క్రీడలకు సీఎం వైయ‌స్ జగన్‌ అధిక ప్రాధాన్యత   

కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ క్రీడావేదికలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. క్రీడలకు సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యత నిస్తున్నారని తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలోనే తొలిసారిగా జరుగుతున్న కార్ మోటార్ రేసింగ్ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాస్‌,  ఛాంపియన్స్ క్లబ్ అధ్యక్షురాలు హేమామాలిని, ఐ.ఎన్.ఎసి అధ్యక్షుడు సుభకర్‌లు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది కార్ రేసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న కార్ రేస్‌ని మొదటిసారిగా విజయవాడలో నిర్వహించామని తెలిపారు.

తిరుపతి, విశాఖల్లో కూడా కార్ రేస్ పోటీలు జరిపిస్తామన్నారు. ఇలాంటి ఈవెంట్లు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆరునెలల్లో రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. విజయవాడ, విశాఖ, తిరుపతిల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Back to Top