తాడేపల్లి: పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డి, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులను వైయస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా దాడులు, నామినేషన్ పత్రాల లాక్కోవడం వంటి ఘటనలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులకు పాల్పడి, దాదాపు 40 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ అనుచరులు దాదాపు 800 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి విచక్షణారహితంగా కొట్టి, మహిళలను సైతం వదలకుండా దాడులకు పాల్పడ్డారు. మా అభ్యర్థుల గోళ్లను పీకేంతగా దాడులు చేశారు. రవీంద్ర అనే యువకుడి పెదవి పగలగొట్టారు. అయ్యప్ప దీక్షలో ఉన్న అభ్యర్థిని కూడా చితకబాదారు. పోలీసు వ్యవస్థ ప్రేక్షకపాత్రకే పరిమితమై, అధికార పార్టీ అనుచరులకు అండగా ఉంటూ మా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా అడ్డుకోవడం లేదు. పుంగనూరులో మా పార్టీ కీలక నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన వాహనాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం, రాయచోటిలో వైఎస్సార్సీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తున్నాయి. తిరుపతితో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేస్తూ ఎన్నికలను స్వేచ్ఛగా జరగనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. చంద్రబాబు, లోకేశ్ల ఆధ్వర్యంలో ఇలాంటి దౌర్జన్య రాజకీయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు అధికార బలం, పోలీసుల అండతో పైచేయి సాధించామని భావించవచ్చు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. మా కార్యకర్తలు ఎన్ని దాడులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కొని ఏకగ్రీవాలు సాధించినంత మాత్రాన ప్రజల మనసులను గెలుచుకున్నట్లు కాదు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూసే ఈ అరాచక రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారు. వైఎస్ జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతుంది, అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదు. రాయచోటిలో ఎప్పుడూ చూడని రౌడీ సంస్కృతి - వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో ఎప్పుడూ చూడని రౌడీ సంస్కృతిని తీసుకొచ్చారు. నియోజకవర్గంలో ఉన్న లక్ష ఇళ్ల నుంచి ప్రజలు రోజూ దేవాలయం లాంటి వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారు. అలాంటి ఆఫీసుని టీడీపీ గూండాలు తగలబెట్టారు. నాలుగు లక్షల మందిలొ ఒకడిగా నడుచుకుంటున్న నా మనసును గాయపరిచారు. నా అనుచరుల మీద దాడి చేసి గాయపరచడమే కాకుండా నా కారు, పార్టీ నాయకుల కార్లను, బైకులను తగలబెట్టారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న ఇన్నేళ్ల కాలంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు లేవు. దమ్మూ ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ టీడీపీ విజయం సాధిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తున్నా. ప్రెస్టీజ్ అంటే రాయచోటికి మళ్లీ జిల్లాగా చేయలి. అంతేకానీ అడ్డదారిలో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరైన విధానం కాదు. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితి లేదు కాబట్టే, టీడీపీ నాయకులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈరోజు చేస్తున్న అరాచకాలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తా. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు - వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వెంటనే మా వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డి తీసుకెళ్తుండగా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దారుల్లో రాళ్లు, కట్టెలు వేసి వాహనాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. మా అభ్యర్థులు ఉదయం 10.45 గంటలకే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నప్పటికీ, 11 గంటల తర్వాత నామినేషన్లు సమర్పించేందుకు ప్రయత్నించినప్పుడు వాటిని స్వీకరించకుండా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. ఈ దాడుల్లో ఒక ఆర్మ్డ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమవడంతో పాటు పలువురు గాయపడ్డారు. తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకుండా, టీడీపీ కార్యకర్తల దాడులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమవుతున్నాయి. పుంగనూరులో జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఇలాంటి చర్యలను ప్రజలు సహించరు, ఈ పరిణామాలకు ప్రభుత్వం ప్రజల ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. నామినేషన్లు ఆన్లైన్లో స్వీకరించాలి - లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సంఘం కార్యాలయం: నామినేషన్ మొదటి రోజే ప్రజాస్వామ్యాన్ని తగల బెడుతున్నారు. దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి.. ఈ స్థాయిలో దౌర్జన్యాలు, అక్రమాలు, అరాచకాలు హత్యా ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. లోక్ సభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా వున్నా మిథున్ రెడ్డి పై టీడీపీ గుండాలు, నాయకులు దాడి చేశారు. టీడీపీ గుండాలు దాడి చేస్తారనే సమాచారం ముందుగానే పోలీసులకు, రెవిన్యూ అధికారులకు ఇచ్చాం. రాళ్లు, కర్రలతో మిథున్ రెడ్డిపై హత్యా ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా దాడి చేశారు. ఎన్నికలంటే దాడులు, హత్యలు చేయడమా? ఇలాంటి హింసా వాతావరణం సృష్టించి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. రాయచోటిలో మంత్రి వైఎస్సార్సీపీ నాయకులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని, పార్టీ నాయకుల కార్లు, బైకులు తగలబెట్టారు. తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా నామినేషన్ వేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి భయపెడుతున్నాడు. తిరుపతిలో మహిళ చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్లారు. దాచేపల్లిలో చైర్మన్ అభ్యర్థి అపార్ట్మెంట్ కింద బాటిల్స్ పెట్టి అక్రమ అరెస్ట్ చేశారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరిగాయని వినేవాళ్లం. ఇప్పుడు ఆంధప్రదేశ్ లో చూస్తున్నాం. పారా మిలిటరీ దళాలను తీసుకొచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఉత్తరాల ద్వారా సమస్య పరిస్కారం కాదు. నోడల్ ఆఫీసర్ గా వున్నా రాజకుమారి గారికి సమస్య వివరించాం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకపోతే తర్వాత జరిగే పరిణామలకు ఎస్ఈసీ బాధ్యత వహించాలి. ఆన్లైన్లో నామినేషన్ తీసుకోవాలని, మరో అధికారిని కూడా ఏర్పటు చేయాలనీ వైఎస్సార్సీపీ కోరుతుంది. నామినేషన్ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలి - ఆర్కే రోజా, మాజీ మంత్రి ఎంపీ మిథున్ రెడ్డి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల్లో కూడా రెడ్బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే గెలిచే అవకాశం లేదనే భయంతోనే టీడీపీ శ్రేణులతో చంద్రబాబు, లోకేష్లు వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడులు చేయిస్తున్నారు. రెండేళ్లలో చేసిన మంచి పని ఒక్కటీ లేదు కాబట్టే, ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగలేక, మా పార్టీ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అరాచకాలకు వాడుకుంటున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు పోలీసులు పటిష్ట రక్షణ కల్పించాలి. అధికారం శాశ్వతం అనే భ్రాంతిలో టీడీపీ - చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన పుంగనూరులో టీడీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలు అధికారం ఇచ్చింది దాడులు చేయడానికి కాదు. ప్రజా సమస్యలను పరిష్కరించడం మానేసి దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. అధికారం శాశ్వతం అనే భ్రాంతి నుంచి బయటకొస్తే మంచిది. జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న పార్లమెంట్ సభ్యుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. తక్షణమే కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించాలి. తక్షణమే కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలి. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే కూటమి గెలవలేదు - టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఒక పధకం ప్రకారం ఎన్నికళను హైజాక్ చేశారు. పోలీసులను, గూండాలను అడ్డుపెట్టుకుని దాడులతో, హింసతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. చంద్రబాబుకి నిజాయితీ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అధికార కూటమి ఓడిపోతుందని భయపడుతున్నారు. మిథున్ రెడ్డి పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బలవంతంగా గెలిపించుకున్నా పదవుల్లో ఉండేది రెండేళ్లే. ఆ తర్వాత గెలిచిన వాళ్ళు బొమ్మలుగా మిగిలిపోతారు.