ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్

హామీల అమలుపై సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు

విజయోత్సవ సభ పేరుతో చంద్రబాబు ఆత్మవంచన

మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఫైర్

వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి

సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న ఘనడు

కొత్త పెన్షన్లు ఇవ్వకుండా... ఉన్నవి కూడా తొలగిస్తున్న దుర్మార్గుడు

 రాయలసీమ సాగునీటి అవసరాలను పట్టించుకోని మోసగాడు

ఆత్మస్తుతి - పరనిందతో గొప్పగా సభను నిర్వహించుకున్నారు

మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం

అనంతపురం: పదిహేను నెలల్లో ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయ్యిందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్‌ - సూపర్ హిట్ అంటూ నిర్వహించిన విజయోత్సవ సభలో ఆత్మస్తుతి - పరనింద తప్ప మరొకటి ఉందా అని ప్రశ్నించారు. ఈ సభ ద్వారా పచ్చి అబద్దాలను మాట్లాడుతూ, తన మాటలకు చప్పట్లు కొట్టాలంటూ ప్రజలను పదేపదే వేడుకున్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

విజయోత్సవ సభ కోసం అనంతపురం జిల్లా యంత్రాంగం మొత్తం కంట్రోల్ రూంలు సైతం ఏర్పాటు చేసి, ఒక రాజకీయ పార్టీ సభ కోసం ఏర్పాట్లలో మునిగిపోయింది. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్‌తో పాటు 140 హామీలను ఇచ్చారు. సూపర్ సిక్స్‌ను పూర్తిగా అమలు చేశామని, అందుకే ఈ సభను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిజంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ఉంటే, దాదాపు 11 సార్లు సీఎంగా తన మాటలకు చప్పట్లు కొట్టాలని, ఆహా.. ఓహో అనాలని, నిజమా? కాదా? అని చెప్పాలని ప్రజలను ఎందుకు వేడుకోవాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పాలి. ఏ సీఎం ఇన్ని సార్లు చప్పట్లు కొట్టాలని ప్రజలను వేడుకోవడం చూడలేదు. అరకొరగా హామీలను అమలు చేసి, మొత్తం సూపర్ సిక్స్‌ పూర్తిగా అమలు చేశాం, ప్రజలు సంతోషంగా ఉన్నట్లుగా సిగ్గులేకుండా చెప్పుకున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి, మీ పథకాలుగా ప్రచారం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక్క కొత్త పథకాన్ని అయినా ప్రజలకు అందించారా? 

ఈ పథకాలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలి..?

నిరుద్యోగభృతి, అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు అంటూ ఇచ్చిన హామీలో దేనిని అమలు చేశారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి నెలకు రూ.1500 ఇస్తామన్నారు. యాబై ఏళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. వీటిల్లో ఎంత మందికి ఎంత ఇచ్చారు, ఎందరు లబ్ధిదారులుగా ఉన్నారో చెప్పాలని సీఎం చంద్రబాబు తన సభకు వచ్చిన ప్రజలనే ఎందుకు అడగలేకపోయారు? ఈ పథకాలు పేర్లు చెప్పి, గొప్పగా అమలు చేస్తున్నాం కనుక చప్పట్లు కొట్టాలని చంద్రబాబు ఎందుకు ప్రజలను కోరలేకపోయారు? వీటిని అమలు చేసే ప్రయత్నమే చేయడం లేదని ప్రజలకు తెలుసు. అయినా కూడా మొత్తం సూపర్ సిక్స్ ను అమలు చేశామని నిస్సిగ్గుగా అబద్దాలు ఎలా చెబుతున్నారు? ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తుంటే, ఈ పదిహేను నెలల్లో నాలుగు లక్షల పెన్షన్లను తొలగించిన ఘనుడు చంద్రబాబు. 

రాయలసీమ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారు

హంద్రీనీవా, గాలేరు నగరికి పునాదులు వేసి, గంప మట్టి కూడా తీయకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడు. స్వర్గీయ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయిన తరువాత కానీ ఈ ప్రాజెక్ట్ లకు మోక్షం రాలేదు. ఆనాడు 40 టీఎంసీల హంద్రీనావా ప్రాజెక్ట్‌ను చంద్రబాబు సీఎంగా అయిదు టీఎంసీలకు కుదించిన విషయం వాస్తవం కాదా? తరువాత దానిని మళ్ళీ నలబై టీఎంసీలకు తీసుకువచ్చి, పనులను శరవేగంతో చేయించి నీటిని విడుదల చేయించిన మహనీయుడు స్వర్గీయ వైయస్ఆర్. ఈ రెండు ప్రాజెక్ట్‌లను తానే పూర్తి చేసేందుకు కృషి చేసినట్లు తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించడం దారుణం. 2004 కంటే ముందు రెండుసార్లు గాలేరి-నగరికి చంద్రబాబు పునాదులు వేశారు. కానీ పనులను ముందుకు తీసుకువెళ్ళడంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరించారు. వైయస్ఆర్‌ వల్లే ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అవ్వడం వల్ల నేడు గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చింది. దీనివల్లే అనంతపురంలో కియా పరిశ్రమ రావడానికి అవకాశం ఏర్పడింది. అనంతపురం ఈ రోజు ఫ్రూట్‌ బౌల్ అయ్యిందంటే దానికి కారణం స్వర్గీయ వైయస్ఆర్. జీడిపల్లి, శ్రీనివాసపురం, గొల్లపల్లి, అడవిపల్లి రిజర్వాయర్‌లు పూర్తయ్యాయంటే దానికి కారణం స్వర్గీయ వైయస్ఆర్. నాలుగుసార్లు సీఎం అయి, కనీసం నిజాలు కూడా చెప్పలేని వ్యక్తి చంద్రబాబు. 

చంద్రబాబుదే ధృతరాష్ట్ర కౌగిలి

వైయస్ జగన్ గారిది ధృతరాష్ట్ర కౌగిలి అని మాట్లడటానికి చంద్రబాబుకు నోరెలా వచ్చింది? చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలిలో ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నలిగిపోయారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఆయన హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ను అయినా చేపట్టాడా? వ్యవసాయమే దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని కొత్తగా చంద్రబాబు చెబుతున్నాడు. ఇప్పటికి నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఇప్పుడు రతనాల సీమగా చేయాలనే ఆలోచన వచ్చిందా? మోసాలు, అబద్దాలతోనే చంద్రబాబు రాజకీయ జీవితం. 

చంద్రబాబు భజనకే జనసేన, బీజేపీ పరిమితం

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్ కళ్యాణ్‌కు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకు రావడం లేదా? అన్నీ ముఖ్యమంత్రిగారే చేస్తారంటున్నప్పుడు ఆయన ఎందుకు అనంతపురంకు వచ్చారో చెప్పాలి? రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటీ? సూపర్ సిక్స్‌లో ఎగ్గొట్టినవి ఎన్నీ? కనీసం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? రాజకీయంగా ఆయన చంద్రబాబుకు లొంగిపోయారా? కూటమిలోని జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సైతం చంద్రబాబును పొగడటానికే పరిమితమయ్యారు. బీజేపీ గతంలో చేసిన రాయలసీమ డిక్లరేషన్‌ పై ఎందుకు మాట్లాడలేదు? 

ప్రజలను దగా చేయడంలో సూపర్ హిట్

రాష్ట్రంలో లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారు. ఇసుక దందా, మట్టి దందా, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంలోనూ, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టలేక పోవడంలో ఈ ప్రభుత్వం సూపర్ హిట్. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వక పోవడం, పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని మాట తప్పడం, వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని ఆ వ్యవస్థనే తీసేయడంలో ఈ ప్రభుత్వం సూపర్ హిట్. ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను తీసుకువస్తే, దానిని రద్దు చేసి రేషన్ దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబెట్టడంలో ఈ ప్రభుత్వం సూపర్ హిట్. పదిహేను నెలల్లో ఏకంగా రూ.2 లక్షల కోట్లు అప్పులు తేవడం, కరేంట్ చార్జీలు పెంచడం, పంటలకు కనీస గిట్టుబాటు ధర లేకుండా చేయడం, రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించడంలో ఈ ప్రభుత్వం సూపర్ హిట్. విద్యా-వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ప్రైవేటుపరం చేయడంలో ఈ ప్రభుత్వం సూపర్ హిట్. వైయస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నాను, దానికి చప్పట్లు కొట్టాలని విజయోత్సవ సభలో చంద్రబాబు అడిగితే బాగుండేంది. ఉద్యోగులకు పీఆర్సీ, డిఏ బకాయిలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. 

 జిల్లా సమస్యలపై నోరు మెదపని కూటమి ప్రజాప్రతినిధులు

ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా నిలిచి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీలను పొగడటానికే పరిమితం అయ్యారు. ఈ జిల్లాకు చెందిన సమస్యలపై కనీసం ప్రస్తావించలేదు. వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుప్పంకు కృష్ణాజలాలను తీసుకువెళ్ళారు. దానిని నేనే చేశానంటూ సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నాడు. బైరవానిదిబ్బ, పేరూరు ప్రాజెక్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీరివ్వాలని సీఎంను ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కనీసం అడగలేక పోయారు. కనీసం ఒక్క హమీని కూడా చంద్రబాబు నుంచి పొందలేకపోయారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వపరంగా పూర్తి చేసి, కొనసాగించాలని మంత్రి సవిత ఎందుకు అడగలేకపోయారు? 

రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ప్రభుత్వమిది

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ప్రధాని మోదీతో మాట్లాడి హామీని పొందుతామని ఎందుకు ఈ సభ సాక్షిగా చెప్పలేకపోయారు? సోషల్ మీడియాలో మహిళలను గురించి ఎవరైనా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మాట్లాడారు. నందమూరి హరికృష్ణ భార్య గురించి మీ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కించపరుస్తూ మాట్లాడితే ఆయనపై ఏం చర్యలు తీసుకున్నారు? ఈ జిల్లాలో మా అనుమతి లేకుండా మీ సొంత గ్రామాలకు కూడా వెళ్ళడానికి వీలులేదని రౌడీయిజం చేస్తుంటే, వారిని గురించి చంద్రబాబు మాట్లాడరు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన చేయకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. పొరుగు దేశాల్లో నియంత విధానాలపై ఎలా తిరుగుబాటు జరిగిందో చంద్రబాబు గుర్తుంచుకోవాలి.

Back to Top