కృష్ణా జిల్లా: పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం జోన్-3 అధ్యక్షురాలు మైలా రత్నకుమారి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో వైయస్ఆర్సీపీని ఎదుర్కోలేకే కూటమి ప్రభుత్వం దాడులు, బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ నాయకులు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు. పుంగనూరు నుంచి తాడిపత్రి, దాచేపల్లి, పత్తికొండ, రాయచోటి వరకు దాడులు, అక్రమ కేసులు, బెదిరింపులతో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ హక్కును అడ్డుకుంటున్నారని రత్నకుమారి ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని, దాడులకు సహకరించిన వారితో పాటు బాధ్యులైన అధికారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాత ఎన్నికలకు భరోసా కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసే హక్కు, ఓటు వేసే స్వేచ్ఛ ఉండాలని, అధికార బలంతో ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులకు వైయస్ఆర్సీపీ భయపడబోదని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఎన్నికల సంఘం, న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని మైలా రత్నకుమారి వెల్లడించారు.