ప్రభుత్వ భూములు ఆక్రమించింది టీడీపీ నేతలే..

విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ కుట్ర చేస్తోంది

కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకుంటే విమర్శలు చేస్తారా..?

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు

వైయస్‌ఆర్‌ సీపీ నేత, విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ధ్వజం

విశాఖపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖలో ఒక్క గజం భూమి కూడా కబ్జాకు గురైన పరిస్థితులు లేవని, చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన భూఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకుంటున్నామ‌ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఎల్లో మీడియా అభూత కల్పనలు సృష్టిస్తూ తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక టీడీపీ, ఎల్లోమీడియా కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 

విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ పక్కరాష్ట్రంలో కూర్చొని వాస్తవాలు తెలుసుకోకుండా ట్విట్టర్, జూమ్‌ ద్వారా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు చంద్రబాబు దూరం కాబట్టే ప్రజలు ఆయన్ను దూరం పెట్టి.. పక్కరాష్ట్రానికి పరిమితం చేశారన్నారు. 

విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించింది తెలుగుదేశం పార్టీ నేతలేనని వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. ఆధారాలతో సహా పలు సందర్భాల్లో టీడీపీ నేతలు భూబాగోతం బయటపడిందన్నారు. పేలా గోవింద్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్‌బాబు లాంటి వాళ్లు ప్రభుత్వ భూములు ఆక్రమించారన్నారు. టీడీపీ నేత పల్లా శ్రీను 56 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడన్నారు. గంటా శ్రీనివాసరావు, పేలా గోవింద్, రామకృష్ణ బాబు ఆక్రమించిన భూములను వెనక్కు తీసుకుంటే కబ్జాలు చేస్తున్నట్టా..? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు, వెలగపూడి, బండారు సత్యనారాయణ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దమ్మూ, ధైర్యం ఉంటే కబ్జా చేయలేదని నిరూపించుకోవాలన్నారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారన్నారు. విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు ఒడిగడుతోందని ఫైరయ్యారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పరని, కచ్చితంగా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయమన్నారు. 
 

Back to Top