హైదరాబాద్ చేరుకున్న వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి

హైదరాబాద్, 18 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రా‌ష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు దేశ రాజధానిలో రెండు రోజుల పాటు వామపక్షాలు, బీజేపీ అగ్రనేతలతో శ్రీ జగన్ చర్చలు  జరిపారు.

‌విభజన రాజకీయాలు, సమైక్య ఉద్యమ సెగల నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంస్థాగత విషయాలు, తదుపరి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇందులో చర్చిస్తారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృత స్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వస్తాయి.

సెప్టెంబర్ 21న జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నెల రోజుల ఆందోళన కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమే‌ కాక, ఇప్పటికీ చురుగ్గా ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఢిల్లీలో ఓ వైపు విభజన ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న తరుణంలో ఈ రోజు జరగనున్న ఈ సమావేశంలో అధ్యక్ష హోదాలో శ్రీ జగన్.. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై కీలకోపన్యాసం చేస్తారు.

Back to Top