తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్, ఎంపీ శ్రీ పి.వి. మిథున్ రెడ్డి మరియు ఆయన భద్రతా సిబ్బందిపై జరిగిన దాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజ్యాంగబద్ధమైన జోక్యం చేసుకోవాలని, పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపించాలని కోరుతూ గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గార్లకు ఆయన అత్యవసర లేఖలు రాశారు. అంతేకాకుండా, ఈ లేఖల ప్రతులను గౌరవ భారత ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI), జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్మన్ మరియు కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) నివేదిస్తూ సమగ్ర దర్యాప్తునకు చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన లేఖల్లో ఇంకా ఏయే అంశాలు ప్రస్తావించారంటే... పుంగనూరులో ప్రణాళికాబద్ధమైన రాళ్లదాడి – గాల్లో పోలీసుల కాల్పులు పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వెళ్తున్న సమయంలో వైఎస్సార్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ శ్రీ పి.వి. మిథున్ రెడ్డి గారి కాన్వాయ్పై, ఇతర వాహనాలపై టీడీపీ శ్రేణులుగా భావిస్తున్న వ్యక్తులు పథకం ప్రకారం రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీ మిథున్ రెడ్డి గారితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న ఒక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిపై పట్టపగలే ఇంతటి దాడి జరగడం రాష్ట్రంలో భద్రతా వైఫల్యానికి నిదర్శనం. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన – అత్యవసర జోక్యం అవసరం.. ఈ సంఘటన భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం పౌరులకు కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు, అలాగే అధికరణ 14 ప్రకారం సమానత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు ఎలాంటి భయాందోళనలు, బెదిరింపులు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలలో పాల్గొనే స్వేచ్ఛను హరించేలా ఈ దాడి జరిగింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తక్షణమే నివేదిక తెప్పించుకోవాలి. బాధితులకు, అభ్యర్థులకు మరియు సాక్షులకు అత్యవసర రక్షణ కల్పించాలి. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని వైనం.. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, బెదిరింపులు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్ననే (15 అక్టోబర్ 2026 – W.P. No. 30103/2026) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోనే ఇంతటి తీవ్ర దాడి జరగడం న్యాయ వ్యవస్థను మరియు చట్టబద్ధ పాలనను సవాలు చేయడమే. ఈ నేపధ్యంలో... లభించిన వీడియోలు, వైద్య నివేదికల ఆధారంగా దర్యాప్తు సంస్థ భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని వర్తించే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి: సెక్షన్లు 115, 117 (స్వచ్ఛందంగా తీవ్రంగా గాయపరచడం), సెక్షన్ 125 (ప్రాణానికి, భద్రతకు ముప్పు కలిగించే చర్య), సెక్షన్లు 189-191 (చట్టవిరుద్ధ సమావేశం, అల్లర్లు), సెక్షన్ 324 (ఆస్తి నష్టం/దుశ్చర్య), సెక్షన్ 351 (నేరపూరిత బెదిరింపులు), బీఎన్ఎస్ కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేయాలి. పోలీసులు యాంత్రికంగా వ్యవహరించకుండా, వాస్తవాలకు అనుగుణంగా స్పష్టమైన సెక్షన్లతో నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 173, 175, 176 ప్రకారం సత్వరమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, భారతీయ సాక్ష్య అధినియమ్ ప్రకారం సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ వీడియోలు, కాల్పుల రికార్డులను భద్రపరచాలి. లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి – ప్రివిలేజెస్ కమిటీ విచారణకు డిమాండ్. రాజ్యాంగంలోని అధికరణ 105 పార్లమెంట్ సభ్యుల హక్కులు, గౌరవాన్ని పరిరక్షిస్తుంది ఈ నేపధ్యంలో... ఒక ఎంపీ తన బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గంభీరమైన అంశమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈ దాడిని లోక్సభ నియమావళి మరియు వ్యవహారాల నిర్వహణ నిబంధనల ప్రకారం పరిశీలించి, వెంటనే లోక్సభ ప్రివిలేజెస్ కమిటీకి (ప్రత్యేకాధికారాల కమిటీకి) నివేదించాలని గౌరవ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి విజ్ఞప్తి చేశారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలి.. అదే విధంగా ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్, క్షతగాత్రుల వైద్య పరీక్షలు, పోలీసు బలగాల మోహరింపు, భద్రతా వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని, చట్టం నిర్దేశించిన కాలపరిమితిలో తీసుకున్న చర్యల నివేదికను (Action-Taken Report) సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని గౌరవ రాష్ట్రపతి గారికి, సంబంధిత వ్యవస్థలకు సమర్పించిన వినతిపత్రాల్లో ఎంపీ గురుమూర్తి కోరారు.