స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

ఎమ్మెల్సీ విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే కళావతి

 పాలకొండ: వీరఘట్టం మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శ్రీ కోదండ రామ కల్యాణ మండపంలో మండల పార్టీ కన్వీనర్‌ దమలపాటి వెంకటరమణ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ, పాలకొండ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ పరిశీలకులు పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇటీవల గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన పార్టీ కమిటీల్లోని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే కళావతి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కళావతి పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించే ఉద్దేశంతో రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ విక్రాంత్‌ సూచించారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఇంటి పన్ను, ఇతర ప్రభుత్వ బకాయిలను చెల్లించి నిరభ్యంతర పత్రాలను ముందుగానే పొందాలని సూచించారు. ప్రతి స్థానానికి అభ్యర్థితో పాటు డమ్మీ నామినేషన్‌ దాఖలు చేసేలా స్థానిక నాయకత్వం ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

బీసీలకు వైయ‌స్‌ జగన్‌ హయాంలో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని విక్రాంత్‌ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయ లబ్ధి కోసం జీవోల పేరుతో మోసం చేయకుండా న్యాయపరమైన స్పష్టత ఇవ్వాలని కోరారు. నిజంగా బీసీలకు మేలు చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసి చూపించాలని అన్నారు.

సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కర్రీ లీలా ప్రసాదరావు, కర్రీ గోవిందరావు, పొట్నూరు లక్ష్మణరావుతో పాటు పట్టణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ కార్పొరేషన్‌ అధ్యక్షులు, డైరెక్టర్లు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top