అసెంబ్లీ అభిప్రాయం అంటే ఓటింగే

హైదరాబాద్, 15 డిసెంబర్ 2013:

తెలంగాణ బిల్లు లేదా రాష్ట్రపతి నోట్పై శాసనసభ అభిప్రాయం తెలియజేయడం అంటే ఓటింగ్‌ కిందికే వస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం చిత్తశుద్ధితో రాష్ట్రపతి సూచనల మేరకు బిల్లుపై సభ్యుల అభిప్రాయంతో పాటు శాసనసభ అభిప్రాయం ఓటింగ్ ద్వారా తెలియజేయాలని శాసనసభాపతిని కోరారు. ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013 విషయంలో కేంద్ర ప్రభుత్వం వంకర టింకరగా వ్యవహరిస్తోందన్నారు. సాంప్రదాయబద్దంగా వ్యవహరించాలని స్పీకర్‌ను ఆయన కోరారు.

ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని, దీనిపై చర్చించడానికి తగిన సమయం కావాలని మైసూరారెడ్డి అన్నారు. అందువల్ల శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లుపై చర్చించాలని ఆయన కోరారు. సభ అభిప్రాయం అంటే ఓటింగే అని చెప్పారు. అభిప్రాయాలు చెప్పడం కోసం విప్ జారీచేయవలసిన అవసరంలేదన్నారు. ప్రతి సభ్యుడి అభిప్రాయం తీసుకోవాలన్నారు. సభ్యులు పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర కోసం తమ అభిప్రాయాలు చెప్పాలని‌ మైసూరారెడ్డి కోరారు. ప్రతి శాసనసభ్యునికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు.

తెలంగాణ బిల్లు స్పీకర్‌కు చేరడమే ఒక వింతైన పరిస్థితి అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపే తీరును, అందుకు అనుసరించే పద్దతులను మైసూరారెడ్డి తప్పుపట్టారు. యుద్ద విమానంలో యుద్ధప్రాతిపదికన బిల్లును ఇక్కడకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిని పరిశీలించి ముఖ్యమంత్రికి పంపారు. ముఖ్యమంత్రి సంతకం చేసి గవర్నర్‌కు పంపారు. గవర్నర్ మళ్లీ దానిని ముఖ్యమంత్రికి పంపారు. ఆయన మళ్లీ దానిపై సంతకం చేసి శాసనసభ స్పీక‌ర్కు పంపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభకు చేరింది. ఈ బిల్లు లే‌దా రాష్ట్రపతి నో‌ట్ నాలుగు చోట్లకు వెళ్లడం చకచకా జరిగిపోయింది. నిద్రపోయే సమయం తీసివేస్తే పది గంటల్లోనే ఇదంతా జరిగింది. సాధారణ పరిస్థితులలో అయితే ఇందుకు కనీసం నాలుగైదు రోజులు పడుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయంలో రాత్రి కూడా పనిచేసి ఈ తతంగం పూర్తి చేశారు. నిబంధనలకు ఎవరైనా పనిచేయకపోతే సరిదిద్దాల్సిన అధికార యంత్రాంగమే ఫెడరల్ ‌స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించడం తప్పు అని మైసూరారెడ్డి చెప్పారు. వారి సర్వీసు రూల్సుకు కూడా విరుద్ధం అన్నారు.

ఇంత చోద్యం జరుగుతుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చూస్తూ ఊరుకోవడం శోచనీయంగా ఉందన్నారు. సమైక్యవాద ఛాంపియన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమా‌ర్‌రెడ్డి ఈ  బిల్లు ఏ విధంగా ఈ నాలుగు చోట్లకు నడిచిందో వివరించి చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. నోట్‌ ఫైల్‌ను బయట పెట్టగలరా అని సీఎంను ఆయన అడిగారు. గాలిలో‌ దీపం పెట్టి ఆరిపోకుండా చూడమని అందరి మీదకు బాధ్యత తోసినట్లు సీఎం తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజ‌య్ సింగ్ మీ మెడ‌ మీద కత్తి పెట్టినందున మీరు దీనిని ఇంత త్వరగా స్పీకర్కు పంపారా? అని ప్రశ్నించారు. సమైక్యవాదానికి సీఎం కిరణ్‌ కట్టుబడి ఉంటే ఇటువంటి పని చేస్తారా? అని ‌మైసూరారెడ్డి నిలదీశారు.

సమైక్యవాదం ముసుగులో కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలు తు.చ. తప్పకుండా ఆగమేఘాల మీద పాటించడం దురదృష్టకరం అని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. బిజినెస్‌ రూల్సు ప్రకారం, నిబంధనల ప్రకారం కిరణ్‌ వ్యవహరించిన తీరు సక్రమమైందా? అని ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మైసూరారెడ్డి అన్నారు. అలాంటి  కేంద్రమే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరం అని విచారం వ్యక్తంచేశారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనే ఆతృతలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయాన్ని కేంద్రం పెద్దలు విస్మరించినట్టున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల భద్రత కోసం ఆర్టికల్‌ 371 డీని రాజ్యాంగంలో పొందుపరిచినట్లు మైసూరా చెప్పారు. విద్యార్థుల భద్రత కోసం 371 ఈ ని పొందుపరిచినట్లు ప్రస్తావించారు. ఈ రెండు ఆర్టికల్సు మీద ప్రధాని ఇందిరాగాంధీ మాట్లాడుతూ.. వీటిని ఏ ప్రభుత్వమూ తేలికగా సవరించకుండా ఉండేందుకే సెవెన్తు షెడ్యూల్‌లో చేర్చినట్టు చెప్పారని గుర్తుచేశారు.

ఈ రెండు ప్రత్యేక ఆర్టికల్సు ఆంధ్రప్రదేశ్‌కు వర్తిస్తాయి కాని తెలంగాణకు కాదు కదా అన్నారు. కనీసం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేంద్ర మంత్రుల బృందం తన ఇష్టం వచ్చిన రీతిలో మౌలిక అంశాలను పట్టించుకోకుండా పంపించారని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. ఇలాంటి అంశాలపై మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించవద్దని స్పీకర్‌కు ఆయన సూచించారు. ఈ విషయంలో నిబంధనలు, చట్టాలను పాటించాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top