మల్లన్నకూ మోసం!

రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్య కొండల్లో మైనింగ్‌కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా

 మల్లయ్యకొండ సముదాయంలోని సదుంకొండ ఏపీఎండీసీకి సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ కంపెనీకి శివపురం కొండ కేటాయింపు 

మైనింగ్‌కు సర్వే, అన్వేషణ ప్రక్రియ ప్రారంభం 

తిరుమలకు ఏడు కొండల్లాగే మల్లయ్యకు మూడు కొండలు 

పవిత్ర కొండల్లో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలకు అనుమతివ్వడంపై స్థానికులు, భక్తుల ఆందోళన 

6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో మైనింగ్‌పై పర్యావరణవేత్తల అభ్యంతరాలు  

 అమరావతి: ఏరు దాటేదాకా.. ఓడ మల్లన్న! ఏరు దాటాక.. బోడి మల్లన్న! ఇదీ సీఎం చంద్రబాబు తీరు! సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చకుండా.. గతంలో ఉన్న పథకాలను సైతం ఎగరగొట్టి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ఆ శివయ్యను సైతం వదలకుండా నిర్భీతిగా వంచనకు పాల్పడుతున్నారు! తిరుమలకు ఏడుకొండలు ఎంత పవిత్రమో రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండను సైతం అంతే పవిత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి మల్లయ్యకొండపై మైనింగ్‌ జరగనివ్వబోనని గతంలో నమ్మబలికిన చంద్రబాబు తాజాగా అక్కడ ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌కు పచ్చజెండా ఊపారు. మల్లయ్యకొండను, రిజర్వు ఫారెస్టును తవ్వేసి యథేచ్ఛగా మైనింగ్‌కు చంద్రబాబు సర్కారు అనుమతించడంపై భక్తులు, పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌కు కాంపోజిట్‌ లైసెన్స్‌ కోసం చంద్రబాబు సర్కారు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) జారీ చేసింది. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ను ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తాన్ని మైనింగ్‌ జోన్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

రెండు బ్లాకులుగా విభజించి కాంపోజిట్‌ లైసెన్సులు 
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్‌గా విభజించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్‌కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం అత్యధికంగా బిడ్‌ దాఖలు చేసి ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వం ఆ సంస్థ నుంచి రూ.1.50 కోట్ల పెర్‌ఫార్మెన్స్‌ సెక్యూరిటీ కట్టించుకుని ఖనిజ అన్వేషణకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది. అదే కొండల సముదాయంలోని 626 హెక్టార్లలో శివపురం ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ కాంపోజిట్‌ లైసెన్స్‌ను సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు కేటాయించింది. ఈ సంస్థ 11.80 శాతం ఫైనల్‌ బిడ్‌ వేసి ఎల్‌ 1గా నిలవడంతో రూ.1.50 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ కట్టించుకుని ఎల్‌ఐఓ జారీ చేసింది. దీంతో మల్లయ్యకొండపై అధికారికంగా మైనింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఆధ్యాత్మిక, జీవ వైవిధ్యానికి ప్రతీక మల్లయ్య కొండ 
ప్రభుత్వం రెండు బ్లాకులుగా విభజించి టెండర్లు ఖరారు చేసినా నిజానికి అది మూడు కొండల సముదాయం. సాధుకొండ, మల్లయ్యకొండ, ఇనుముకొండ కలిసి ఒకే పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ పురాతన మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. రాయలసీమలో శ్రీశైలం, శ్రీకాళహస్తి తర్వాత అత్యంత విశిష్టమైన శైవక్షేత్రంగా మల్లయ్యకొండ ప్రసిద్ధి చెందింది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మల్లయ్యకొండ సముదాయం సుమారు 6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో విస్తరించి ఉంది. ఇందులో 1,550 హెక్టార్లలో మైనింగ్‌ కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు అనుమతించింది. ఈ కొండలు జీవవైవిధ్యానికి ప్రతీక. మైనింగ్‌ జరిగితే ఇక్కడ కొండల స్వరూపం, అటవీ సంపద, వన్యప్రాణులు, జలవనరులు దెబ్బ తింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దోచుకునే యత్నాలను ఏళ్లుగా అడ్డుకున్న స్థానికులు
ఈ కొండను తొలిచి ఖనిజాన్ని దోచుకోవాలని జరి­గిన యత్నాలను స్థానికులు ఎప్పటికప్పుడు తిప్పికొ­డుతూ వచ్చారు. ఈ కొండల్లో వందల టన్నుల ఇ­ను­ప ఖనిజం ఉందని గతంలో కేంద్రం ప్ర­కటించింది. కిరణ్‌కు­మార్‌రెడ్డి ప్రభుత్వం ఇ­క్కడ మైనింగ్‌ చేయడానికి ప్రయత్నించింది. అప్ప­ట్లో జి­యో మైసూర్‌ సంస్థకు ఖనిజ అన్వేషణ కోసం లైసె­న్స్‌ మంజూరు చేసింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్త­­మవడం, ఆందోళనలు వెల్లువెత్తడం­తో ఆ సంస్థ పూ­ర్తి­స్థాయిలో అన్వేషణ చేయకుండా వెనుతిరిగింది. 

కొండలను రక్షిస్తానని నమ్మబలికిన బాబు 
మల్లయ్యకొండలో మైనింగ్‌ జరగనివ్వబోనని చంద్రబాబు  గతంలో ప్రకటించారు. భక్తుల విశ్వాస్వాలకు అనుగుణంగా ఈ కొండను రక్షిస్తానని నమ్మబలికారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు అత్యంత రహస్యంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇటీవలే కాంపోజిట్‌ లైసెన్సులు మంజూరు చేశారు. స్థానికులు ఆందోళనకు దిగుతారని పసిగట్టి గుట్టుగా టెండర్లు పిలిచి ఖనిజాన్వేషణకు అనుమతివ్వడం గమనార్హం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకే కాకుండా మల్లికా­ర్జునస్వామికి సైతం శఠగోపం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు, శివభక్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మల్లయ్యకొండపై మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం అంటే పవిత్ర శైవక్షేత్రం, రిజర్వ్‌ ఫారెస్ట్‌పై, భక్తుల విశ్వాసాలపై దాడి చేయడమేనని మండిపడుతున్నారు.

ప్రకృతి ఒడిలో పరమ శివుడు
తంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి. చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.

స్వయంభువు..
ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున­స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.  

 

 

‘మైనింగ్‌’పై మహోగ్రం!  

Devotees Flock to Mallayya Hills

భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తున్న పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సుధాహరరెడ్డి 

భక్తుల ‘మహా గిరి ప్రదక్షిణ’తో హోరెత్తిన మల్లయ్య కొండలు

70 కి.మీ మేర ఏడున్నర గంటల పాటు కొండలు చుట్టూ ప్రదక్షిణ

ముందుండి నడిపించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సుధాహరరెడ్డి

 మదనపల్లె: నిత్యం శివ నామస్మరణతో మార్మోగే మల్లయ్య కొండలు.. మైనింగ్‌ విధ్వంసం వద్దంటూ ‘మహా గిరి ప్రదక్షిణ’తో హోరెత్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మల్లయ్య కొండలు చుట్టూ 70 కి.మీ మేర ఏడున్నర గంటల పాటు భక్తులు, స్థానికులు భారీ ‘మహా గిరి ప్రదక్షిణ’ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకే మల్లయ్య కొండపైకి పెద్ద ఎత్తున చేరుకుని ముక్కంటికి పూజలు, అభిషేకాలు చేశారు. కొండ కింద అన్నదాన సత్రం వద్ద శివ భజనలు, కీర్తనలు ఆలపించారు.

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, కలిచర్ల సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సుధాహరరెడ్డి భక్తులతో కలసి మహాగిరి ప్రదక్షిణను ప్రారంభించారు. శివపార్వతులు కొలువుదీరిన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తంబళ్లపల్లె, రావిమాను మీదుగా కాలి నడకన వైఎస్సార్‌ సర్కిల్‌ మీదుగా పెద్దమండ్యం రోడ్డుకు చేరుకున్నారు. అక్కడినుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన వాహనాల్లో భక్తులు మహాగిరి ప్రదక్షిణగా సాగారు. గోపిదిన్నె, కొటాల, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండ్యం, కలిచర్ల, శివపురం, తురకపల్లె, వెలిగల్లు, కోటకొండ, మఠం మీదుగా తంబళ్లపల్లె చేరుకున్నారు. రథం కొండపైకి వెళ్లి ఆలయంలో పూజలు నిర్వహించాక గిరి ప్రదక్షిణ ముగించారు. 

దారి పొడవునా రథానికి పూజలు..
మహాగిరి ప్రదక్షిణ ప్రారంభం నుంచి ముగింపు వరకు రహదారి పొడవున ప్రజలు బారులు తీరి రథానికి పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె, పెద్ద­మండ్యం నుంచే కాకుండా నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన భక్తులు, సత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లయ్య కొండల్లో మైనింగ్‌ వద్దని నినదించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మైనింగ్‌ను తొలి నుంచి గట్టిగా వ్యతిరేకి­స్తున్నారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

70 కి.మీ. దూరం.. ఏడున్నర గంటలు 
తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మధ్యలో ఉన్న మల్లయ్య కొండల చుట్టూ నిర్వహించిన మహా గిరి ప్రదక్షిణ 70 కిలోమీటర్ల దూరం సాగింది. ఉదయం 9 గంటలకు కొండ కింద నుంచి ప్రదక్షిణ మొదలై 10 గంటలకు తంబళ్లపల్లి చేరు­కుంది. అక్కడినుంచి తిరిగి తంబళ్లపల్లికి చేరేందు­కు ఏడున్నర గంటల సమయం పట్టింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రదక్షిణ మెల­్లగా సాగింది. ప్రదక్షిణ విజయవంతమైందని, మైనింగ్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

శాశ్వతంగా నిషేధించాలి..
భవిష్యత్తులో మల్లయ్య కొండల్లో మైనింగ్‌ అనే మాటే వినపడకుండా శాశ్వతంగా నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ వల్ల ఖనిజ సంపద దోపిడీకి గురి కావడమే కాకుండా జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, తీవ్ర అనారోగ్య సమస్యలు, వలసలతో కుటుంబాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ జన్మ స్థలాన్ని చెప్పుకునే పరి­స్థితి లేకుండా పోతుందని, మైనింగ్‌ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉత్తర్వులు ఎలా ఇస్తుందని కన్నెమడుగుకు చెందిన దేవరింటి రామకృష్ణారెడ్డి, దేవరింటి రవిశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మైనింగ్‌పై శాశ్వత నిషేధం విధించాలని, మల్లయ్య కొండల భవిష్యత్తుకు అదే శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. 

 మైనింగ్‌ ఉత్తర్వులిచ్చింది చంద్రబాబు సర్కారే : వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ధ్వజం 

 తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్‌ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి మండిపడ్డారు. మైనింగ్‌ చేయబోమని మాటల్లో కాకుండా, ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ లైసెన్సులను ఎప్పుడు రద్దు చేస్తారో ప్రకటించాలని సోమవారం ఆయన డిమాండ్‌ చేశారు. మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో  మైనింగ్‌ కోసం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని సూటిగా ప్రశ్నించారు.

 మైనింగ్‌ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబే
మల్లయ్య కొండకు సంబంధించి 2025 నవంబర్‌ 27న చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి మైనింగ్‌ లైసెన్సులు జారీ చేసిందని మిథున్‌రెడ్డి వెల్లడించారు. ఎర్రకొండకు ‘సీఎల్‌’ ఇచ్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కా­దని చెప్పారు. తాజాగా బాబు ప్రభుత్వం సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసిందని చెప్పారు. ‘ఇది నిజం కాదా?  

టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు దాచిపెట్టి ఆ తప్పిదాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం ఏమిటి?’ అని నిలదీశారు. మల్లయ్య కొండల్లో మైనింగ్‌పై ఇప్పటికే జారీ చేసిన మూడు ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న ప్రతి తప్పిదాన్ని గత ప్రభుత్వంపై మోపేందు­కు యత్నిస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించా­రు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, ఖనిజ సంపదను దోచుకోవాలని చంద్ర­బాబు సర్కార్‌ యత్నిస్తోందని ధ్వజ­మెత్తారు. మల్ల­య్య­­కొండ అభివృద్ధి కోసం పైసా ఇవ్వని బా­బు సర్కారు మైనింగ్‌ పేరుతో దోపిడీకి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ అభివృద్ధి కోసం రూ.కోట్లాది నిధులను మంజూరు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదనే విషయం అందరికీ తెలుసన్నారు. 

 

Back to Top