తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం, వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడి, వాహనాల ధ్వంసం, తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేత, తాడిపత్రిలో అభ్యర్థికి బెదిరింపులు, దాచేపల్లిలో చైర్మన్ అభ్యర్థి నిర్బంధం వంటి ఘటనలు కలకలం రేపాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకునే ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్ఈసీకి వినతిపత్రం అందజేయగా, ఎంపీ గురుమూర్తి మిధున్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనను వివరిస్తూ ప్రధాని, హోం మంత్రి, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘాని (ఎన్హెచ్ఆర్సీ)తో పాటు, కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి లేఖ రాశారు. మరోవైపు ఈ ఘటనలపై వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పుంగనూరు: రాజంపేట ఎంపీ, వైయస్ఆర్సీపీ లోక్‌సభాపక్ష నేత పి.వి. మిథున్‌రెడ్డి పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తుండగా దాడి జరిగినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో మిథున్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, ఆయన గన్‌మన్ గాయపడినట్లు తెలిపాయి. నామినేషన్ కేంద్రం వద్ద వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారని, పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. పుంగనూరులో నామినేషన్లకు ఆటంకాలు: వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు అంగీకరించడం లేదని పార్టీ నేతలు ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి వైఖరిపై ఎంపీ మిథున్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులందరికీ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని కోరారు. తాడిపత్రి: శాస్త్రినగర్‌లో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వేణుగోపాల్ ఇంటి వద్ద జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు హల్చల్ చేసి, ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ బెదిరించినట్లు వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని అభ్యర్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి. తిరుపతి: కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైయస్ఆర్సీపీ మహిళా అభ్యర్థి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసినట్లు పార్టీ నేతలు ఆరోపించారు. అభ్యర్థుల హక్కులను కాపాడి, ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి కోరారు. రాయచోటి: వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సమావేశమైన నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెళ్లిపోవాలని ఆదేశించడంపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఒత్తిళ్లతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని, కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలోనూ అడ్డంకులు సష్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాచేపల్లి, నడికుడి: మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు తెల్లవారుజామున తీసుకెళ్లడంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్ పార్కింగ్ స్థలంలో మద్యం బాటిళ్లు పెట్టి అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపట్టారని విమర్శించారు. ధర్మవరం: వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పుష్పమణికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో నామినేషన్ కేంద్రం వద్ద రాళ్ల దాడిలో ఆరుగురు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ పత్రాలను చించివేశారని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించాయి. ఆదోని: వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని పార్టీ ఆరోపించింది. ఇప్పటికే 400 మందికి పైగా బైండోవర్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. పోలీసులను అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవా డిమాండ్ చేశారు. కడప: ఆర్వోకు సమర్పించిన నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని, మాజీ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డిపై దాడి చేశారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. తన సోదరి పార్టీ తరఫున నామినేషన్ వేయడమే దాడికి కారణమని పేర్కొంది. ఘటనపై విచారణ జరిపి అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్‌కు లేళ్ల అప్పిరెడ్డి లేఖలు: నామినేషన్లకు అడ్డంకులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసంపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులకు పోలీసు రక్షణ, నామినేషన్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని, నామినేషన్లు వేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాల కోసం హైకోర్టును ఆశ్రయించిన వైయస్ఆర్సీపీ: పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి, కడప ఘటనలను పార్టీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిథున్‌రెడ్డి ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖలు: పుంగనూరులో మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఈ ఘటనను పార్లమెంటరీ ప్రత్యేక హక్కుల ఉల్లంఘనగా పరిగణించి ప్రివిలేజెస్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. వైయస్ఆర్సీపీ డిమాండ్: నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన దాడులు, బెదిరింపులు, పత్రాల ధ్వంసం, నిర్బంధ ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని పార్టీ కోరుతోంది. అభ్యర్థులకు భద్రత కల్పించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు, ఎన్నికల అధికారులను డిమాండ్ చేసింది.