శ్రీకాకుళం: చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వానికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు శుక్రవారం పెదపాడులోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్సీపీలో చేరాయి. ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని, పేదలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలపై ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే వాటి అమలుపై మాట మార్చారని విమర్శించారు. రైతులు, పేదల సంక్షేమాన్ని విస్మరించారు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు అందించడంతో పాటు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయానికి అండగా నిలిచామని ధర్మాన గుర్తుచేశారు. ప్రస్తుతం యూరియా కూడా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, కూలీలకు ఉపాధి, మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శ్రీకాకుళంలో లంచాల సంస్కృతి దారుణం శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎనిమిది దశాబ్దాల చరిత్రలో ప్రజాసేవకు ప్రాధాన్యమిచ్చిన నాయకులు ప్రాతినిధ్యం వహించారని ధర్మాన పేర్కొన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే సంస్కృతి గతంలో లేదని, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని విమర్శించారు. ప్రజాసేవలో అవినీతికి తావుండకూడదని, ఈ పరిస్థితులను మార్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారు వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధికార యంత్రాంగం ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశామని ధర్మాన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను గ్రామగ్రామాన వివరించి, ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు సాగునీరు, కూలీలకు ఉపాధి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించలేని ప్రభుత్వాన్ని ప్రజలు సమర్థించరని అన్నారు. వైయస్ఆర్సీపీలో చేరిన కుటుంబాలు సరైన నిర్ణయం తీసుకున్నాయని అభినందించిన ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి జనార్దన రావు, రాష్ట్ర వైయస్ఆర్సీపీ వెలమ సంఘం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు బోర చిన్నం నాయుడు, గుండ ఢిల్లీ రావు, ఎచ్చెర్ల శ్రీధర్, బాన్న నర్సింగరావు, రుప్ప అప్పలసూరి, రావాడ మోహన్ రావు, బొబ్బది చంద్రమౌళి, బోర రమణ, ఉటపల్లి కృష్ణ, గదిల దళింగరావు, ఉంగటి గోపాల్, గుండ హరీష్, బాన్న శ్రీను, గొండు నీలాద్రి, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.