కడప అంటే బాబుకు కడుపుమంట


చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు
13 ఏళ్ల తరువాత ఉక్కు పరిశ్రమ ఇవాళ గుర్తొచ్చిందా?
ప్రజల జీవనశైలి మార్పునకు వైయస్‌ఆర్‌ ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చారు 
తానే పరిశ్రమ స్థాపిస్తానన్న సీఎం మాటల్లో కుట్ర 
కమీషన్లకు కక్కుర్తిపడి పోలవరం, భోగాపురం అడ్డుకున్న బాబు
రాష్ట్ర ప్రయోజనాలకంటే కమీషన్లే ముఖ్యమంత్రి
దేవినేని ఉమ చరిత్ర చెబితే తలెత్తుకొని తిరగలేడు
ప్రాజెక్టులపై చంద్రబాబుకు అవగాహన ఉందా?
వైయస్‌ఆర్‌లా.. పరిపాలన చూపించి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా?
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడుపుమంట అని, గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తెర ముందు ఒకలా.. తెరవెనుక ఒకలా ఉండే వ్యక్తి అని.. ఆయన రాసుకున్న పుస్తకం మనసులో మాట ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. వ్యవసాయం, రైతులను ఎలా కించపరిచాడో అర్థం అవుతుందన్నారు. కడప జిల్లాపై కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబుపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబుకు అప్పుడు ఉక్కు పరిశ్రమ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అదే విధంగా 2014 నుంచి 18 వరకు ఒక్కరోజైనా కేంద్రంపై ఉక్కు పరిశ్రమపై పోరాటం చేశారా అని నిలదీశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ఉక్కుపరిశ్రమకు శంకుస్థాపన చేసి ప్రహరీ, సంబంధించిన మెషినరీ తెప్పిస్తే పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. 

వైయస్‌ఆర్‌ సీపీ పోరాటపంథాను పెంచిందని, ప్రజల్లో ఉక్కు సెంటిమెంట్‌ తీవ్రతరమైందని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని గడికోట ధ్వజమెత్తారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ ఆర్టీసీ బస్సుల్లో అంగన్‌వాడీలను, ఆశావర్కర్లను సభలకు తరలించుకుంటున్నారన్నారు. చంద్రబాబు దొంగ దీక్షలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఇవ్వాలనుకున్నా.. అడ్డుకునేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కడపలో సీఎం రమేష్‌నాయుడు దీక్ష విరమణ సమయంలో కేంద్రానికి ఆరు నెలలు గడువు ఇస్తున్నానని, లేకపోతే తానే పరిశ్రమను ఏర్పాటు చేస్తానని చెప్పి.. మళ్లీ విజయవాడకు వెళ్లి మాటమార్చారన్నారు. ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఆ చుట్టుపక్కల భూములన్నీ తన వారికి కేటాయించి లబ్ధిపొందాలనే కుట్ర చంద్రబాబు అంతరర్థమన్నారు. లంచాలు తీసుకొని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చూస్తున్నారన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపిస్తే ప్రజల జీవనశైలి మారిపోతుందని.. రెండో పరిశ్రమకు కూడా వైయస్‌ఆర్‌ ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా జిల్లాకు ఒక్క మంచిపనైనా చేశావా..? వేదికలపైకి ఎక్కి గేట్లు వేయించి అడ్డమైన స్పీచ్‌లు ఇవ్వడం తప్ప కడపకు నువ్వు ఒరగబెట్టిందేమిటి చంద్రబాబూ అని నిలదీశారు. 

40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏ రోజు అయినా ఒక్క పోరాటం చేసిన చరిత్ర ఉందా.. చంద్రబాబూ అని ప్రశ్నించారు. వంచన, వెన్నుపోటుతోనే బాబు రాజకీయాలు కొనసాగాయన్నారు. భూములు కొట్టేయాలని కడప ఉక్కు అంటూ చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్న చంద్రబాబు విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం పోర్టు, ప్రత్యేక హోదా లాంటి అంశాల్లో కూడా కేంద్రం ఇవ్వకపోతే తానే ఇస్తానని చెబుతాడేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ కడపలో మొదలుపెట్టాలనేది వైయస్‌ఆర్‌ ఆకాంక్ష అని.. దానికి శంకుస్థాపనలు పనులు ప్రారంభించడంతోనే అది విభజన చట్టంలో పెట్టారన్నారు. వ్యక్తిగత లాభాలు, పదవి కాంక్ష తప్ప చంద్రబాబుకు రాష్ట్రాన్ని బాగుచేయాలనే తపన లేదన్నారు. అదే ఉంటే గతంలో వైయస్‌ఆర్‌ ప్రారంభించినప్పుడు అడ్డుకుంటు సృష్టించివాడు కాదని, ప్రజలందరికీ తెలుసన్నారు. 
కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నాడని గడికోట మండిపడ్దారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును కమీషన్ల కోసం తీసుకున్నాడని, మొదటి బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయిస్తే ప్రశ్నించలేదు.. మిగిలిన మూడు బడ్జెట్లలో ఒక్క రూపాయి కేటాయించకపోయినా పోరాటం చేయలేదు.. కారణం కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారని అనేక వాస్తవాలు వచ్చాయన్నారు. కమీషన్ల కోసమే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకున్నారన్నారు.  రాష్ట్ర ప్రయోజనాలకంటే కమీషన్లే ముఖ్యమా చంద్రబాబూ అని ప్రశ్నించారు. 

ప్రజలు బానిసలు కాదని చంద్రబాబు పిచ్చి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఓట్లుకు కోట్ల కేసుకు భయపడి కేంద్రానికి బానిసగా మారిన చంద్రబాబు ప్రజలు బానిసలు కారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు బానిసలు ఎందుకు అవుతారని ప్రశ్నించారు. ఇలాంటి పిచ్చి స్టేట్‌మెంట్లతో ప్రజల ఆదరణ చురగొనాలనుకుంటే పొరబాటని, చరిత్రహీనుడిగా మిగిలిపోతావన్నారు. నాలుగేళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రజలందరికీ తెలుసన్నారు. రెండు అంశాలతో బీజేపీ అంతు తేల్చుతానని చెప్పిన కుటుంబరావు ఎక్కడికి వెళ్లారో కనిపించడం లేదని గడికోట ఎద్దేవా చేశారు. బీజేపీ బండారం టీడీపీ.. టీడీపీ బండారం బీజేపీ బయటపెట్టొద్దని కుమ్మక్కు రాజకీయాలు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఇందులో భాగంగానే బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో మెంబర్‌షిప్‌ ఇచ్చారా అని నిలదీశారు. 

మంత్రి దేవినేని ఉమా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని శ్రీకాంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి అతను వాడే భాష విని టీడీపీ సిగ్గుపడాలన్నారు. దేవినేని ఉమ చరిత్ర బయటపెడితే.. కుటుంబ రాజకీయాలు చెబితే సమాజంలో తలెత్తుకొని తిరగలేడని, పార్టీ సిద్ధాంతాలు, వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామన్నారు. పట్టిసీమతో రాయలసీమకు నీరు ఇస్తానని చెప్పిన దేవినేని ఎన్ని ఎకరాలకు నీరు అందించారో చెప్పాలన్నారు. పోలవరం రైట్‌ కెనాల్‌కు మోటర్లు బిగించుకొని షో చేసుకుంటున్నారన్నారు. 

ఖరీఫ్‌లో రాయలసీమ పరిస్థితి ఏంటని టీడీపీ సర్కార్‌ను గడికోట ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా డెల్టాలో వరి నాటుకుంటుంటే శ్రీశైలంలో 854 అడుగుల లెవల్‌ మెయిన్‌టైన్‌ చేయకపోవడంతో సీమ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గతంలోనూ చంద్రబాబు ఆల్‌మట్టి డ్యాం ఎత్తుకట్టేటప్పుడు ఏం చేశారని ప్రశనించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి దేవగౌడను ప్రధానిని చేశావా అని నిలదీశారు.  ఆల్‌మట్టి కట్టడం వలన 854 లెవల్‌ లేకపోవడంతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి రైట్‌ కెనాల్‌ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు ఇచ్చి ఆమేరకు శ్రీశైలంలో 854 అడుగుల లెవల్‌ నీరు మెయిన్‌టైన్‌ చేస్తూ గండికోట, పోతిరెడ్డిపాడు, పైడిపాలెం, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టులను ఐదేళ్లలో మహానేత వైయస్‌ఆర్‌ పూర్తి చేశారన్నారు. కానీ చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో శ్రీశైలం నీటిమట్టం అడుగంటిందని, రాయలసీమకు నీరు ఎక్కడి నుంచి ఇస్తామని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ప్రాజెక్టులపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.  ఉంటే గండికోట నుంచి పైడిపాలెంకు లిఫ్ట్‌ చేసి అక్కడి నుంచి చిత్రావతికి పోయే ప్రాజెక్టు, గండికోట ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించి జీఓ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి పులివెందులకు నీరు ఇచ్చానని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 

గత కొన్ని రోజుల పది డిగ్రీల వేడి తగ్గించేందుకు సూర్యడితో చర్చలు జరిపిన చంద్రబాబు వ్యవసాయంలో కొత్తరకం పంటసాగును తీసుకొచ్చారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏరువాక కార్యక్రమం ద్వారా పొడి నేలలో వరినాట్లు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారన్నారు. తన కాళ్లకు బురద అంటకుండా పొడినేలలో వరినాట్లు వేస్తూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. దీన్ని అబ్బో చంద్రబాబు గారూ అంటూ ప్రచారం చేశారన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్లు పరిపాలించారు.. చంద్రబాబు రెండు టర్మ్‌లు అయిపోయి ఇప్పుడు మూడోటర్మ్‌. వైయస్‌ఆర్‌ ఐదేళ్ల పాలన చూసి ఓట్లేయండి అని 2009 ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి విజయం సాధించారు. మూడు దఫాలుగా పరిపాలన చేస్తున్న చంద్రబాబుకు తనపాలనపై తనకు నమ్మకం ఉంటే ప్రజల్లోకి వెళ్లాలని గడికోట సూచించారు. ఇవన్నీ డ్రామాలు ఎందుకు.. పాలన చూపించి ఓట్లడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ప్రజల అభిమానం ఉన్న నాయకుడికి ఇన్ని డ్రామాలు అవసరమా అని ప్రశ్నించారు. 
Back to Top