ఇచ్ఛాపురం సభ జయప్రదానికి పిలుపు

పలాస 02 ఆగస్టు 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రపంచ రికార్డు సృష్టించిందని పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఇచ్చాపురంలో ఆదివారం నాడు ఏర్పాటవుతున్న బహిరంగ సభను అదే స్థాయిలోనే నిర్వహిస్తున్నామనీ,  ముగింపు సభను విజయవంతం చేయాలనీ  బొబ్బిలి తాజా మాజీ ఎమ్మెల్యే కూడా అయిన రంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  పాదయాత్ర ముగింపు సభపై ఆయన పలాస గాలిమేడ ఆవరణలో పార్టీ సీజీసీ, సీఈసీల సభ్యులు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజవర్గ పార్టీ ఇన్‌చార్జి కుంభా రవిబాబు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 230 రోజులపాటు 3 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేయటం ద్వారా, ప్రపంచంలోనే ఇంతదూరం పాదయాత్ర చేసిన తొలి మహిళగా శ్రీమతి షర్మిల అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. తొలిరోజు వేసిన అడుగు మొదలుకొని ఇప్పటివరకు అలుపెరగకుండా దారిపొడవునా కనిపించిన ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ దూసుకుపోయారన్నారు.

నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తెలంగాణ లోని  లోక్‌సభ సీట్ల కోసం రాష్ట్రాన్ని విడదీసేందుకు కాంగ్రెస్ కుటిలయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి అతిత్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 4న ఇచ్ఛాపురంలో మరో ప్రజాప్రస్థానం చారిత్రాత్మక ఘట్టం ముగియనున్నందున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున హాజరై దివంగత మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిలమ్మను ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం, ఎం.వి.కృష్ణారావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కల్యాణి, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పిరియా సాయిరాజ్, వజ్జ బాబూరావు, కలమట వెంకటరమణ, దువ్వాడ శ్రీనివాస్, బొడ్డేపల్లి మాధురి, పాలవలస విక్రాంత్, పి.ఎం.జె.బాబు, స్థానిక నాయకులు ధవళ గిరిబాబు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, పాలవలస వైకుంఠరావు, డబ్బీరు భవానీశంకర్, బళ్ల గిరిబాబు, నర్తు ప్రేమ్‌కుమార్, యవ్వారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top