పేపర్‌ లీక్‌పై ఆధారాలు బయటపెట్టాం

ఏపీ అసెంబ్లీ: పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీపై మా వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టామని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సభ నుంచి వాకౌట్‌ చేసిన తరువాత ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఈ ఏడాది 6.5 లక్షల మంది టెన్త్‌ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని,. పేపర్‌ లీక్‌ అంతమంది విద్యార్థులకు సంబంధించిన అంశం అన్నారు. లీక్‌పై మా దగ్గరున్న ఆధారాలు బయటపెట్టామని, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నివేదికను చూపించామని చెప్పారు. లీకైనట్లు ఆ నివేదికలో ధ్రువీకరించారని వెల్లడించారు. పేపర్‌ లీక్‌పై మొదట సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు బుకాయించారన్నారు. ఆ తరువాత పేపర్‌ లీకైనట్లు అంగీకరించి, ఆ నెపాన్ని అటెండర్‌పై నెట్టేందుకు మంత్రి గంటా ప్రయత్నించారని విమర్శించారు. నిజానికి అటెండర్‌కు అంత ధైర్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు. యాజమాన్యం అండ లేకుండా అటెండర్‌ అలా ఎందుకు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు..చాలా చోట్ల పేపర్‌ లీకైందని ఆరోపించారు. ఈ విషయంపై  హిందుపురంలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. లీకేజీకి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని, బా«ధ్యులను కేబినెట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Back to Top