తాడేపల్లి: భారతదేశంలో భూమిపై హక్కులు అనే విధానంపై క్లారిటీ కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 1989లో కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ డీసీ వైద్య ద్వారా కమిషన్ నియమించి ఎలాంటి రికార్డుల వ్యవస్థ ఉండాలో నివేదిక కోరారని చెప్పారు. ఆ కమిషన్ మన దేశంలో టైటిల్‌కి గ్యారెంటీ ఉండే వ్యవస్థ తీసుకురావాలని సిఫారసు ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తానంతట తానుగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తోందని అన్నారు. శిస్తు వసూలు చేసుకోవడానికి 1బీ, అడంగల్ వంటివి మత్రమే తెచ్చారని తెలిపారు. భూమిపై ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ప్రాజెక్టులు టేకప్ చేసేలోపు కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తుచేశారు. టైటిలింగ్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించిందని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలమేరకు 2019లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపారని తెలిపారు. రెండుసార్లు వెనక్కి వెళ్లొచ్చి.. 2023లో ఆమోదం పొందిందని చెప్పారు. దేశంలోనే సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66శాతం భూములకు సంబంధించిందేనని చెప్పారు. ఆ 66 శాతంలో లక్ష ఆదాయంలోపు ఉన్నవారి కేసులో 90 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం 60 శాతం హత్యలు భూ వివాదాలు వల్ల జరుగుతున్నాయని అన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతుందని, 17 వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల అప్డేషన్, సర్వే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, వివాదాలు లేని రికార్డులు తయారవుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో జరుగుతున్న సర్వే గురించి తెలుసుకుంటున్నారని అన్నారు. రికార్డులన్నీ అప్ డేట్ అయ్యాక, సర్వే పూర్తయ్యాక చట్టం నోటిఫై చేస్తామని చెప్పారు. ఇదంతా అయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు చట్టాన్ని ఆగమేఘాలమీద అమలు చేయడం లేదని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయని, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా ఎలాంటి రూల్స్ విధించాలో కసరత్తు జరుగుతోందని తెలిపారు. భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టేకప్ చేసిందని పేర్కొన్నారు. రూల్ ఫ్రెమ్ చేసేటప్పుడు అందరి సలహాలు పాటిస్తామని అన్నారు. న్యాయవాదులు విధులకు హాజరు కావాలని, దేశంలో కంక్లూజివ్ టైటిల్ ఇవ్వడం విశేషమని తెలిపారు.