రాజకీయ కక్షతోనే నా కుమారుడిపై అక్రమ కేసులు

ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

కర్నూలు: తన కుమారుడు రామోహన్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆరోపించారు. సత్యనారాయణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ తన కుమారుడిపై కేసు పెట్టారని, అయితే సత్యనారాయణ తమ ఇంటికి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తమ కుమారుడిపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపేనని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను బెదిరిస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక ఓటమి భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. భర్తను కోల్పోయినప్పటికీ తనను నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనను అడ్డుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తోందని కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Back to Top