తాడేపల్లి: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పేరిట అర్హులను ముంచి, పోస్టులను బరితెగించి అమ్ముకున్న కూటమి ప్రభుత్వం.. ఆ అక్రమాలను ప్రశ్నిస్తే ‘యువగళం’ గూండాలతో దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని వైయస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా వినతిపత్రం ఇచ్చేందుకు ముందే సమాచారం ఇచ్చినా నిరాకరించిన పోలీసులు, మరోవైపు శాప్ కాంపౌండ్‌లోనే స్పోర్ట్స్ కోటా టీచర్లకు టెంట్లు, మైకులు వేసి రక్షణ కల్పించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలను రప్పించి తమ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడటం ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దాడేనని, ఈ దారుణాలపై కూటమి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పితీరాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్సీ ఇంతటి పెద్ద స్థాయి స్కామ్ కావడంతోనే కింది స్థాయి అధికారులను అడ్డుపెట్టుకుని, ఏ తప్పూ జరగలేదంటూ దబాయించి బుల్డోజ్ చేసేందుకు ఈ వెన్నుపోటు కూటమి సర్కారు బరితెగించి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో భారీగా అక్రమాలు, పోస్టుల బేరసారాలు జరిగాయన్నది పచ్చి నిజమని, ఈ కుంభకోణంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని స్పష్టం చేశారు. 3.5 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును కాలరాస్తున్న ఈ దుర్మార్గపు విధానాలపై మేధావులు, ప్రజా సంఘాలు, బాధితులు ఏకమై గళమెత్తాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమన్నారంటే... నియంతల పాలనను తలపిస్తున్న కూటమి సర్కారు.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడానికి దబాయించడం, అవసరమైతే ఎదురుదాడికి దిగడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. డీఎస్సీలో జరిగిన దారుణాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుప్పంలో కూర్చుని ఏదో ఘోరం జరిగిపోయిందంటూ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. అసలు అబద్ధం, దుర్మార్గం, బరితెగింపు, క్రూరత్వం.. వీటన్నింటి కలయికే ఈ వెన్నుపోటు ప్రభుత్వం. తండ్రీకొడుకుల అహంకారం, లెక్కలేనితనం పరాకాష్టకు చేరాయి. డీఎస్సీ పేరుతో అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారనడానికి ప్రతిరోజూ సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా దందా - లీకేజీలు, ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం మొదట స్పోర్ట్స్ కోటాకు డీఎస్సీ అర్హత పరీక్ష అవసరం లేదని ఎందుకు నిబంధనలు మార్చారు? నియామకాలు పూర్తికాగానే మళ్లీ పాత పద్ధతి పెడతామని ఎందుకు వెనక్కి తగ్గారు? అక్కడే అసలు అనుమానం మొదలైంది. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నపత్రాల వ్యవహారంలో ఉంటూ, పరీక్ష రాసి టాప్ ర్యాంక్ సాధించడం, తీరా అభ్యర్థి కోర్టుకు వెళ్లేసరికి జాబితా మార్చడం వీళ్ల అక్రమాలకు నిదర్శనం కాదా? గోల్డ్ మెడలిస్టులను కాదని, కనీస అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. స్పోర్ట్స్ అసోసియేషన్లే స్వయంగా ఆ సర్టిఫికెట్లు తాము ఇవ్వలేదని నిర్ధారిస్తున్నాయి. కనీసం స్పోర్ట్స్ సర్టిఫికెట్ లేనివారికి, బీటెక్ అయ్యాక స్కూల్ గేమ్స్ ఆడినట్లు తప్పుడు రికార్డులు సృష్టించిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఫోన్ నంబర్లతో సహా డబ్బుల బేరసారాల ఆడియోలు, వీడియోలు బయటపడినా ప్రభుత్వం ఎందుకు కప్పిపుచ్చుతోంది?స్పోర్ట్స్ అసోసియేషన్లే కొన్ని సర్టిఫికెట్లు తమవి కావని చెబుతున్నప్పుడు, అవి వెరిఫికేషన్‌లో ఎలా పాస్ అయ్యాయి? కొంతమందికి అసలు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? సీనియర్ స్థాయి పోటీలకు సంబంధించిన అర్హత ఉండాల్సిన చోట స్కూల్ గేమ్స్ సర్టిఫికెట్లతో ఎలా ఎంపిక చేశారు?. టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు వచ్చిన కేసులు బయటపడుతున్నాయి. ఒక సబ్జెక్టుకు అర్హత ఉన్నవారిని సంబంధం లేని మరో సబ్జెక్టులో ఎలా నియమించారు?. టెట్ లేదు, అర్హత లేదు.. ‘సెవెన్ స్టెప్స్’ అంతా మోసం! టీచర్ పోస్టుకు అవసరమైన విద్యార్హతలు లేకపోయినా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. చదివిన సబ్జెక్టుకు, నియమించిన సబ్జెక్టుకు కనీస సంబంధం లేదు. హిందీ చదివితే మ్యాథ్స్, సోషల్ చదివితే సైన్స్ పోస్టులిచ్చారు. ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీలో దానికి సంబంధం లేని వారికి కొలువులు కట్టబెట్టారు. ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్న ‘సెవెన్ స్టెప్ వెరిఫికేషన్’ అంటే ఇదేనా? ఈ ఏడు దశల పరిశీలనలో టెట్ పాసయ్యారా లేదా, సర్టిఫికెట్ ఒరిజినలా కాదా అనేది చూడలేదా? లేక ఎంత రేటు ఫిక్స్ చేశారు, ఎన్ని వాయిదాల్లో డబ్బులు ముట్టాయి, యువగళం రిఫరెన్స్ ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేశారా? కడపలో ఆర్డీవో గత డిసెంబర్‌లోనే మోసాలపై నివేదిక ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదు? శాప్ వద్ద టీడీపీ ‘యువగళం’ మూకల దాడి - పోలీసుల పక్షపాతం.. శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా వినతిపత్రం ఇస్తామని మేము నాలుగు రోజుల క్రితమే కార్యక్రమాన్ని ప్రకటించాం. కానీ మాకు సెక్షన్ 30 పేరుతో అనుమతి నిరాకరించిన పోలీసులు.. అక్కడ టీడీపీ, యువగళం మూకలకు మాత్రం టెంట్లు, డీజేలు, మైకులు ఏర్పాటు చేసుకునేలా పూర్తి సహకారం అందించారు. రాత్రికి రాత్రే బస్సుల్లో జనాలను తరలించి, స్పోర్ట్స్ కోటా టీచర్లను ముందుపెట్టి మాపై దాడి చేయించారు. పోలీసులే దగ్గరుండి లాఠీలు యువగళం సభ్యులకు ఇచ్చి మా నాయకులు, కార్యకర్తలను కొట్టించారు. మా వాళ్ల తలలు పగిలాయి, ఫ్రాక్చర్లు అయ్యాయి. అటు నుంచి రాళ్లదాడి జరుగుతుంటే, ఒక ఎల్లో మీడియా మాత్రం ‘వైఎస్సార్సీపీ దాడి’ అంటూ బురదజల్లుతోంది. ఉద్యోగార్థుల తరఫున నిలబడిన మా పార్టీ ఆఫీసు వద్దకు అనుమానాస్పద వ్యక్తులను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. ఇది 3.5 లక్షల మంది భవిష్యత్తు సమస్య - ధర్డ్ పార్టీ విచారణ చేయాల్సిందే..? ఇది పార్టీల మధ్య రాజకీయ వైరం కాదు. కోచింగ్‌ల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏళ్ల తరబడి కష్టపడి చదివిన 3.5 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలకు సంబంధించిన అంశం. రెవెన్యూ, క్రీడా శాఖలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అధికారులు, ప్రశ్నపత్రాల తయారీదారులు.. ఇన్ని వ్యవస్థలు ప్రమేయమైన ఇంతటి భారీ కుంభకోణం వెనుక నారా లోకేష్, చంద్రబాబుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కేసును లోకలైజ్ చేసి ముగించాలని చూస్తున్నారు. నిజంగా మీ ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయకపోతే స్వతంత్ర ఏజెన్సీ అయిన సీబీఐతో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? విచారణకు ఆదేశించండి. ఒకవేళ మా ఆరోపణలు అబద్ధమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరువే పోతుంది కదా? నిప్పులాంటి వాళ్లమని చెప్పుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? రికార్డులు మొత్తం మీ చేతుల్లోనే ఉన్నాయి.. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు మీరే క్లీన్‌చిట్ ఇచ్చుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారు? తప్పు జరగలేదని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారంటే విచారణకు అంగీకరించి నిరూపించుకోవాలి. ఏ శాఖ బాధ్యత తీసుకుంటుంది? డిఎస్సీ ఎంపికలో రెవెన్యూ శాఖ ఉంది. క్రీడలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి. సర్టిఫికెట్లు వెరిఫై చేసిన అధికారులు ఉన్నారు. పరీక్ష నిర్వహించిన వ్యవస్థ ఉంది. ప్రశ్నపత్రాలు తయారు చేసినవారు ఉన్నారు. ఇన్ని వ్యవస్థలు పాల్గొన్న నియామకాల్లో ఇన్ని తప్పులు జరిగితే దీనికి సూత్రధారులు ఎవరో తేలాల్సిందే. ఇది కేవలం ఒక అధికారి లేదా ఒక శాఖతో ముగిసే విషయం కాదు. ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలి. నిజాయితీగా ఎంపికైన వారికి మేం వ్యతిరేకం కాదు.. ఈ నేపధ్యంలో సక్రమంగా, మెరిట్ ఆధారంగా ఎంపికైన నిజాయితీపరులకు మేము వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కానీ అడ్డదారిలో డబ్బులు ఇచ్చి వచ్చినవారిని, వారికి సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రేపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటన్నింటి లెక్కలు తేలుస్తామన్నారు. మెరిట్ ఉన్న అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ వైయస్సార్సీపీ పోరాటం ఆగదని.. ఈ అన్యాయంపై రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, యువత గొంతు విప్పి ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.