అందరికి మంచి చేయాలన్నదే నా  విధానం

నాలో మంచి ఉంది కాబట్టే అందరూ మద్దతుగా నిలిచారు

ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు.. మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నా

గత ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదాలు చేసింది

2014లో రాజధాని హైదరాబాద్‌నూ కోల్పోయాం

తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది

ప్రాంతాల మధ్య సమస్యలు వస్తాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది

సూపర్‌ క్యాపిటల్‌ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పింది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అసెంబ్లీ: అందరికి, అన్ని ప్రాంతాలకు మంచి చేయాలన్నదే నా విధానమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకు వికేంద్రీకరణ చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీలో సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..సీఎం మాటల్లోనే..

రాష్ట్ర బాగోగుల దృష్ట్యా సీఎంగా ప్రజలకు వివరణ ఇస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన రోజు. వెలగపూడిలో టెంపరరీ అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ సభలో తీసుకోబోయే నిర్ణయాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఒక విషయం చెప్పదలుచుకుంది. మా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దిద్దుబాట్లు అనడం కరెక్టు. ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీలో సమావేశం కావడానికి దారి తీసిన పరిస్థితులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా అవతరించిన రోజు నుంచి 2014 జూన్‌లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అవరణ నుంచి 2014-2019 వరకు అనేక పరిణామాలు గమనిస్తే..రకరకాల పొరపాట్లు జరిగాయి. చారిత్రాత్మక తప్పిదాలు జరిగాయి. ఉద్దేశపూర్వకంగా అన్యాయాలు జరిగాయి. 1953లో రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాస్‌ను పోగొట్టుకున్నాం. ఆతరువాత ఉమ్మడి రాష్ట్రంగా అవతరిస్తూ కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తరువాత మరోసారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రాలుగా ఉన్న మూడు నగరాలను వరుసగా వదులుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడి ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయాం. ఏ జాతికి అయిన చరిత్ర అనేక పాఠాలు చెబుతుంది. వాటి నుంచి ఎవరైనా నేర్చుకుంటేనే భవిష్యత్‌ ఉంటుంది. 1937లో శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది. 1937లో మద్రాస్‌ రాష్ట్రంతో కలిసి ఉండగా రాష్ట్రంలోని తెలుగువారంతా బలంగా కావాలని నిర్ణయం తీసుకున్నారు. 1937లో అప్పట్లో రాయలసీమకు సంబంధించి శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది. ఆ రోజుల్లో మద్రాస్‌ నుంచి వేరుపడాలని, తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని అందరూ ఏకమై శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. ప్రముఖ నాయకులు ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. స్వాతంత్ర్యానికి పదేళ్ల ముందే అందరూ ఏకమై శ్రీబాగ్‌ ఒడంబడిక చేసుకున్నారు. ఆ రోజు తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని, అన్నదమ్ముళ్లుగా బతకాలని, ప్రాంతాల మధ్య తగాదాలు రాకూడదని ఒప్పందం చేసుకున్నారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉండాలి అన్న అంశం నుంచి హైకోర్టు, రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయాలు జరిగాయి. అన్నింటిపై చర్చిస్తూ ఆ రోజుల్లోనే ఒక ఒప్పందానికి వచ్చారు. హైకోర్టు, రాజధాని ఒకే చోట ఉండటం సరికాదు. ప్రతిప్రాంతానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేస్తూ 1956 వరకు అక్కడే రాజధానిగా కొనసాగించారు. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌పై అధ్యాయం చేసింది. చదువులు, ఉద్యోగాలు, ఆదాయాలు ఏయే జిల్లాల్లో ఏలా ఉన్నాయో పరిశీలించింది. నీరు, నిధులతో అసమానతలు ఈ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి రహిత్యం వల్ల వచ్చింది. అభివృద్ధి కేంద్రీకృతం వల్లే రెండో ఉద్యమం వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఇది మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు శ్రీకృష్ణ కమిటీ ఏమి చెప్పిందో చూద్దామంటూ ఓ వీడియో చూపించారు. అభివృద్ధి అన్నది ఒకే చోట కేంద్రీకృతం కావడంతో ఎలాంటి నష్టాలు అన్నది శ్రీకృష్ణ కమిటీ చెప్పంది.
ఆ తరువాత శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పింది. విడిపోయిన తరువాత ఏపీ అభివృద్ధి అంతా కూడా ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదని చెప్పింది. శివరామకృష్ణ కమిటీని చంద్రబాబు వక్రీకరించారు. గంటన్నర పాటు బాబు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు  ఇష్టమైన పాంప్లేట్‌ చానల్‌లోనే శివరామకృష్ణ కమిటీ ఏమి చెప్పిందో చూద్దాం. సూపర్‌ క్యాపిటల్‌ వద్దే వద్దు అంటూ ఈ కమిటీ సూచించింది. వేరే చోట భూముల డిటైల్స్‌ అడిగినా కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని తన నివేదికలో చెప్పింది. చంద్రబాబు కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. 
చంద్రబాబుకు ఈ కమిటీలు చెప్పిన మాటలు వినపడలేదు.  ఇదే ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, అందుకే సలహాలు మాత్రమే ఇవ్వగలమని శివరామకృష్ణ తన నిస్పృహను వెల్లడించారు. దీ హిందు న్యూస్‌లో ఒక వ్యాసం కూడా రాశారు. రాజధానిపై కన్నుపడింది. దూరదృష్టి లోపించిందని ఆ వ్యాసం అర్థం. ఏపీ రాష్ట్ర నాయకత్వ శక్తులను, ఆర్థిక వనరులను ఈ ప్రాజెక్టుపై పెట్టేయాలన్న చంద్రబాబు ఆలోచన రాష్ట్రానికి ఆత్మహత్య సాదృశ్యమని వ్యాఖ్యానించినట్లు సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు.
ఇదే శివరామకృష్ణ, శ్రీకృష్ణ కమిటీలు పరిశీలిస్తే ఈ కమిటీలే మేం వేయలేదు. ఈ రెండు కూడా చంద్రబాబు విప్‌ జారీ చేసి కాపాడిన కాంగ్రెస్‌ పార్టీ కాదా?. పెద్దలు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ప్రాంతాల పరంగా అనేక ఆకాంక్షలు ఉన్నా కూడా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నింటిని గడ్డిపరక కంటే చిన్నగా చూశారు. వన్‌సైడ్‌గా చంద్రబాబు చేయాలనుకున్నది చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీజీ రిపోర్టు, జీఎన్‌ రావు కమిటీలు వేశాం. గతంలోని కమిటీల మాదిరిగానే వికేంద్రీకరణకు ఓటు వేశాయి. ఈ నివేదికల సారాంశాలను హైపవర్‌ కమిటీ వేశాం. ఈ కమిటీ కూడా నివేదికలు ఇచ్చింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ సూచనలు చేసింది. జిల్లాల వెనుకబాటుకు సంబంధించి నేటి వాస్తవాలు చెప్పింది. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములు కొనుగోలు చేయించారు. అందరికీ ఒకవైపు నూజీవీడు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయి. ఆ రాతలన్నీ కూడా వీళ్ల లీకులతోనే వచ్చాయి. ఇదే తెలుగు దేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి నష్టపోలేదు. జీవో 254ను 30,2014లో విడుదల చేశారు. ఆ రోజు పబ్లిక్‌ డోమైన్లోకి ఈ ఊర్లపేర్లు వచ్చాయి. ఇవాళ ఆ భూములు పోతాయని వీళ్లు బాధపడుతున్నారు. పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించింది. స్టేట్‌ను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చారు. రాజధాని కోసం భూములా? లేక తాను, తన బినామీల కోసం భూములా అని  ఇదే సభ నుంచి చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొట్టారు. మరి కొందరిని ప్రలోభపెట్టారు. కొందరిని బెదిరించారు. 144 సెక్షన్‌ అన్నది ఇదే ప్రాంతంలోని మచిలీపట్నంలో నాలుగేళ్లుగా నిరంతరాయంగా కొనసాగించారు. మా ప్రభుత్వం వచ్చేదాకా 144 సెక్షన్‌ విధించారు. కోర్టుల్లో వీళ్లకు ఉన్న పలుకుబడితో అశ్చర్యం అనిపించింది. 33 వేల ఎకరాలు రాజధాని కోసం తీసుకున్నారు. ఎవరైనా కూడా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే..విజయవాడకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పెట్టుబడి పెడతాం. పచ్చగా మూడు పంటలు పండే గ్రామాల్లో విజయవాడ, గుంటూరుకు దూరంగా ఉన్న గ్రామాల్లో..నిర్మాణాలకు అనువుకాని గ్రామాల్లో, రోడ్లు కూడా సరిగ్గా లేని ప్రాంతాలను ఎంపిక చేశారు. బేతపూడి విజయవాడ నుంచి 33 కిలోమీటర్లు, అబ్బరాజుపాలెం 30 కిలోమీటర్లు, శాఖమూరు 29 కిలోమీటర్లు, ఐనవోలు గ్రామం విజయవాడకు 27 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేలపాడు 26.3 కిలోమీటర్లు, గుంటూరుకు 34 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెలగపూడి గ్రామం గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కావాలని ఇక్కడే భూములు కొనాలని ఆలోచన ఎందుకు వస్తుంది. ఇది చాలాదా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెప్పడానికి. చంద్రబాబు సీఎం అయిన తరువాత, రాజధానికి నోటిఫికేషన్‌ రాకముందే వీళ్లు భూములు కొనుగోలు చేశారు. రైతుల వద్ద నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. మా లెక్కలే 4070 ఎకరాలు టీడీపీ నేతలే కొనుగోలు చేశారు. చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ పేరుతో కూడా కొనుగోలు చేశారు.
విజయవాడలో ప్రకాశం బ్యారేజీ దాటి ఒక్క వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్టపై నుంచి వెళ్లాల్సిన ప్రాంతం రాజధాని. రాజధాని నిర్మించాలని ఎవరికైనా ఆలోచన వస్తుందా? చంద్రబాబుకు ఎప్పుడైనా తిరిగారా? ఆయన భూములు కొనుగోలు చేసిన తరువాత ఈ గ్రామాల పేర్లు తెలిసి ఉంటాయి. ఎకనామిక్‌ సూపర్‌ పవర్‌గా ఏపీ రాజధాని ఉండరాదన్న శివరామకృష్ణ నివేదికను నీరుగార్చేందుకు నారాయణ కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీలో సుజనా చౌదరి, గల్ల జయదేవ్‌..వీళ్లంతా ఏ రంగంలో నిపుణులు. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు సొంత కమిటీ వేసుకున్నారు. సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు ఇవి కాకుండానే మరో సినిమా చూపించారు. అన్ని ఇక్కడే పెడతామని చెప్పారు. ఒక్క అంగుళం కూడా పని జరగలేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయని కమిటీలు చెప్పినా కూడా ఇందుకు సంబంధించిన డేటా నిరూపించినా కూడా రైతులకు అవసరమైన నీటి కోసం చంద్రబాబు తాపత్రయ పడలేదు. కోట్ల కోసం, తన భూముల రేట్ల కోసం చంద్రబాబు తపిస్తున్నారు. 
చంద్రబాబు అమరావతి నిర్మాణానికి కనీస సదుపాయాలకే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పన  అక్షరాల  రూ. లక్ష తొమ్మిది వేల కోట్లు అవసరం అని ఈనాడులో చెప్పింది. 53 వేల ఎకరాలు అంటే 8 కిలోమీటర్ల రేడియస్‌లో కనీస సదుపాయాలు కల్పించేందుకు ఇంత ఖర్చు అవుతుందని చంద్రబాబు రిపోర్టులోనే చెప్పారు.  కనీసం రూ.4 నుంచి 5 లక్షల ఖర్చు అవుతుంది. కొత్త రాజధాని ఊరికే అయిపోదు అని ఆ రోజుల్లో చంద్రబాబు అన్నారు. ఈ రోజు మాత్రం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని చెబుతున్నాడు. సీఎంగా ఉంటూ కొత్త కట్టడాలకు రూ.14 వేల కోట్లకు చంద్రబాబు టెండర్లు పిలిచారు. ఆయనకు ఏ రకంగా సూట్‌ అయితే ఆ రకంగా మాట్లాడుతారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎలా యూటర్న్‌లు తీసుకున్నారో చూశాం. ఇంత భారీ ప్రాజెక్టును మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేవలం మౌలిక సదుపాయాలకు లక్ష తొమ్మిది వేల కోట్లు అవుతుందని చెప్పిన పెద్ద మనిషి ..ఏకంగా బాహుబలి సినిమా సెట్టింగ్స్‌ చూపించారు. ఐదేళ్లలో ఇదే పెద్ద మనిషి రాజధానికి ఎంత ఖర్చు పెట్టారంటే రూ. 5674 కోట్లు మాత్రమే. బకాయిలుగా వదిలేసిన డబ్బులు రూ.2297 కోట్లు. ఏ ప్రభుత్వం అయినా కూడా గరిష్టంగా ఐదేళ్ల కాలంలో రూ.5 వేల నుంచి, 6 వేల కోట్లు ఖర్చు పెట్టగలదు. ఏడాదికి ఈ లెక్కన రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తూ చంద్రబాబు చూపిస్తున్న గ్రాఫిక్స్‌ అమరావతి పూర్తి చేయాలంటే ఎన్ని ఏళ్లు పడుతుందో ఆలోచన చేయాలి. ఎంతో వేగంగా కట్టానని చంద్రబాబు ఇస్తున్న బిల్డప్‌ చూస్తే కనీసం వందేళ్లు పడుతుంది. అదే లక్ష కోట్లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. గేర్‌ మార్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వదిలేస్తే..20 ఏళ్లు పడుతుంది. అసలు, వడ్డీ కలిపితే 20 ఏళ్లకు లక్ష కోట్లు, రూ.3.12 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 30 ఏళ్లు అయితే రూ.5.97 లక్షల కోట్లు అవుతుంది. నిజానికి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ప్రాజెక్టుకు కేవలం మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు అనుకుంటే ఎలా సాధ్యం. చంద్రబాబు గ్రాఫిక్స్‌లో రాజధానికి వెళ్లే రాజమార్గం ఏ రోజు కూడా ఈనాడు, చంద్రజ్యోతి ఒక్క ఫోటో కూడా చూపలేదు. ఇదే దారి టెంపరరీ అసెంబ్లీ, సెక్రటేరియట్‌కు వెళ్తుంది.
అమరావతి గురించి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏ డబ్బు పెట్టాల్సిన పని లేదంటున్నారు. ప్లేట్‌ మార్చారు. బంగారు బాతు గుడ్డు అంటున్నారు. ఇంగ్లీష్‌ మీడియంపై వద్దన్నారు. అనేక ఉద్యమాలు ఏడు నెలల్లో చేసిన చంద్రబాబు, ఎల్లోమీడియా ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అమ్మితే డబ్బులు వస్తాయంటున్నాయి. గ్రీన్ ట్రిబ్యూనల్‌, నదీ ప్రవాహక ప్రాంతం కావడంతో సింగపూర్‌ కంపెనీలు కూడా వెనక్కి వెళ్లాయి. కేవలం 5020 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి మిగులుతుంది. ఈ భూములు అమ్మితే లక్ష కోట్లు రావాలంటే ఎకరం ఈ రోజు రూ.20 కోట్ల చొప్పున అమ్మాలి. నిజంగా ఇంత ధరకు అమ్ముడపోయే పరిస్థితి ఉందా?, 20 ఏళ్ల తరువాత ఎకరం రూ.90 కోట్లకు అమ్మే పరిస్థితి వస్తేనే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ వస్తుంది. రాజధాని నగరం 8 కిలోమీటర్ల రేడియస్‌లో ఉంటుంది. లక్ష 10 వేల కోట్లు పెట్టగలిగే ఆర్థికపరిస్థితి మనకు ఉందా? 2014 వరకు అప్పు రూ.96వేల కోట్లు ఉంటే..2014 నుంచి 2019 వరకు బాబు దోపిడీ పుణ్యమా అంటూ మరో లక్ష 50 వేల కోట్లు అప్పు పెరిగింది. ఈ లెక్కన రూ.2.57 లక్షల కోట్ల అప్పుతో మా పాలన మొదలైంది. ఇది కాక కార్పొరేషన్ల పేరుతో మరో రూ.50 వేల కోట్లు ఉంది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.39,423 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు కరెంటు ఉత్పత్తి సంస్థలకు బకాయిలు రూ.21,540 కోట్లు ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఏం చేయలేనని  ఆలోచన చేయలేదు. ఎన్ని బాధలు ఉన్నా కూడా మేం భరించాం. ప్రజలను సంతోషపెడుతున్నాం. 
మరో లక్ష కోట్లకు పైగా రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉందా?. అప్పు తీసుకురావాలంటే దేన్ని ఫణంగా పెట్టాలి. కృష్ణ పరిస్థితి చూస్తే నానాటికి దయనీయంగా ఉంది. 47 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కలు చూస్తే శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 1200 టీఎంసీలు అయితే..ఏకంగా తగ్గి 600 టీఎంసీలకు వచ్చింది. కృష్ణా నదిపై ఆధారపడి 8 జిల్లాలు ఉన్నాయి. తాగునీరు ఢోకా లేకుండా ఇవ్వాలి. గోదావరి నీళ్లు కృష్ణాలోకి తీసుకువస్తే తప్ప ఢోకా ఉండదు. ఇది చేయాలంటే గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీరు తీసుకురావాలంటే అక్షరాల రూ.68 వేల కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు చెప్పారు. ఈ ఖర్చు ఎలా తగ్గించాలని తెలంగాణ రాష్ట్రంతో మాట్లాడి ప్రతి పైసా మిగిల్చేందుకు కింద మీద పడుతున్నాం. ఇంత భారీ ప్రాజెక్టును చేయాలా వద్దా? వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఊపిరి పోసే ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్టుకు పోలవరం నుంచి ఎడమ కాల్వ ద్వారా నీటిని తరలించేందుకు రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇంజీనీర్లు చెబుతున్నారు. రైతులకు నీళ్లు వస్తే సాగుభూములు బాగుపడుతాయి. చేద్దామా? వద్దా? అని అడుగుతున్నాను. 
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాజెక్టుల పరిస్థితి చూస్తున్నాం. నీరు ఉన్నా కూడా ప్రాజెక్టులు నింపుకోని పరిస్థితి. కెనాల్స్‌కు నీళ్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. కరువుతో అల్లాడుతున్న ఈ జిల్లాలకు కాల్వల సామర్ధ్యం పెంచి, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు రూ.28 వేల కోట్లు అవుతుంది. కాదని చెప్పే మనసు ఎలా వస్తుంది? నడుస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులు నాన్నగారి హయాం నుంచి కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆ ప్రాజెక్టులకు ఇంకా రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది. మనమంతా కూడా వ్యవసాయంపై బతుకుతున్నాం. జలయజ్ఞంలోని ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే సబ్సిడీ కింద ట్రాన్స్‌కోకు అక్షరాల రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. గతంలో చంద్రబాబు ఏ రోజు కూడా రూ.1200 కోట్లకు మించి ఇవ్వలేదు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమాలు తరువాత ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ అమలు చేసేందుకు 10 వేల మెగా వాట్లతో సోలార్‌ ప్లాంట్లు కట్టాలని సలహా ఇచ్చారు. ఇందుకు రూ.36 వేల కోట్లు ఖర్చు అవుతుంది. 
స్కూళ్లు, ఆసుపత్రులు చూస్తున్నాం..దారుణంగా ఉన్నాయి. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన పరిస్థితి చంద్రబాబు పాలనలో చూశాం. సెల్‌ఫోన్‌ లైట్లతో ఆపరేషన్లు చేశారు. ఇలాంటివి మార్పు చేయాలంటే నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కనీస సౌకర్యాలు, మంచినీళ్లు, కంపౌండ్‌వాల్‌, ఫ్యాన్స్‌ వంటి సౌకర్యాలకు రూ.12 వేల కోట్లు, ఆసుపత్రులకు రూ.14 వేల కోట్లు అవసరం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేద్దామా? వద్దా?
రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి చూస్తున్నాం. మూడు రోజుల క్రితం వాటర్‌ గ్రీడ్‌ కోసం ఈస్ట్‌గోదావరి, వెస్ట్‌గోదావరి, శ్రీకాకుళం, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లు ఇచ్చేందుకు రూ.45 వేల కోట్లు అవుతుంది. ఈ జిల్లాలకు రూ.12 వేల కోట్లతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాను. భావనపాడు, మచిలీపట్నంలో పోర్టు వస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యం. ప్రకాశం జిల్లాలోని రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులు కట్టడానికి రూ.15 వేల కోట్లు ఖర్చు అవుతుంది. 
ప్రతిపేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేందుకు దాదాపుగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఉగాదికి సిద్ధం చేస్తున్నాం. ఏడాదికి 6 లక్షల చొప్పున పక్కా ఇల్లు కట్టాలి. ఇది చేయాలంటే ఏడాదికి రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుంది.
మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూస్తే..దాదాపు 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 46 లక్షల మందికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. 43 లక్షల మందికి అమ్మ ఒడి కింద డబ్బులు ఇచ్చాం. 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన, రైతులకు పెట్టుబడి నిధి, ధరల స్థిరీకరణ, పేదలకు నాణ్యమైన బియ్యం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ రాజధాని అంటూ 8 కిలోమీటర్లకు మరో లక్ష కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా?
నాకు అమరావతి నిర్మాణం చేయాలని ఉంది. ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నాకు ఉంది. కచ్చితంగా మేలు చేయాలని తాపత్రయ పడుతా. కానీ చేయగలిగే పరిస్థితి ఉందా? చంద్రబాబుకు  పిల్లనిచ్చిన ఎన్‌టీఆర్‌ది ఇదే జిల్లా నిమ్మకూరు అయితే..నా మేనత్తను కూడా ఇదే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గణపవరానికి ఇచ్చాం. ఇది కూడా మా జిల్లానే అని గర్వంగా చెబుతున్నాను. మా కుటుంబానికి ఇక్కడ రాజ్‌, యువరాజ్‌ థియేటర్లు ఉన్నాయి. మా పట్ల ఇదే జిల్లా ప్రజలు అపారమైన ప్రేమ చూపించారు. ఇదే జిల్లాల్లో 33 ఎమ్మెల్యేల్లో 29 మంది  మా పార్టీ మీదే గెలిచారు. ఈ జిల్లాలో నివసించే ప్రతి ఒక్కరూ నావారే. నాలో మంచి ఉంది కాబట్టే మా పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కొంత మంది మద్దతిస్తున్నారు. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. అందుకే అడుగుతున్నాను. అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ..రాజధానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టగలమా?. అమరావతిని సహజంగానే అభివృద్ధి చెందేలా అన్ని రకాలుగా సహకరిస్తాం. పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ అడుగులు ముందుకువేస్తాం. అమరావతి కూడా ఏదో ఒక రోజు మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడే లెజిస్లేటివ్‌ రాజధానిగా కొనసాగిస్తాను. ఎక్కడైనా కూడా మనకున్న తక్కువ డబ్బుతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. విజయవాడ, గుంటూరు జిల్లాలను పరిశీలిస్తే 18 లక్షల జనాభా ఉంది. వీటికి రూ.500 కోట్లు ఇస్తే బ్రహ్మండమైన అభివృద్ధి జరుగుతుంది. తాడేపల్లి, మంగళగిరిని మోడల్‌ మున్సిపాలిటీ కింద అభివృద్ధి చేసేందుకు అంచనాలు తయారు చేశారు. కేవలం రూ.1100 కోట్లు పెడితే బ్రహ్మండంగా అభివృద్ధి చెందుతాయి. ఇదే కృష్ణా జిల్లాలో విజయవాడలో కృష్ణ లంక ముంపుకు గురవుతుంది. ఐదేళ్లు చంద్రబాబుకు ఇది కనిపించలేదు. ప్రహరీ గోడలకు ప్రతిపాదనలు రూపొందించాం. పల్నాడుకు సాగునీరు, తాగునీటి కోసం, మెడికల్‌ ఆసుపత్రి కట్టించాలి. మచిలిపట్నం పోర్టు కట్టాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లాలో మెడికల్‌ కాలేజీ లేదు. ట్రేబల్‌ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు కట్టాలి. ఆర్థిక వ్యవస్థ అన్నది ఛాయిస్‌ మీద నడుస్తుంది. మనిషికి ఎన్నో అవసరాలు ఉన్నా..తన ఆర్థిక పరిస్థితిని బట్టి ఏది కావాలో..ఎది వద్దో..ఎది ముందో, వెనుకాలో నిర్ణయించుకోవడమే తప్ప వేరేది చేయలేం. ప్రజలకు మళ్లి భ్రమరావతి చూపిస్తాం. అందుకే ప్రజలకు నిజం చెబుతున్నాం. మన వద్ద వంద రూపాయలు ఉంటే పెట్టాల్సిన చోట కాకుండా మరో చోట పెడితే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. మన వద్ద ఉన్న ఛాయిస్‌ చూస్తే రాజధానిలో మౌలిక వసతులకే లక్ష కోట్లు ఖర్చు చేయాలి. మరోపక్క విశాఖ ఉంది. కేవలం పదో వంతు ఖర్చు చేస్తే ఇవాళ కాకపోతే మరో పదేళ్లకు హైదరాబాద్‌తో పోటి పడగలం. ఉద్యోగాలు, ఉపాధి పరంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఐదేళ్ల తరువాత ఇదే చట్టసభలో కూర్చొని మన పిల్లల ఉద్యోగాల పరిస్థితిపై చర్చిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సముద్రంలో నీటి బొట్టులా అమరావతి ఖర్చు ఉంటుంది. విశాఖ ఇది వరకే అభివృద్ధి చెందిన నగరం. అక్కడ చేయకపోతే మనకు అభివృద్ధి దొరకదు. హైకోర్టును, సెక్రటేరియట్‌ను మార్చకపోతే ఐదేళ్ల తరువాత మన పిల్లలకు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైవెళ్లాల్సి వస్తుంది. ఇదే మన రాజధాని అని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం బాధ్యత గల స్థానంలో ఉన్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారు. జ్యూడిషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను చేస్తున్నాం. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ అమరావతిలోనే ఉంటుంది. మా హాయంలో ఎలాంటి అన్యాయం రైతులకు జరగదు. రైతులకు అండగా నిలబడుతున్నాం. అమరావతికి కూడా న్యాయమే చేస్తాం. చట్టాలు ఇక్కడే చేస్తాం. చట్టసభలు ఇక్కడే జరుగుతాయి. రైతులకు ఇచ్చే పరిహారం పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతాం. 29 గ్రామాల్లో భూమి లేని వారికి జీవనభృతి కింద రూ.2500 నుంచి 5 వేలకు పెంచుతున్నాం. బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు, ఎస్సీలు ల్యాండ్‌ఫూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌భూముల వారికి కూడా పట్టా భూములు ఇచ్చిన వారితో సమానంగా ఇంటిస్థలాలు ఇస్తాం. అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. గొప్ప నగరంగా రూపుదిద్దుకునేలా చేస్తాం. చంద్రబాబు మాదిరిగా మోసాలు చేయం. చేయాల్సింది కచ్చితంగా చేస్తాం. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అందరికి మంచి చేయాలి. ఇదే నా విధానం. ఎక్కడా కూడా కులాలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసం చూపడం లేదు. నా సహచరుల్లో కోడాలి నాని, తలశీల రఘు కూడా కమ్మ కులస్తులు ఉన్నారు. అందరూ కలిసి ఓట్లు వేస్తేనే నాకు 151 సీట్లు ఇచ్చారు. వాళ్ల ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు, కమ్మ కులాన్ని ఓన్‌ చేసుకునేందుకు జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో కమ్మ వాళ్లు లేరా? మా ఎంపి కమ్మా. చంద్రబాబుకు బాకా ఊదే కొన్ని పత్రికలు నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. రాజకీయాల కోసం కులాలను వాడుకునే నీచమైన స్థాయికి దిగజారిపోయారు. ఇంటింటికి అభివృద్ధి ఫలాలు అందాలి. అన్నింటిలో సంస్కరణలు కొనసాగుతాయి. మన ప్రాంతాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా, అమరావతిని లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ పెడుతున్నాం. కర్నూలుకు అన్యాయం జరిగింది.ఈ రోజు నా హయాంలో మేలు చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. కర్నూలును జ్యూడిషియల్‌ రాజధానిగా చేస్తున్నాం. వీటిని మద్దతు పలకాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మనసు మారాలని కోరుతున్నాను. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు. మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నా. అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం చేస్తూ అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  

 

తాజా వీడియోలు

Back to Top