చంద్రబాబూ.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి

వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్  

తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుకు ఎందుకంత భయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని రుజువులు ఉన్నా పారదర్శకంగా జరిగాయంటూ మీకు మీరుగానే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటారా?, స్కాములు చేసిన వాళ్లే తమకు తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే వాటికి విలువ ఏముంటుంది చంద్రబాబూ? అని నిలదీశారు.

డీఎస్సీ అక్రమాలపై మరొకవైపు తమ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీ గూండాలను అందులోకి ఉసిగొల్సి  మరీ దాడులు చేయిస్తారా?,  ఇది డైవర్షన్‌ పాలిటిక్స్‌ కాదా? చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌. అసలు సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం.. ఎందుకంత ఉక్రోషం?   అని నిలదీశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన శైలిని వైఎస్‌ జగన్‌ ఎండగట్టారు.

ఇది మీ దిగజారుడుతనానికి నిదర్శనం.. 
‘ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు.

విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు..?
ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత. మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్‌ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు.

నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం
లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్‌ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్‌ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు

పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది’ అని వైఎస్‌ జగన్‌  స్పష్టం చేశారు.

 

Back to Top