మామిడి రైతులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

  జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతుల తరఫున భూమన కరుణాకర రెడ్డి, నారాయణస్వామి నిరసన

  చిత్తూరు:  మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లిలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు.

ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, సీఎం సొంత జిల్లాలోనే సుమారు 60 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి కిలోకు మూడు రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తే, వారిని నియంత్రించాల్సిన ప్రభుత్వం రైతులకు అండగా నిలవకుండా ఫ్యాక్టరీలకే మద్దతుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

జిల్లాలో సుమారు 7 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి జరిగిందని, అయితే ధరలు లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నుల మామిడి చెట్ల కిందే రాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా మామిడి లోడ్లతో వచ్చిన ట్రాక్టర్లు, వాహనాలు ఫ్యాక్టరీల వద్ద కిలోమీటర్ల మేర క్యూల్లో నిలిచిపోతున్నాయని తెలిపారు. రోజుల తరబడి వేచి చూసిన తర్వాత మామిడి కాయలు ఎండిపోయాయని సాకులు చెబుతూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాటిని తిరస్కరిస్తున్నాయని అన్నారు.

చిత్తూరు పర్యటనల్లో రైతుల ప్రభుత్వమని సీఎం ప్రసంగాలు చేస్తున్నారని, అయితే వేలాది మంది మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఈ తీవ్ర సంక్షోభం ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వ జోక్యంతో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

Back to Top