తాడేపల్లి: నారా లోకేష్‌కు వైయస్ జగన్‌ను సవాల్ చేసే స్థాయి లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రంగా విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..శాసనమండలిలో చర్చకు రాలేక వెనక్కి వెళ్లిన వ్యక్తి.. ఇప్పుడు జగన్‌ను సవాల్ చేస్తానంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా సవాళ్లు, బెదిరింపుల రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రెడ్‌బుక్ పేరుతో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని వంగవీటి నరేంద్ర విమర్శించారు. రెడ్‌బుక్‌కు భయపడే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ ఇప్పటికే కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్‌ను ఏర్పాటు చేసిందని, ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తుల వివరాలను నమోదు చేసి చట్టపరమైన చర్యల కోసం న్యాయపోరాటం చేస్తామని పార్టీ గతంలో ప్రకటించింది. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను ప్రశ్నిస్తూ శాప్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేపడితే దాడులు చేయడం ఏమిటని నరేంద్ర ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులను శాప్ కార్యాలయం వద్దకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. దాడులు, బెదిరింపులకు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు, బెదిరింపులకు బదులుగా ప్రజా సమస్యలపై చర్చకు రావాలని ఆయన కోరారు.