తరతరాల తలరాతలు మార్చేదిశగా అడుగులు 

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి.. కుటుంబాలు చల్లగా ఉండాలి

పేద విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20 వేలు వసతి దీవెన అందిస్తాం

వసతి దీవెన కోసం రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తాం

వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు అందిస్తాం

డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20 వేలు

పేద, మధ్య తరగతి ప్రజల బాగు కోసం కట్టుబడి ఉన్నాం

మహిళా సాధికారతకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం మనది

రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు.. రాక్షసులు

ఏ తప్పు చేయకపోయినా రాక్షసులతో యుద్ధం చేయాల్సి వస్తోంది

ఇందుకు దేవుడి దయ, ప్రజల దీవెన కావాలి
తప్పుడు వార్తలు రాసే పత్రికలు, తప్పుడు ప్రసారాలు చేసే వీరిని ఏమనాలి 
రాష్ట్రంలో ఉంది ప్రతిపక్షం కాదు..రాక్షసులు
దేవుడి దయ, ప్రజల దీవెనలు కావాలి

విజయనగరం: పేదరికాన్ని దూరం చేసేందుకు, తరతరాల తలరాతలు మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కుటుంబంలో నుంచి ఆ పేదవాడు అప్పులపాలు కాకుండా ఇంజినీర్‌, డాక్టర్‌, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లాడు బయటకు రావాలని ఆకాంక్షించారు. అందుకే చదువులకు పెద్ద పీట వేస్తున్నామని, విద్యా విప్లవం తీసుకువస్తున్నట్లు చెప్పారు. నేటి తరానికి తాను ఇచ్చే ఏకైక ఆస్తి చదువే అని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో సోమవారం సీఎం వైయస్‌ జగన్‌ జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..

ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేశానికి స్వాంతత్ర్యం వచ్చినా కూడా..తరాలు మారుతున్నా కూడా నిరుపేదలు సామాజికంగా అణిచివేతకు గురైన వర్గాల తలరాతలు మారలేదు. వారి కుటుంబాల్లో చదువుల దీపాలు వెలిగిస్తేనే..ఈ తరంతో పాటు రాబోయే తరాల్లో వారి తలరాతలు మారుతాయి. స్వాతంత్ర్యం వచ్చి  ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇవాళ్టికి కూడా పరిస్థితి చూస్తే..పేదరికం దాటి అడుగులు ముందుకు వేయడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే..ఇది జరగాలంటే ప్రతి పేదవాడి కుటుంబంలో నుంచి ఆ పేదవాడు అప్పులపాలు కాకుండా ఇంజినీర్‌, డాక్టర్‌, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లాడు బయటకు రావాలి. ఆ పిల్లాడు పెద్ద చదువులు చదవాలి. మంచి జీతాలు సంపాదించాలి. దాంట్లో కాస్తోకూస్తో ఇంటికి పంపించాలి. అప్పుడే పేదరికం మన వద్ద నుంచి దూరమవుతుంది. ఆ పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఇవాళ్టికి మన రాష్ట్రంలో చదువు రాని వారి శాతం 33 మంది ఉన్నారు. దేశంలో చదువురాని వారు 27 శాతం ఉంటే..మన రాష్ట్రం దేశం కంటే దిగువన 33 శాతంలో ఉంది. ఒక అడుగు ముందుకు వేసి జీఈఆర్‌ రేషియో చూస్తే..18 నుంచి 23 ఏళ్ల పిల్లలను గమనిస్తే..ఎంత మంది కాలేజీల్లో చదువుతున్నారని చూస్తే ఆ సంఖ్య ఆశ్చర్యం కలుగుతుంది. బ్రిక్స్‌ దేశాలతో పోల్చితే రష్యాలో 81 శాతం కాలేజీల బాట పడుతున్నారు. మన దేశంలో కేవలం 23 శాతం మాత్రమే ఉంది. 77 శాతం మంది పిల్లలు చదువు అయిపోయిన తరువాత మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మన పిల్లలను ఏరకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు. ఈ పరిస్థితిని మార్చాలి. మనం కూడా రష్యా మాదిరిగా చదివించాలి. ఈ తరం మారాలి. తరతరాల తలరాతలు మార్చేదిశగా అడుగులు వేస్తున్నాం.

దేశంలో ఎక్కడా కూడా కనివిని ఎరుగని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. మీ అన్నలా, మీ బిడ్డలా అడుగులు వేస్తున్నాను. ప్రతి ఏటా రూ.20 వేల చొప్పున వసతి దీవెనగా ఇస్తున్నాం. వసతి, భోజన ఖర్చులకు డబ్బులు అందించే కార్యక్రమం నేటితో ప్రారంభం అవుతుంది. మంచి చదువులు చెప్పించటంతో పాటు వసతి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. మొదటి వాయిదా కింద డిగ్రీ విద్యార్థులకు ఇప్పుడు రూ.10 వేలు, జులైలో మరో రూ.10 వేలు ఇస్తాం. వసతి దీవెనలో డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటు ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తాం. ఎంత మంది చదివితే అంత మందికి ఈ కార్యక్రమం వర్తింపజేస్తాం. అక్షరాల 11.87 లక్షల మందికి ఈ రోజు ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమా అవుతుంది. ప్రతి ఏటా ఈ పథకం కింద రూ.2300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన కింద (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌) తల్లిదండ్రులకు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో రూ.3700 కోట్లు ఏడాదికి ఖర్చు చేయబోతున్నాం. ఈ రెండు పథకాల ద్వారా దాదాపుగా రూ.6 వేల కోట్లు చదువుకుంటున్న పిల్లలకు ఖర్చు చేస్తున్నాం. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు తోడుగా ఉంటేందుకు అక్షరాల 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి కింద రూ.15 వేలు నేరుగా జమా చేశాం. ఈ పథకానికి రూ.6400 కోట్లు ఖర్చు చేశాం. ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాను.

వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. మన బడి నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. మధ్యాహ్న భోజనం మెనూలో కూడా పూర్తిగా మార్పు చేస్తూ గోరుముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీని వల్ల రూ.200 కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం.471 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు రూపురేఖలు మార్చబోతున్నాం, 3287 ప్రభుత్వ హాస్టళ్ల రూపురేఖలు మారుతాయి. 148 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల రూపురేఖలు ఈ మూడేళ్లలో మార్చబోతున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా రూ.12,000 వేల కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు చెప్పినా కూడా ఫర్వాలేదు. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి చదువే అని సగర్వంగా చెబుతున్నాను. ప్రతి పిల్లాడు భవితరంతో పోటి పడాలి. దేశంతోనే కాదు, అంతర్జాతీయంగా పోటీ పడాలి. అది జరగాలంటే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తరువాత ఏడాది7, ఆ తరువాత 8, ఇలా మొత్తంగా నాలుగేళ్లలో మన పిల్లలు ఇంగ్లీస్‌ బోర్డు ఎగ్జామ్‌ రాసేలా తీర్చిదిద్దుతాం. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలకు కష్టంగా ఉంటుందని బ్రిడ్జికోర్స్‌లు తీసుకువస్తున్నాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పెట్టాం. టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్నాం. మన పిల్లలకు మనం ఇవ్వబోయే ఆస్తి చదువే అని గట్టిగా నమ్మాను. పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచించే ప్రభుత్వం మనది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బాగుకోసం ఆలోచిస్తున్నాం. 

ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మనది. మీ పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి. దశలవారిగా మద్యాన్ని నియంత్రించే ప్రభుత్వం మనది. ఈ రోజు పుట్టిన బిడ్డ, ఈ రోజు చదువుకుంటున్న బిడ్డ ప్రపంచంతో పోటీ పడాలని గుర్తించిన ప్రభుత్వం మనది. ఇలాంటి ప్రభుత్వంపై రోజు కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని విమర్శలు చేసే వారిని ఏమనాలో మీరే చెప్పండి. తమను చిత్తుగా ఓడించారు కాబట్టి రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ..డబ్బులు ఇచ్చి మరీ దుష్ర్పచారం చేస్తున్నారు ఇలాంటి వారిని ఏమనాలో చెప్పండి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే వీలు లేదంటూ దాడులు చేస్తున్న మూకలను ఏమనాలో ఆలోచన చేయండి. చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే..చంద్రబాబు గురించి మాట్లాడే వారు ఉండదరని తప్పుడు రాతలు రాస్తున్నారు. వీరందరిని ఏమానలో మీరే ఆలోచన చేయండి. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి వారి తల రాతలు మార్చేందుకు చట్టాలు చేస్తుంటే అడ్డుపడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ జనాభా దమాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డుపడుతున్న ఇటువంటి వారిని ఏమానలో ఆలోచన చేయండి. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతిగొప్ప మెజారిటీతో, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రజలిచ్చిన బలంతో, దేవుడి దయతో ఇకమీదట కూడా ముందుకు అడుగులు వేస్తామని ఈ వేదిక మీద నుంచి మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాం.

ఇంటింటా చదువులు, అందరికి ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు, ఉపాధి ఈ లక్ష్యాలు సాధనే..లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేవిధంగా మీ బిడ్డను ఆశీర్వదించాలి. దేవుడి దయ చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తున్నాను. ఏతప్పు చేయకపోయినా కూడా ఏదో జరిగిపోతున్నట్లు విఫరీతమైన రాతలు, టీవీ చానల్స్‌ ఉన్నాయి. ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం.ఇటువంటి పరిస్థితిలో మీ అందరి చల్లని దీవెనలు కావాలి. దేవుడి వద్ద మీ అందరి చల్లని ప్రార్థనలు కూడా కావాలి. మీ బిడ్డను, మీ అన్నను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి సోదరుడికి, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ..

Back to Top