ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, బీజేపీ కూటమి నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నామినేషన్ కేంద్రం వద్ద వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసినట్లు పార్టీ శ్రేణులు ఆరోపించాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే స్వేచ్ఛ, భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, గాయపడిన వారికి న్యాయం చేయాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.