ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీదే విజయం

  • ప్రభుత్వాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు
  • ప్రత్యేక హోదాను ఆంధ్రులు మరిచిపోలేదు
  • నోట్ల రద్దుపై బాబు వైఖరి బాధాకరం
  • రాష్ట్రంలో కరువు విలయతాండవం
  • ఈ నెల 9న ఒంగోలులో వైయస్‌ జగన్‌ ధర్నా
  • ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
హైదరాబాద్‌: ప్రభుత్వాల అనాలోచిత విధానాలు, వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే విజయమని ప్రజలే చెబుతున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. ఈ మేరకు సమీక్షా వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జులై 8న ప్రారంభించిన గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం రాష్ట్రంలో నిర్విరామంగా సాగిందన్నారు. డిసెంబర్‌ నాటికి 80 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సూచించగా, కొందరు 90 రోజుల వరకు నిర్వహించారని తెలిపారు. మొత్తానికి ఈ కార్యక్రమం ఇప్పటికే 92 శాతం టార్గెట్‌ పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని సూచించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభిప్రాయాలను పార్టీ నేతలు అధ్యక్షులు వైయస్‌ జగన్‌కు వివరించారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని జనం ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారని, హోదా అంశాన్ని ఆంధ్రులు మరిచిపోలేదని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. 

నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా పార్టీ నేతలు గుర్తించి వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, పింఛన్‌దారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు నోట్ల మార్పిడి, నగదు విత్‌డ్రాల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 మంది అమాయకులు బ్యాంకుల వద్ద క్యూలో నిలిచి మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యం అమ్ముకోలేకపోతున్నారని, కూరగాయలు విక్రయించేందుకు చిల్లర కష్టాలు తీవ్రంగా వేదిస్తున్నాయని తాము క్షేత్రస్థాయిలో పరిశీలించి వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబు అక్టోబర్‌ 10న పెద్దనోట్లు రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నవంబర్‌8న ప్రధాని నోట్లు రద్దు చేయడంతో తాను రాసిన లేఖ వల్లే నోట్లు రద్దు చేశారని బాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాను రాను ప్రజలు నగదు కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన చంద్రబాబు మాట మార్చి కేంద్రంపై నెపం మోపడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ విషయంలో బాబు మాట మార్చడం బాధాకరమన్నారు. ప్రధాని లక్ష్యం మంచిదే అని, అయితే అమలులో లోపాలున్నాయని గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నట్లు ఉమ్మారెడ్డి వివరించారు.

ఆరోగ్యశ్రీ అమలు అధ్వానం
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిప్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు తూట్లు పొడిచారని, పథకం అమలు అధ్వాన్నంగా మారిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు, బకాయిలు రూ.1120 కోట్లు ఉండగా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.560 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఈ విషయంపై ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సీఎంకు లేఖ రాస్తే కేవలం 260 కోట్లు మంజూరు చేశారన్నారు. మొత్తంగా రూ.820 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడంతో మిగిలిన బకాయిలు రూ.290 కోట్ల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ అమలు తీరు, బకాయిల విడుదల కోసం ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పాల్గొంటారని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు.

ప్రజలే బుద్ధి చెబుతారు
వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడం పట్ల వారికి ఓట్లు వేసిన ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి తెలిపారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే..ఈ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి ఎలా వెళ్తారని ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరువు విలయతాండం చేస్తుంటే చంద్రబాబు అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్లతో వర్షం కురిపించామని చెబుతున్నారని, అయితే ఆ జిల్లాలోనే 70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట ఎండిపోయిందని, 4 లక్షల మంది కూలీలు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. నోట్ల రద్దు, ఎన్నికల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన సొంత మీడియాతో సర్వే చేయించుకొని పాలన బ్రహ్మండంగా ఉందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ రెండున్నరేళ్లలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటాలు ప్రజల్లో భరోసానింపాయని, వారికి అండగా నిలిచిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రతిష్ట పెరిగిందని, ప్రభుత్వ పనితీరు దిగజారిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ప్రజలే చెబుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
 
Back to Top