‘పచ్చ’ కళ్లు.. పిచ్చి రాతలు

నిజాలకు పాతరేస్తూ ఆద్యంతం విషపు రాతలు
ఎంవోయూ కుదరనే లేదంటూ అడ్డంగా అబద్ధాలు
చంద్రబాబు హయాంలోనే కృష్ణపట్నం ఎంవోయూ
వైఎస్ మరణం తర్వాతే 4,731 ఎకరాల అప్పగింత
నిజాల్ని మరుగుపరిచి కట్టుకథలల్లడం ఎలాంటి జర్నలిజం?

సాక్షి, హైదరాబాద్:

ఐఎంజీ భూ కేటాయింపుల కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ఏదో ఒక కట్టుకథనం రాస్తుందని తాము ముందే ఊహించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనుకున్నట్టుగానే... కృష్టపట్నం మెగా ఇండస్ట్రియల్ పార్కుకు భూ కేటాయింపులు అక్రమమని గావుకేకలు పెడుతూ, వాటికి దివంగత వైఎస్సే కారణమని షరామామూలుగానే బురదజల్లుతూ పతాక శీర్షికన ఈనాడు పత్రిక అక్కసు వెళ్లగక్కిందని ఎద్దేవా చేసింది. ఐఎంజీ భూ కుంభకోణం అంశాన్ని ఎలాగైనా పక్కదారి పట్టించేందుకే పచ్చ కూటమి పెద్దన్న ఇలా స్వయంగా రంగంలోకి దిగిందంటూ దుయ్యబట్టింది. అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా లేకుండానే భూ కేటాయింపులు జరిపారంటూ పచ్చి అబద్ధాలతో కూడిన రాతల ద్వారా నిజాలకు పాతరేసే ప్రయత్నం చేసిదని మండిపడింది. నిజానికి కృష్ణపట్నంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఎంవోయూ జరిగిందని తెలిపింది. సదరు జీవో కాపీలను కూడా మీడియాకు విడుదల చేసింది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ అప్పగింతలు వైఎస్ మరణానంతరమే జరిగాయని కూడా పేర్కొంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబురావు, కాపు రామచంద్రారెడ్డి, ఎ.అమరనాథరెడ్డి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లోనూ, అనంతరం ‘సాక్షి’తోనూ మాట్లాడారు.

ఐఎంజీ భూ కేటాయింపులపై దర్యాప్తు కోసం తాము అసెంబ్లీలో పట్టుబడుతున్న నేపథ్యంలో ఎలాగైనా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ‘ఈనాడు’ ప్రయత్నిస్తుందని ముందే ఊహించామని వారు చెప్పారు. బాబు హయాంలోనే కుదిరిన ఎంఓయూను మాటమాత్రమైనా ప్రస్తావించకుండా కట్టుకథ అల్లిందంటే... ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసమో అందరికీ అర్థమవుతోందన్నారు. మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం 1996 ఆగస్టు 12లో బాబు హయాంలోనే నాట్కో ఫార్మాతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) కుదుర్చుకున్న ఎంవోయూను ఎమ్మెల్యేలు చూపించారు. ‘‘తర్వాత అటు కృష్ణపట్నం పోర్టుతో పాటు పార్కు ఏర్పాటు విషయంలోనూ నాట్కో తప్పుకోవడంతో, దాని స్థానంలో నవయుగ కంపెనీ ముందుకు వచ్చింది. కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌పేరుతో కార్యకలాపాలు చేపడుతోంది. పైగా దానికి కేటాయింపులన్నీ బాబు హయాంలో కుదుర్చుకున్న ఎంవోయూ ప్రకారమే జరుగుతున్నాయి.


ఇలా బాబు ఒక ఫార్మా కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకుంటే ‘ఈనాడు’కు అది తప్పుగా కన్పించదు. దాన్ని ఆధారంగా చేసుకుని, ప్రాజెక్టును రాబట్టేందుకు వైఎస్ భూమి ఇస్తే అది తప్పయింది! నిజానికి కృష్ణపట్నం ప్రాజెక్టు గతంలో బాబు హయాంలో కుదిరిన ఒప్పందానికి కొనసాగింపే తప్ప కొత్తదేమీ కాదు. ఇప్పటికీ నాట్కోకు కృష్ణపట్నం ఇన్ఫోటెక్‌లో వాటా ఉంది. అదీగాక చాలా ప్రాజెక్టులకు వేలాది ఎకరాలను జీవోలు లేకుండా, కేవలం ప్రాజెక్టు నివేదిక ఆధారంగా ఏపీఐఐసీ కేటాయిస్తూ వచ్చింది. కృష్ణపట్నం విషయంలోనూ జరిగింది అదే. డీఎఫ్‌ఆర్ ఆధారంగానే భూములను కేటాయించారు. ఇదేదో కొత్త పద్ధతి అయినట్టు ఈనాడు రాయడం హాస్యాస్పదం. పాఠకుల విజ్ఞతను అది అంత తక్కువగా అంచనా వేస్తోందా?’’ అంటూ తూర్పారబట్టారు. ఈ ఉదంతంపై ఏ చర్చకైనా సిద్ధమన్నారు. టీడీపీ సిద్ధమా అంటూ సవాలు విసిరారు. ఎలాగోలా వైఎస్సార్‌సీపీని, దివంగత వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరచేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నాలు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఆ క్రమంలో వాస్తవాలను ఈ స్థాయిలో మరుగునపరిచేంతగాదిగజారడం ఏ జర్నలిజం విలువ అవుతుందని ప్రశ్నించారు.

ఎంఓయూ సారాంశమిదీ...

మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం నాట్కో ఫార్మాతో 1996 ఆగస్టు 12న ఏపీఐఐసీ కుదుర్చుకున్న ఎంవోయూ వివరాలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వివరించారు. ‘‘కృష్ణపట్నం పోర్టు పరిసరప్రాంతాల్లో మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయని, భూమిని ఏపీఐఐసీ సేకరిస్తుందని అందులో పేర్కొన్నారు. ఎంవోయూ కుదిరిన 180 రోజుల్లోగా పార్కు పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. తమ భాగస్వాములుగా ఫ్లోర్ డేనియల్-యూఎస్‌ఏ, ఇటోచు కార్పొరేషన్-జపాన్, హాలండ్‌కు చెందిన హమ్ డ్రెడ్జింగ్ ఉన్నాయని నాట్కో పేర్కొంది.

డీఎఫ్‌ఆర్ సిద్ధమయ్యాక ప్రాజెక్టు అమలుకు సరైన కో-ప్రమోటర్‌ను ఏపీఐఐసీ ఎంపిక చేసుకుంటుందని, తొలి ప్రాధాన్యత నాట్కోకే ఉంటుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎంవోయూపై అభ్యంతరాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని, సాధ్యపడకుంటే ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నాట్కో స్థానంలో వచ్చిన నవయుగ ఇందుకు అనుగుణంగా డీఎఫ్‌ఆర్‌ను తయారు చేసి ఏపీఐఐసీకి సమర్పించింది. భూమిని కేటాయించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే 4,731.15 ఎకరాలను కంపెనీకి ఏపీఐఐసీ సేల్ డీడ్ చేసింది. అది కూడా వైఎస్ మరణానంతరం’’ అని వారన్నారు. లోక్‌సత్తా శాసనసభాపక్ష నేత జయ ప్రకాశ్ నారాయణే అప్పట్లో ఏపీఐఐసీ ఎండీ హోదాలో నాట్కో ఫార్మాతో ఎంవోయూ కుదుర్చుకున్నారని గుర్తు చేశారు.

వైఎస్ మరణించాకే భూమి అప్పగింత!

‘‘ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు భూమిని ఏపీఐఐసీ సేకరిస్తుంది. ఆ వ్యయాన్ని కంపెనీయే భరిస్తుంది. అందుకోసం ఏపీఐఐసీకి అదిప్పటికే రూ.102.33 కోట్లు చెల్లించింది. అలా సేకరించిన భూమిని కంపెనీకి ఏపీఐఐసీ అప్పగించింది వైఎస్ మరణానంతరం కావడం విశేషం. ఆయన 2009 సెప్టెంబరు 2న మరణించారు. అక్టోబరు 1న 2,682.77 ఎకరాలను, 2010 సెప్టెంబర్ 18న మరో 2,048.38 ఎకరాలను కంపెనీకి ఏపీఐఐసీ సేల్ డీడ్ చేసింది. భూమి ధరను ప్రభుత్వం నిర్ణయించకపోవడం వల్ల మిగతా భూ కేటాయింపు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు’’ అని ఎమ్మెల్యేలు వివరించారు.

Back to Top