కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ కుట్రలు ఆపండి

హైదరాబాద్, 13 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు గురువారంనాడు గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నర్శింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఇకపైనైనా వాటి కుట్రలను నిలువరించాలని వారు గవర్నర్‌ను కోరారు. ప్రజల నుంచి శ్రీ జగన్‌ను దూరం చేయాల‌ని కాంగ్రెస్‌, టిడిపిలు చేస్తున్న కుట్రల గురించి గవర్నర్‌ నర్శింహన్‌కు వారు వివరించారు. ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చకు రానివ్వకుండా చేసి, ఆ రెండు పార్టీలూ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను భ్రష్టుపట్టించాయని ఫిర్యాదు చేశారు. ఎపిపిఎస్‌లో జరుగుతున్న అవకతవకలపైనా ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యే‌ జి. శ్రీకాంత్‌రెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

సిబిఐ వ్యవస్థను కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్న నాయకులపై సిబిఐ పదే పదే చేస్తున్న చర్యలపై జోక్యం చేసుకుని, నివారించాలని గవర్నర్‌కు విజ్ఞప్తిచేసినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిని సావధానంగా విన్న గవర్నర్‌ సానుకూలంగా స్పందించారన్నారు.

అసెంబ్లీ పరువును దిగజార్చిన కాంగ్రెస్‌, టిడిపి :
అసెంబ్లీ ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారడానికి టిడిపియే కారణమని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై శాసనసభను పది నిమిషాలు కూడా సజావుగా జరగనివ్వకుండా చేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. పది నిమిషాలు, అరగంట చివరికి గంటలకు గంటలు అసెంబ్లీని వాయిదా వేసేసి, ఆనక ఆ రెండు పార్టీల సభ్యులు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీని ఎంత దిగజార్చాలో అంతగా దిగజార్చారని దుయ్యబట్టారు. ఒక వైపున ఆ రెండు పార్టీలు కుమ్మక్కవుతూనే మరో పక్కన మరుసటి రోజున టిడిపి సభ్యులు టీవీలలో కనపడడానికి పోరాటం చేస్తున్నట్లుగా రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ గవర్నర్‌కు పూర్తిగా వివరించినట్లు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్‌ చేస్తున్నదీ వివరించామన్నారు.‌

ఎపిపిఎస్‌సి బోర్డుల అక్రమాలపై ఫిర్యాదు :
ఎపిపిఎస్‌సి బోర్డులో జరుగుతున్న అక్రమాలన్నింటిపైనా తాము గవర్నర్‌కు వివరించామన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తపించిపోతున్న తరుణంలో బోర్డులో అవకతవకలు చోటుచేసుకోవడంపై ఆయనకు చెప్పామన్నారు. రాష్ట్ర యువతకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూస్తామని, ఈ విషయంలో విచారణ జరిపిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారన్నారు.

వచ్చే అధికారి అయినా నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి :
భూమా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ, శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ ఒక్కటై ఏ విధంగా కుట్ర చేసి, బయటకు రానివ్వకుండా చేస్తున్నారో గవర్నర్‌కు చెప్పామన్నారు. ఇంతవరకూ సిబిఐ జెడిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తీరు గురించి మొదటి నుంచీ కూడా తాము మీడియాకు చెబుతూ వచ్చామన్నారు. లక్ష్మీనారాయణ స్థానంలో కొత్తగా వచ్చే అధికారి అయినా సరైన రీతిలో దర్యాప్తు చేసేలా చూడాలని గవర్నర్‌కు తాము విజ్ఞప్తి చేశామన్నారు. టిడిపికి తోకపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలో వచ్చే అసత్య వార్తల ఆధారంగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై లక్ష్మీనారాయణ విచారణ చేసేవారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ గవర్నర్‌కు చెప్పామన్నారు. టిడిపి నాయకుల చేత చంద్రబాబు ఏది మాట్లాడిస్తారో, మరుసటి రోజు తోక పత్రికలు దానినే ప్రచురిస్తాయని, దానికి అనుగుణంగానే సిబిఐ వ్యవహరిస్తోందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు.

తోక పత్రికల్లో టిడిపి మాట... సిబిఐ వంత పాట :
ఆ రోజున రూ. 40 వేల కోట్లు అవినీతి జరిగిందంటే సిబిఐ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కేసు వేసిందని, మొన్న రేవంత్‌రెడ్డి శ్రీ జగన్‌ను, విజయసాయిరెడ్డిని ఒకే జైలులో ఉంచకూడదని అంటే.. మరుసటి రోజు అదే అంశంపై సిబిఐ మెమో దాఖలు చేసిందని దుయ్యబట్టారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు సిబిఐ, కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయనడానికి రుజువులుగా ఉన్నాయన్నారు. టిబిపి మార్గదర్శనంలోనే జెడి లక్ష్మీనారాయణ ఇన్ని రోజులూ ఈ కేసును దర్యాప్తు చేశారని ఆరోపించారు. కోట్ల విలువైన 850 ఎకరాలను ఐఎంజి సంస్థ పేరున బిల్లీరావుకు చంద్రబాబు అప్పనంగా కట్టబెడితే.. దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని చెప్పి తప్పించుకున్న జెడి లక్ష్మీనారాయణ అదే శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఏక కాలంలో 40 బృందాలను పెట్టి సోదాలు చేయించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐ కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వేధిస్తున్న విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని శోభా నాగిరెడ్డి హెచ్చరించారు.
గవర్నర్ను కలిసినవారిలో‌ పార్టీ శాసనసభా పక్షం ఉపనేత భూమా శోభా నాగిరెడ్డి, సుచరిత, బాలరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు,‌ జి. శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top