చెన్నై:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి చెన్నైలో అభిమానులు నీరాజనం పట్టారు. శ్రీ జగన్ రాక సందర్భంగా నగర వీధులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో కళకళలాడాయి. చెన్నై నగరంలో ఎటు చూసినా ఆహ్వాన ఫ్లెక్సీలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకున్న జననేతను చూడటానికి చెన్నై శివార్లలోని జనం వేలాదిగా తరలి రావటంతో మీనంబాక్కం విమానాశ్రయం జన సాగరమైంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నాయకులు జాకీర్, శరవణన్, శరత్‌కుమార్ ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. డప్పుల హోరు, మేళతాళాలు, కేరళ వాయిద్యాల నడుమ శ్రీ జగన్‌ను నగరంలోకి సాదరంగా ఆహ్వానించారు. అభిమాన సందోహంతో ఏడు కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి శ్రీ జగన్‌కు రెండు గంటల సమయం పట్టింది. నగరంలోని నందనం సిగ్నల్ దాటగానే, అభిమానుల కోసం 25 నిమిషాలకు పైగా ఆయన వాహన శ్రేణి ఆగింది. మహిళలు కర్పూర హారతులిస్తూ, నుదుట తిలకం దిద్ది అభిమానం చాటుకున్నారు. శ్రీ జగన్ వెళ్ళి రహదారి మొత్తం పూలవర్షం కురిపించారు.
ఆళ్వార్‌పేటలోని శ్రీ జగన్ సోదరుడు వైయస్ అనిల్‌రెడ్డి ఇంటికి వెళ్లే మార్గం అంతా పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శ్రీ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.
మధ్యాహ్నం 2 గంటలకు తమిళనాడు సచివాలయానికి చేరుకున్న శ్రీ జగన్ 2.30 వరకు సీఎం జయలలితతో చర్చలు జరిపారు. సాయంత్రం 5.15కు కరుణానిధి ఇంటికి చేరుకోగానే కరుణానిధి తనయుడు స్టాలిన్, కుమార్తె, ఎంపీ కనిమొళి శ్రీ జగన్‌కు ఎదురేగి శాలువలు కప్పి నివాసంలోకి తీసుకెళ్లారు. శ్రీ జగన్ వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, దాడి వీరభద్రరావు, వైయస్ అనిల్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు.