ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యం

సర్ ప్రక్రియపై వైయ‌స్ఆర్‌సీపీ నిరంతర పర్యవేక్షణ: డా. సాకే శైలజానాథ్

అనంతపురం: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోకుండా వైయ‌స్ఆర్‌సీపీ క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ తెలిపారు. ఓటర్ల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పార్టీ ప్రతి దశను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. నార్పల మండలంలోని బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) కలిసిన ఆయన, వారు వినియోగిస్తున్న మొబైల్ అప్లికేషన్ ద్వారా ఓటర్ల వివరాల నమోదును స్వయంగా పరిశీలించారు. వివరాల నమోదు విధానం, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై బీఎల్ఏలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం నార్పల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించిన డా. శైలజానాథ్, సంబంధిత అధికారులతో సమావేశమై ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేర్చబడకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని తెలిపారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, బీఎల్ఏలు పూర్తి అప్రమత్తతతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు ఖాదర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, పార్టీ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జ్ మంజునాథ్ యాదవ్, బీఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top