సజ్జల భార్గవ్‌కు పార్టీ సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేదు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం

తాడేపల్లి:  సజ్జల భార్గవ్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు.  తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అంటే “డీప్ ఫేక్ పార్టీ” అని మండిప‌డ్డారు. అలాంటి పార్టీ తమపై డీప్‌ఫేక్ వీడియో సృష్టించారని కేసులు పెట్టడం అవివేకమని ధ్వ‌జమెత్తారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ “ఎం సిక్స్ ఫార్ములా” అమలు చేస్తూ నడుస్తోందని, మార్ఫింగ్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టడమే వారి రాజకీయ శైలి అని ఆరోపించారు. తిరుమల లడ్డూ వంటి పవిత్ర అంశానికీ కళ్లు పెట్టి మార్ఫింగ్ వీడియోలు చేయడం టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. “ఎఫ్ టీన్ ఫైల్స్” పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ ఎలాంటి వీడియోలు చేయలేదని స్పష్టం చేసిన ఆయన, సజ్జల భార్గవ్‌కు పార్టీ సోషల్ మీడియాతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బయట ఎవరెవరో చేసే వీడియోలకు తమకేం సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాను భయపెట్టేందుకే మళ్లీ డీప్ ఫేక్ వీడియో అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ ప్రసాదం అంశంలో నారా చంద్రబాబు నాయుడు దొరికిపోయారని, ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికే డీప్ ఫేక్ కథ అల్లారని విమర్శించారు. “రెడ్ బుక్” అంటూ మాట్లాడుతున్న నారా లోకేష్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే ఇవ్వాలని ప్రజలు ‘మైండ్ బుక్’లో రాసుకున్నారని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు.
 

Back to Top