తాడేపల్లి: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఎదురవుతున్న తీవ్ర ఆడ్డంకులను తక్షణమే తొలగించాలని, రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగి జోక్యం చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పుంగనూరులో నామినేషన్ల పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలు, రాడ్లతో హత్యాయత్నానికి ఒడిగట్టిన వారిపై తక్షణమే హత్యాయత్నం సహా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాలని ఆయన ఎస్ఈసీకి రాసిన లేఖల్లో గట్టిగా కోరారు. దాచేపల్లి, తాడిపత్రి, తిరుపతి, రాయచోటి తదితర ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, పోలీసుల పక్షపాత ధోరణి, మహిళా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి అప్రజాస్వామిక చర్యలను అరికట్టాలని, నామినేషన్లు వేసే ప్రతిపక్ష అభ్యర్థులందరికీ గృహాల నుంచి కేంద్రాల వరకు పోలీసు ఎస్కార్ట్, రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపధ్యంలో లేఖల్లో ఇంకా ఏయే అంశాలు ప్రస్తావించారంటే... ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి సిగ్గుచేటు... : పుంగనూరు మున్సిపాలిటీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులతో కలిసి వెళ్తున్న రాజంపేట ఎంపీ, పార్టీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ శ్రీ పి.వి. మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. నామినేషన్ కేంద్రం వైపు వారి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుని, వాహనాలను ధ్వంసం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక ప్రజాప్రతినిధి, ఎంపీపై ఇంత బహిరంగంగా దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు కనీస చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటు. ఈ దాడిని ప్రేరేపించిన, పాల్పడిన వారందరిపై తక్షణమే హత్యాయత్నం కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాలి. సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచడంతో పాటు ఘటనా స్థలంలో ప్రేక్షకపాత్ర వహించిన పోలీసు అధికారులపై కూడా శాఖాపరమైన విచారణ జరిపించాలి. తాడిపత్రి, తిరుపతి, రాయచోటిలలో బెదిరింపులు – పోలీసుల పక్షపాత వైఖరి: తాడిపత్రి శాస్త్రి నగర్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి చంపేస్తామని బెదిరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులు, ఆ బెదిరింపులను ప్రతిఘటిస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మాత్రం అక్రమ కేసులు నమోదు చేశారు. తిరుపతిలో కార్పొరేటర్ పదవికి నామినేషన్ వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా అభ్యర్థి చేతిలోని నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేయడం అత్యంత హేయం. రాయచోటిలో స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఎస్సార్సీపీ ఆశావహులకు ఫోన్ చేసి పోటీ చేయవద్దని, బలిపశువులు కావద్దని బెదిరింపులకు దిగారు. దీనిపై వైయస్సార్సీపీ ి్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని, సన్నాహక భేటీని సైతం పోలీసులు అడ్డుకోవడం దారుణం. అధికార పార్టీ దౌర్జన్యాలపై మౌనం వహిస్తూ, ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తున్న పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి రవికుమార్ అక్రమ నిర్బంధం: దాచేపల్లి నగర పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను వేకువజామునే పోలీసులు అక్రమంగా నిర్బంధించి ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకుండా కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేస్తున్నారు. అపార్ట్మెంట్లో పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టి, అక్రమ కేసులు బనాయించి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. రవికుమార్ ఎక్కడున్నారో వెంటనే స్పష్టం చేసి, ఆయన ప్రాణాలకు భద్రత కల్పించి తక్షణమే విడుదల చేయాలి. తప్పుడు కేసులు బనాయించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నామినేషన్లకు వెళ్లే ప్రతి అభ్యర్థికి పోలీసు ఎస్కార్ట్ కల్పించాలి: ఈ నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే పరిస్థితి లేదని... నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులందరికీ వారి నివాసాల నుండి నామినేషన్ కేంద్రాల వరకు, తిరిగి ఇళ్లకు చేరే వరకు పూర్తిస్థాయి పోలీసు ఎస్కార్ట్, రక్షణ కల్పించాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. దీంతోపాటు నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడంతో పాటు, దాడులు, బెదిరింపుల కారణంగా ఎక్కడైతే అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారో, అక్కడ తిరిగి నామినేషన్లు సమర్పించేందుకు కమిషన్ తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం తక్షణమే రంగంలోకి దిగి స్వతంత్ర పరిశీలకులను నియమించి, ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.