వయోపరిమితి పెంపునకు బాలినేని వినతి

హైదరాబాద్, 30 మే 2013:

ప్రభుత్వోద్యోగాల భర్తీకి వయోపరిమితిని పెంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం డిమాండ్ చేసింది. ఓసీ అభ్యర్థులకు 39 ఏళ్లకూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 44 ఏళ్ళకూ వయోపరిమితిని పెంచాలని పార్టీ అసెంబ్లీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, సమన్వయకర్త జి. శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టాలని వారు సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనల విడుదలలో జాప్యం కారణంగా విద్యావంతులు నిరుత్సాహానికి గురవుతున్నారని చెప్పారు. వయసు మీరుతుండటంతో ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిని 39 ఏళ్ళకు పెంచిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మానవీయ దృక్పంథంతో వయోపరిమితి పెంపు నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు.

Back to Top