నేడు అమూల్‌తో  ప్రభుత్వ ఒప్పందం

అనంతపురంలో 85 గ్రామాల్లో ‘జగనన్న పాల వెల్లువ’కు శ్రీకారం

అమరావతి: సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన  ‘అమూల్‌’ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం నేడు (శుక్రవారం)  అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతోంది. అనంతపురం జిల్లాలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకానికీ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిద్వారా ఆర్నెల్ల నుంచి మూడేళ్ల్లలోపు ఉన్న చిన్నారులు 22.50 లక్షల మంది.. గర్భిణీ స్త్రీలు 7.50 లక్షల మంది ఉన్నారు.

వీరికి పౌష్టికాహారం రూపంలో గర్భిణీలకు 200 గ్రా. పాలతో పాటు పిల్లలకు రోజూ 100 గ్రా. పాలు, నెలకు 2.5 కేజీల చొప్పున బాలామృతం కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తోంది. ఇప్పటివరకు వీటిని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఆ«ధ్వర్యంలో బెంగళూరు నుంచి నెలకోసారి టెట్రా ప్యాకింగ్‌ రూపంలో 1.07 కోట్ల లీటర్ల చొప్పున ఏటా 12.84 కోట్ల లీటర్ల పాలు, తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ సొసైటీ నుంచి ఏటా 48,692 మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నారు.

పాలు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తుండగా, బాలామృతం కోసం రూ.265 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది.  రాష్ట్రంలో మన పాడి నుంచి ఉత్పత్తి అయ్యే తాజా పాలతో పాటు రాష్ట్ర పరిధిలోనే ప్రొసెస్‌ చేసిన బాలామృతాన్ని అంగన్‌వాడీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనివల్ల మన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనుంది. 

తాజా ఫోటోలు

Back to Top