వైయస్ఆర్ కాంగ్రెస్ ఆందోళన జయప్రదం

హైదరాబాద్, జనవరి 09, 2013:

ఓ పక్క రాష్ట్రం.. మరో పక్క కేంద్రం ధరలు పెంచుతూ ఎడాపెడా ప్రజల్ని బాదేస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించారనీ,  రైలు ప్రయాణ చార్జీలను పెంచుతున్నట్లు బుధవారం నాడు కేంద్రం ప్రకటించిందనీ ఆయన వివరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం డాక్టర్ మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ప్రైవేటు వ్యక్తుల లబ్ధికే బొగ్గు ధరలు పెంచారు


     ప్రభుత్వ అవకతవక విధానాల వల్లే ఈ ధరలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కోల్ ఇండియా లాభాల బాటలో పయనిస్తున్నపుడు అంతర్జాతీయ స్థాయిలో బొగ్గు ధరలు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంలో కూడా పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనులు కేటాయించినందున వారికి లబ్ధి చేకూర్చేందుకే ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళ్ళు చాపుకుని చోద్యం చూస్తోందని ఎద్దేవా చేశారు. మనకు కేటాయించవలసిన గ్యాస్ వాటాను రత్నగిరి, తదితర ప్రాంతాలకు తరలించడం రెండో కారణమన్నారు. రత్నగిరి ప్రాజెక్టును స్థాపించేటపుడు ఉపయోగించుకుంటానన్న గ్యాస్ ధర అధికంగా ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్‌ను ఉపయోగించుకోవాలని చూసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రత్నగిరికి గ్యాస్ కేటాయించి, మన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్నారు. దీనివల్ల మనం 1700మె.వా. విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. 33మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. ధరల పెరుగుదల కారణంగా చార్జీలను పెంచాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇంధన సర్చార్జీలు వేసిన తర్వాత చార్జీలు పెంచాల్సిన అవసరం లేదన్నది తమ పార్టీ అభిప్రాయమని మైసూరా రెడ్డి స్పష్టంచేశారు.

     చార్జీలు పెంచుతూ చేసిన ప్రతిపాదనలకు నిరసనగా బుధవారం తమ పార్టీ విద్యుత్తు సబ్ స్టేషన్ల వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు జయప్రదమయ్యాయని చెప్పారు. ప్రతిపాదనలను విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

     ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టిన 'మీకోసం వస్తున్నా' పాదయాత్ర వంద రోజుల వేడుకపై 'సినిమాల మాదిరిగా 50, 100 రోజుల పండుగ చేసుకోవడం ఆయన సంస్కృత'ని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు.  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసును అక్రమంగా బనాయించడానికి ఆయనే చంద్రబాబే కారకుడని చెప్పారు. తమ పార్టీది లౌకిక విధానమని స్పష్టంచేశారు. ఎవరైనా పరమత దూషణ చేయడం తప్పేననేది తమ భావన అని పేర్కొన్నారు. కొందరు రాజకీయ లబ్ధికోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇతర పార్టీలపై బురద జల్లడాన్ని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దాన్ని చల్లార్చేలా చూడాలే తప్ప.. అగ్నికి ఆజ్యం పోసినట్లు వ్యవహరించడం తగదని హితవు పలికారు.

Back to Top