ఆస్పత్రి నుంచి జగన్ డిశ్చార్జి

హైదరాబాద్ 12 అక్టోబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని నిమ్సు ఆస్పత్రి నుంచి  శనివారం ఉదయం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా శ్రీ జగన్‌ను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి తరలివచ్చారు. జై జగన్‌  అంటూ నినాదాలతో హోరెత్తించారు.  శ్రీ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, తదితరులు ఆస్పత్రికి వచ్చారు. కీటోన్లు  మినహా... చక్కెర, తదితరాలన్నీ సాధారణ స్థాయికి వచ్చినట్టు  వైద్య పరీక్షల్లో తేలటంతో వైద్యులు ఆయనను  ఇంటికి పంపారు.  కీటోన్సు సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు శనివారం తెలిపారు. మూడు రోజుల పాటు విశ్రాంతి  తీసుకోవాలని సూచించారు.
సమైక్యాంధ్ర డిమాండ్‌తో  ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఆరోగ్యం క్షీణించటంతో ఈనెల 9న అర్ధ రాత్రి పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. శ్రీ  జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ వైద్యులు బలవంతంగా  సెలైన్ ఎక్కించారు.  ఆయన ఎంత ప్రతిఘటించినా పోలీసులు, వైద్యులు కలసి దీక్షను భగ్నం చేశారు.

Back to Top