గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు అనేక తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. మహానేత పథకాలు మళ్ళీ కొనసాగాలంటే జననేత శ్రీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గమని ప్రజలు భావిస్తున్నారన్నారు. అమరావతి మండలం నెమలికల్లులో ఏర్పాటు చేసిన మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని శనివారం రాత్రి సుచరిత ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభకు వైయస్ఆర్సిపి నాయకుడు గుత్తికొండ పెద అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. త్వరలోనే శ్రీ జగన్మోహన్రెడ్డి మరో సువర్ణ యుగానికి నాంది పలకబోతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా కాలమే స్వర్ణయుగం అన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రైతాంగానికి ఉచిత విద్యుత్, రుణ మాఫీ, పేదలకు ఆరోగ్యశ్రీ, పింఛన్లతో పాటు బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహానేత కృషి చేశారన్నారు.
పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడారు.