'జనం నమ్మని ప్రభుత్వంపై బాబుకు విశ్వాసం'

కె.తిమ్మాపురం (కర్నూలు జిల్లా), 17 నవంబర్‌ 2012: ప్రజా సమస్యలు పట్టించుకోని కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదని వైయస్‌ఆర్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మాత్రం విశ్వాసం ఉందని అన్నారు. అందుకే ఈ అసమర్ధ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టడంలేదని దుయ్యబట్టారు.

శాసనసభ సమావేశాలు లేవని సాకు చెబుతూ అవిశ్వాసం పెట్టకుండా ఆయన కాలయాపన చేస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కె.తిమ్మాపురంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల అవిశ్వాసంపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు.

గురు రాఘవేంద్ర ప్రాజెక్టును చంద్రబాబు ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని షర్మిల ఆరోపించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టును పూర్తిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకమని, దానికి విద్యుత్, మో‌టార్ల అవసరం ఉందన్నారు. అయితే విద్యుత్, మోటార్లు సమకూర్చటానికి ప్రభుత్వానికి మూ‌డు సంవత్సరాల కాలం సరిపోలేదని షర్మిల విమర్శించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీరుస్తారని షర్మిల హామీ ఇచ్చారు. కె.తిమ్మాపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల మహిళలు, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తమకు ఫీజు రీయింబర్సుమెంట్‌ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని షర్మిల ముందు విద్యార్థులు వాపోయారు.
Back to Top