సీ పోర్టు వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 22శాతం వాటా ఉంది. ఈనేపథ్యంలో ఆడిటింగ్‌ చేస్తే తప్పు ఎలా అవుతుంది?
    కాకినాడ సీ పోర్టుపై పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్పీ చేసిన ఆడిటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.965 కోట్ల మొత్తాన్ని ఎగవేసిందని గుర్తించి, చివరకు దాన్ని రూ.9  కోట్లకు తగ్గించారని, అసలు కొన్ని నెలల వ్యవధిలోనే అంత తేడా ఎందుకు వచ్చిందని మరొక ఎల్‌కేజీ పిల్లాడి ప్రశ్న వేస్తూ ఎల్లోమీడియాలో మరో ఆరోపణ చేశారు. కాగ్‌ చేసినా, లేక సర్టిఫైడ్‌ ఆడిటింగ్‌ ఏజెన్సీలు చేసినా, వాళ్లు ఇచ్చే రిపోర్టుల్లో ఆడిటింగ్‌ సందర్భంగా తాము గుర్తించిన అంశాలను, అభ్యంతరాలను పొందు పరుస్తారు. ఈ అభ్యంతరాలు మీద వివరణ ఏంటని, సంబంధిత శాఖ లేక సంబంధిత కంపెనీని అడుగుతారు. వారు ఆ అభ్యంతరాలకు తగిన వివరణలను పంపిస్తారు. అవి సంతృప్తికరంగా ఉంటే, అలాంటి అభ్యంతరాలు తొలగించి, సంతృప్తికరంగా లేని వాటిని స్పష్టంగా రాస్తారు. కంపెనీల నిర్వహణ చట్టం ప్రకారం వాటిని తొలగించుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, వాటిని కంపెనీలు వినియోగించుకుంటాయి.
    కొన్ని చోట్ల జరిమానాలు చెల్లించడం, మరికొన్ని చోట్ల నిర్దేశించిన మొత్తాలను చెల్లించడం అన్నది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా? కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నట్టుగా? అభూత కల్పనలు సృష్టించేందుకు చంద్రబాబుగారు, ఆయన ఎల్లోమీడియా నానా ప్రయత్నాలు చేస్తోంది. కారణం ఏంటంటే.. ఏదోరకంగా ఆ ఆస్తులను కొట్టేయాలని, అందులోని వాటాలను చేజిక్కించుకోవాలన్నది చంద్రబాబుగారి టార్గెట్‌. 
    పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్పీ అన్న కంపెనీ ఆషామాషీ కంపెనీ కాదు. 1978 నుంచి ఇది దేశంలో అనేక కంపెనీలకు, వ్యవస్థలకు సేవలందిస్తోంది. షిప్పింగ్, మెరైన్, ఎయిర్‌పోర్టు కన్సల్టింగ్, ఎయిర్లైన్, ట్రాన్సో్పర్ట్‌ లాజిస్టిక్, ఆటోమోటివ్, ఎనర్జీ.. ఇలా ప్రముఖ రంగాల్లో ఆడిటింగ్, కన్సల్టింగ్‌ సేవలందిస్తోంది. చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో విస్తరించింది. ఇలాంటి కంపెనీలను టార్గెట్‌ చేసి ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. పైగా సాయిరెడ్డిగారు కూడా ఒక సర్టిఫైడ్‌ ఛార్టెడ్‌ అక్కౌంటెంట్‌. ప్రొఫెషనల్‌గా ఒకరికొకరు తెలిసి ఉండడం తప్పు అవుతుందా? ఈ దేశంలో డాక్టర్లు, పాత్రికేయులు, ఎడిటర్లు, వాటి యాజమాన్యాలు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులుం, ఇలా ఒకే ప్రొఫెషన్లో ఉన్నవారు ఒకరికి ఒకరంటే పరిచయడం ఉండదా? ఇలా ఉండటం తప్పు అవుతుందా? ఎల్లోమీడియా, చంద్రబాబు ప్రచారం చూస్తుంటే ఒక అబద్ధాన్ని నమ్మించడానికి వీరు ఎంత స్థాయికైనా దిగజారిపోతారని అర్థం అవుతోంది.  

బాబు ప్లాన్‌ అందరికీ తెలుసు:
    కాకినాడ సీపోర్టు వ్యవహారంలోనూ, కాకినాడ సెజ్‌ వ్యవహారంలోనూ చంద్రబాబు ప్లాన్‌ ఏంటో ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరో వచ్చి కొట్టేశారని కేకలు పెడతాడు? సందడ్లో సడేమియాలో తనకు కావాల్సిన వారికి దాన్ని కట్టబెట్టేస్తాడు. బ్యాక్‌ డోర్లో దానికి సంబంధించిన కమీషన్లన్నంటినీ కూడా రప్పించుకుంటాడు. గతంలో చంద్రబాబు చేసిందీ, ఇదీ, ఇప్పుడు చేస్తున్నదీ ఇదే. దీని కోసం కూటమిలోని పార్టీలను, అందులోని మనుషులను ఎంత వాడుకోవాలో, అంత వాడుకుంటాడు. 

అందరూ తమలా అనుకున్నారు!:
    కాకినాడ సీ పోర్టులో మెడమీద కత్తిపెట్టి లాక్కున్నారని చంద్రబాబుగారు, ఆయన ఎల్లోమీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అలా చేయాలనుకున్న వారు రూ.500 కోట్ల డబ్బులు ఎందుకు ఇస్తారు? 41 శాతం మైనర్‌ వాటా ఎందుకు కొంటారు? అసలు కథ ఏంటంటే మార్గదర్శి చిట్‌ఫండ్‌ సహ వ్యవస్థాపకుడు జేజే రెడ్డి కుటుంబంపై రామోజీరావు తుపాకీ గురిపెట్టి వాటాలు రాయించుకున్న దానిపై కేసు కూడా ఉంది. బహుశా తాము చేసినట్టుగానే అందరూ చేసి ఉంటారని వారు అనుకోవడంవల్లే కాకినాడ సీపోర్టుపై ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

ఇదీ చంద్రబాబు నైజం. విధానం: 
    చంద్రబాబు ఏదైనా కొట్టేయాలనుకున్నప్పుడు లేదా లాగేసుకోవాలనుకున్నప్పుడు తానొక పెద్దమనిషిలాగ, అక్రమాలను అడ్డుకుంటున్న వీరుడి లాగా కలరింగ్‌ ఇవ్వడం, ఆ ముసుగులో దోచుకోవడం అన్నది ఆయనకు అలవాటు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఇలాంటి పథకాన్ని చెక్కచెదరనీయకుండా అమలు చేసుకుంటూ ఇవాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడుకీ లేని ఆస్తి కూడబెట్టుకున్నాడు. 

అంతా మాఫియా రాజ్యం:
    ఇప్పుడు కూడా చంద్రబాబు అంతే. తన నోటితో ఒకటి అంటాడు, చేత్తో ఇంకోటి చేస్తాడు. ఇసుక వ్యవహారంలో జోక్యం వద్దు, తప్పులు చేస్తే వదిలేది లేదని ఎమ్మెల్యేలతో అంటాడు.. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీయే. పేరుకు ఉచితం.. కానీ వైయస్సార్సీపీ కన్నా.. ఇప్పుడు డబుల్‌ రేటు పలుకుతోంది. 
    మద్యం విధానం పారదర్శకం, ఎవరైనా కమీషన్లు అడిగితే ఖబడ్దార్‌ అంటాడు.. మొన్న మద్యం టెండర్లు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూసింది. కిడ్నాపులు, బెదిరింపులు, దాడులు, 30 శాతం కమీషన్లుంఒక మాఫియా రాజ్యాన్ని రాష్ట్రంలో చూశాం.

చెప్పేదొకటి. చేసేదొకటి!:
    బెల్టుషాపు పెడితే బెల్టు తీస్తాం అంటాడు. రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ బెల్టుషాపులే. బెల్టుషాపుల కోసం వేలం పాటలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా తప్పుడు పోస్టులు పెడితే.. పీడీచట్టం అంటాడు. మా వ్యక్తిత్వాలను దెబ్బ తీస్తున్నారని, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని వైయస్సార్సీపీ ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. 
    కానీ, అదే అధికార పార్టీ వారు చిన్న ఫిర్యాదు చేసినా, సోషల్‌ మీడియా వర్కర్లపై పదుల కొద్దీ కేసులు పెట్టి, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. చట్టాన్ని, ప్రాథమిక హక్కులనూ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
    ధాన్యం కొనుగోలులో సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా. తేడా వస్తే అధికారుల్ని, ఉద్యోగుల్ని సహించం.. అంటాడు. కనీస మద్దతు ధర రూ.1725 ఉంటే, రైతులు రూ.400 నుంచి రూ.500 తక్కువకు అమ్ముకుంటున్నారు.
    ఇదీ చంద్రబాబుగారి బాగోతం. చెప్పేదొకటి. చేసేదొకటి. పైకి ఒకటి చెప్తాడు. ఇంకోటి చేస్తాడు. అంతా దోపిడీయే. కాకినాడ సీ పోర్టు కూడా అంతే. బయటకు చెప్పేది ఒకటి.. లోపల జరుగుతున్నది ఇంకొకటి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వివరించారు.

Back to Top