అనంతపురం : టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పాలనలో డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీతో కలిపి రూ.4.58 లక్షల కోట్ల మేర ప్రజలకు సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కనబెట్టి అప్పులపాలైందని, రెండేళ్లలో భారీగా అప్పులు చేసినా ఆ నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయో ప్రజలకు చెప్పలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆయన మండిపడ్డారు. డీఎస్సీ నియామకాల విషయంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీస్‌స్టేషన్లు అధికార పార్టీ నేతల అడ్డాలుగా మారిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతోందన్నారు. రాయలసీమ నీటి హక్కులను కూడా ప్రభుత్వం విస్మరించిందని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకుంటూనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేసిందన్నారు. తెలంగాణ నీటి వినియోగంపై ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించలేకపోయారని, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆయన, అక్రమ కేసులకు ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న అనంతపురంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో వైయస్ఆర్‌సీపీ బలాన్ని నిరూపించాలని కార్యకర్తలకు సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడుకోవాలని కోరారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనకు, చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి మాట్లాడుతూ వైయస్ జగన్ పాలన సంక్షేమానికి చిరునామాగా నిలిస్తే, కూటమి పాలన వెన్నుపోటుకు ప్రతీకగా మారిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సమావేశం సందర్భంగా అనంతపురం నియోజకవర్గంలో గత రెండేళ్లుగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ప్రజా పోరాటాలను ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు నాయకులు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.