విజయవాడ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ చేపట్టనున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు, సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి "వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8 లేదా 9 తేదీల్లో ఇండోర్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వైయస్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.