'ఫీజు దీక్ష' పై బొత్స వ్యాఖ్యలు సరికాదు

హైదరాబాద్, 18 జూలై 2013 :

విద్యార్థుల మీద ఆర్థిక భారం పడకూడదనే తమ పార్టీ ఫీజు దీక్ష చేస్తున్నది, పోరాటం చేస్తున్నది అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి స్పష్టంచేశారు. విషయం తెలియకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడడం సరికాదని ‌ఆయన ఖండించారు. కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చేందుకే శ్రీమతి విజయమ్మ ఫీజు దీక్ష చేస్తున్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై మైసూరా తీవ్రంగా స్పందించారు. అలాంటి అలవాటు బొత్సకు ఉందేమో అన్నారు. కేవలం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మాత్రమే  శ్రీమతి విజయమ్మ ఫీజు దీక్ష చేస్తున్న విషయాన్ని బొత్స తెలుసుకుంటే మేలు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన బొత్స తీరును ఎండగట్టారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదనే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఇందిరాపార్కు వద్ద 'ఫీజు దీక్ష' చేస్తున్నారని మైసూరారెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికే 175 కళాశాలలు రూ. 35 వేలకు పైనే ఫీజు వసూలు చేస్తున్నాయన్నారు. మరో 125 కాలేజీలు ఫీజులు పెంచాలంటూ కోర్టులను ఆశ్రయించాయన్నారు. ఫీజులపై తుది నిర్ణయానికి లోబడి చెల్లిస్తామని విద్యార్థుల దగ్గర హామీ తీసుకుని అడ్మిషన్లు జరుపుకోమని కోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన వైనాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.35 వేల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసుకునే కేటగిరిలోకి సగానికి పైనే కాలేజీలు వచ్చాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం రూ. 35 వేలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన కారణంగా ఈ కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థులు తమ చేతి నుంచే ఆ పైన ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఆయన విచారం వ్యక్తంచేశారు.

పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించేందుకు ముందుకు రావాలని మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు. కాలేజీలు అడిగినప్పుడల్లా ఫీజులు పెంచుతూపోయి, తాను ఇచ్చేది మాత్రం రూ. 35 వేలు మాత్రమే అని ప్రభుత్వం చెప్పడం విద్యార్థుల మీద భారం వేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top