ఎమ్మెల్యే రాజన్న దొరకు పార్టీ సభ్యత్వం

హైదరాబాద్ :

సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర ఆదివారం సాయంత్ర వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి సమక్షంలో ఆయన వైయస్ఆర్‌సీపీ సభ్యత్వం తీసుకున్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్లో‌ ఉన్న శ్రీ జగన్‌ క్యాంపు కార్యాలయంలో రాజన్నదొర తన అనుచరులతో సహా పార్టీలో చేరారు. ‌రాజన్నదొరతో పాటు ఆయన అనుచరులకు కూడా శ్రీ జగన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ స్థానం నుంచి రాజన్నదొర ఎన్నికయ్యారు.

రాజన్నదొరతో పాటు సాలూరు మున్సిపల్ మాజీ ఛైర్మ‌న్ జరజాపు ఈశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మేడిశెట్టి అప్పలనాయుడు, కె.సత్యం, సూర్యనారాయణతో పాటు 30 మంది సర్పంచ్‌లు, ఐదుగురు మాజీ కౌన్సిలర్లు, 8 మంది మాజీ సర్పంచ్‌లు, ఇద్దరు పీఏసీఎస్ అధ్యక్షులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు కూడా వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రాజన్నదొర మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని సమైక్యంగా ఉంచేందుకు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న విస్తృత కృషికి చేదోడువాదోడుగా ఉండాలనే తాను, తన అనుచరులు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలంతా కలిసిమెలిసి జీవించారని రాజన్నదొర అన్నారు. అయితే, ఆయన మరణానంతరం, ప్రస్తుత పాలకుల వైఖరి కారణంగా ఒకరినొకరు శత్రువులుగా పరిగణించుకోవాల్సిన దుస్థితి వచ్చిపడిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు రెండూ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నాయని, ప్రజలను మోసగించేందుకు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు.

‌ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుజయ్‌ కృష్ణ రంగారావు, కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top